Oats For Breakfast: బ్రేక్‌పాస్ట్‌‌లోకి ఓట్స్‌ తినడం మంచిదేనా?-is it fine to eat oats for breakfast regularly know in detail ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats For Breakfast: బ్రేక్‌పాస్ట్‌‌లోకి ఓట్స్‌ తినడం మంచిదేనా?

Oats For Breakfast: బ్రేక్‌పాస్ట్‌‌లోకి ఓట్స్‌ తినడం మంచిదేనా?

HT Telugu Desk HT Telugu
Oct 20, 2023 06:30 AM IST

Oats For Breakfast: ఉదయాన్నే అల్పాహారంలోకి చాలా మంది ఓట్స్ తినడం మామూలే. అయితే అలా తినడం మంచిదో కాదో తెలుసుకోండి.

ఓట్స్
ఓట్స్

ఇటీవల కాలంలో ఓట్స్‌ వాడకం మన దగ్గరా చాలా పెరిగిందనే చెప్పవచ్చు. ఇప్పుడు ఓట్స్‌ని పోషకాల టిఫిన్‌గా అంతా భావిస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. వీటిలో ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, పొటాషియం, ఐరన్‌, విటమిన్‌ బీ6, మెగ్నీషియం, కాల్షియం.. లాంటివి లభిస్తాయి. అందుకనే దీన్ని ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ ఆప్షన్‌గా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలా అని ఉదయం పూట రోజూ వీటినే తినొచ్చా? తింటే ఏమవుతుంది? తెలుసుకుందాం..

జీర్ణ వ్యవస్థ బాగుంటుంది:

ఓట్స్‌లో డైటరీ ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మొత్తం మెరుగుపడుతుంది. మల బద్ధకం సమస్యలు తగ్గు ముఖం పడతాయి. పేగులు మరింత ఆరోగ్యకరంగా మారతాయి. ఓట్స్‌ ప్రో బయోటిక్‌గానూ పని చేస్తాయి. అందువల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఏది తిన్నా చక్కగా జీర్ణం అవుతుంది.

శక్తిని పెంచుతాయి:

రోజూ ఉదయాన్నే ఓ కప్పు ఓట్స్‌ని తినడంతో మొదలు పెట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. కాబట్టి అవి తొందరగా జీర్ణం కావు. మెల్లగా అరుగుతూ ఎక్కువ సేపటి వరకు శక్తిని ఇస్తూ ఉంటాయి. ఉదయాన్నే నీరసంగా ఉండే వారికి కచ్చితంగా ఇది మంచి అల్పాహారం అని చెప్పవచ్చు.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి:

ఓట్స్‌ రోజూ ఉదయాన్నే తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్‌ నిల్వలు తగ్గి మంచి కొలస్ట్రాల్‌ నిల్వలు పెరుగుతాయి. అందువల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఎవరైతే గుండె ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారో వారు కచ్చితంగా వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

బరువును నియంత్రణలో ఉంచుతాయి:

ఊబకాయంతో బాధ పడేవారు, బరువు పెరగకుండా ఉండాలని భావించే వారు రోజూ ఉదయం ఓట్స్‌ తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి. అందువల్ల కొంచెం తినే సరికి పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీనిలో ఉండే సోల్యుబుల్‌ ఫైబర్‌ మనలోని కొలస్ట్రాల్‌ని నియంత్రిస్తుంది. దీనితోపాటుగా రక్తంలో చక్కెరల్ని తగ్గిస్తుంది. వీటి వల్ల బరువు నియంత్రణలో ఉండటం తేలిక అవుతుంది.

మధుమేహం రాకుండా ఉంటుంది:

కుటుంబ చరిత్రల్లో మధుమేహం ఎక్కువగా ఉన్న వారు కచ్చితంగా వారి ఉదయపు అల్పాహారంగా ఓట్స్‌ని తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని ఒక్కసారిగా పెరిగిపోనీయవు. దీని వల్ల మధుమేహం రిస్క్‌ చాలా వరకు తగ్గుతుంది.

Whats_app_banner