Tomato Upma: టమోటా ఉప్మాని ఒక్కసారి తిన్నారంటే, వారంలో రెండు మూడు సార్లు మీరే చేసుకుంటారు
Tomato Upma: సాధారణ ఉప్మా బోర్ కొడితే ఒకసారి టమాటా ఉప్మా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చాలా తక్కువ సమయంలోనే వండేయచ్చు.
Tomato Upma: వారంలో ప్రతి ఇంట్లో ఒక్కసారైనా ఉప్మా ఉంటుంది. ఉప్మాని ఇష్టపడే వారి సంఖ్య తక్కువే. కానీ దాన్ని వండే విధంగా, చక్కగా వండితే టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి టమోటా ఉప్మాను ట్రై చేయండి. దీన్నే టమోటా బాత్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు సులువుగా తినడానికి సులువుగా ఉంటుంది. నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
టమోటో ఉప్మా రెసిపీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - ఒక కప్పు
టమోటాలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
బఠానీలు - పావు కప్పు
పచ్చిమిర్చి - ఒకటి
అల్లం తరుగు - ఒక స్పూను
క్యారెట్ - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కరివేపాకు - గుప్పెడు
ఆవాలు - ఒక స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూన్
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
నెయ్యి - రెండు స్పూన్లు
నీళ్లు - తగినన్ని
శనగపప్పు - ఒక స్పూను
టమోటో ఉప్మా రెసిపీ
1. ఉప్మా రవ్వని కళాయిలో వేసి చిన్న మంట మీద వేయించాలి.
2. పచ్చివాసన పోయేదాకా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి, నూనె కలిపి వేయాలి.
4. అందులో జీడిపప్పులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు వేసి వేయించాలి.
6. అవి వేగాక ఉల్లిపాయల తరుగును వేసి వేయించుకోవాలి.
7. ఉల్లిపాయలు కాస్త రంగు మారేవరకు ఉంచాలి.
8. తర్వాత పచ్చిమిర్చి, అల్లం తరుగును వేసి వేయించుకోవాలి.
9. ఉల్లిపాయలు వేగాక బఠానీలు, క్యారెట్ తరుగును వేసి బాగా కలుపుకోవాలి. పైన మూత పెడితే అది త్వరగా ఉడుకుతాయి.
10. మూత తీసి పసుపు, కరివేపాకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి.
11. తర్వాత టమోటో తరుగును కూడా వేయాలి. ఇప్పుడు మూత పెట్టి అవి మెత్తగా ఉడికే దాకా ఉంచాలి.
12. టమోటో మెత్తగా అయ్యాక నీళ్లు పోయాలి. పైన మూత పెట్టి నీళ్లు సలసలా కాగేదాకా ఉంచాలి.
13. తర్వాత స్టవ్ చిన్న మంట మీద పెట్టి ముందుగా వేయించుకున్న రవ్వను మెల్లగా కలుపుతూ వేయాలి.
14. చిన్న మంట మీదే ఈ ఉప్మాను చేయాలి. ఉప్మా దగ్గరగా అయ్యాక పైన కొత్తిమీరను, జీడిపప్పును జల్లుకోవాలి.
15. అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే టేస్టీ టమాటా ఉప్మా రెడీ అయినట్టే. దీన్ని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.
సాధారణ ఉప్మాతో పోలిస్తే టమాటా ఉప్మా ఆరోగ్యానికి మంచిది. దీనిలో క్యారెట్లు, ఉల్లిపాయలు, పసుపు, టమోటోలు వంటివి ఎక్కువగా వేసాము. కాబట్టి ఇవన్నీ మన శరీరానికి పోషకాలను అందిస్తాయి. అలాగే పిల్లలకు తినడానికి సులువుగా ఉంటుంది. జీడిపప్పులు, నెయ్యి దీని రుచిని మరింతగా పెంచుతాయి. ఒక్కసారి దీన్ని మీరు లంచ్ బాక్స్ రెసిపీలో పెట్టి చూడండి. పిల్లలకు కచ్చితంగా నచ్చుతుంది. పెద్దలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.
టాపిక్