Tomato Oats: కమ్మగా, పుల్లగా టమాటా ఓట్స్.. చలికాలంలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్..
Tomato Oats: ఉదయం అల్పాహారంలోకి వేడిగా, పుల్లగా టమాటా ఓట్స్ చేసుకుని చూడండి. చాలా రుచిగా ఉంటాయి. తయారీ కూడా సులభమే.
టమాటా ఓట్స్ (flickr)
చలికాలంలో వేడిగా, కారంగా, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు సింపుల్‌గా అయిపోయే ఈ టమాటా ఓట్స్ ప్రయత్నించండి. ఎప్పుడూ తినే ఓట్స్ కాకుండా ఇవి కాస్త పుల్లగా ఉంటాయి. రుచిని బట్టి టమాటాలు ఎక్కువా, తక్కువా వేసుకోవచ్చు. వాటి తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
టమాటా ఓట్స్ కోసం కావాల్సిన పదార్థాలు:
1 కప్పు ఓట్స్
2 పెద్ద టమటాలు, సన్నటి ముక్కలు
2 చెంచాల నెయ్యి
పావు చెంచా జీలకర్ర
చిన్న అంగుళం ముక్క
2 పచ్చిమిర్చి
1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు
పావు టీస్పూన్ పసుపు
పావు చెంచా కారం
పావు చెంచా ధనియాల పొడి
పావు చెంచా గరం మసాలా
తగినంత ఉప్పు
గుప్పెడు బటానీలు
కొద్దిగా కొత్తిమీర తరుగు
టమాటా ఓట్స్ తయారీ విధానం:
- ఒక కడాయిలో నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
- అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని రంగు మారేదాకా వేయించుకోవాలి.
- కాసేపాగి మసాలాలన్నీ వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని వేగనివ్వాలి. ఒక నిమిషం వేగాక సన్నటి టమాటా ముక్కలు, ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి.
- అవి మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. కాస్త ముక్క మెత్తబడ్డాక బటానీలు కూడా వేసుకుని ఒక కప్పు ఓట్స్‌కు నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి. అవి ఒక ఉడుకు వచ్చేదాకా ఆగాలి.
- అందులో కప్పు ఓట్స్ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఒక నిమిషంలో ఓట్స్ మెత్తగా ఉడికిపోతాయి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే సరిపోతుంది. టమాటా ఓట్స్ రెడీ.