Good Fats Vs Bad Fats: మనం తినే కొవ్వులన్నీ కొలస్ట్రాల్‌గా మారతాయా? ఏవి మంచివి? ఏవి చెడ్డవి?-good fats vs bad fats know the difference and food sources ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Good Fats Vs Bad Fats: మనం తినే కొవ్వులన్నీ కొలస్ట్రాల్‌గా మారతాయా? ఏవి మంచివి? ఏవి చెడ్డవి?

Good Fats Vs Bad Fats: మనం తినే కొవ్వులన్నీ కొలస్ట్రాల్‌గా మారతాయా? ఏవి మంచివి? ఏవి చెడ్డవి?

HT Telugu Desk HT Telugu
Sep 18, 2023 03:30 PM IST

Good Fats Vs Bad Fats: కొవ్వుల్లేని ఆహారం తినడం కష్టమే. అయితే మనం తినే తిండిలో మంచి కొవ్వుందా, చెడు చేసే కొవ్వుందా అనే విషయం మీద అవగాహన మాత్రం తప్పనిసరి. ఆ విషయంలో స్పష్టత తెచ్చుకుంటే మంచి ఆహారం తీసుకోవచ్చు.

మంచి కొవ్వులు vs చెడ్డ కొవ్వులు
మంచి కొవ్వులు vs చెడ్డ కొవ్వులు (pexels)

మనం రోజువారీ ఆహారంలో జిడ్డుగా ఉండే నూనెలు, నెయ్యి లాంటి వాటిని తింటుంటాం. అలాగే మనం తినే డ్రై ఫ్రూట్స్‌, మాంసాలు, చేపల్లాంటి వాటిలోనూ కొవ్వు ఉంటుంది. అలాగే మన నూడుల్స్‌, పాస్తా, బిస్కెట్లు... లాంటి ప్యాక్డ్‌ ఫుడ్స్‌ని తింటుంటాం. వీటి ప్యాకెట్లపై శాచ్యురేటెడ్‌, అన్‌ శాచ్యురేటెడ్‌, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అని రాస్తుంటారు. వీటిల్లో వేటిని తినడం వల్ల మనకు మంచి జరుగుతుంది? వేటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి. కొవ్వుల్ని ప్రధానంగా నాలుగు రకాలుగా విభజిస్తారు. ఫ్యాటీ యాసిడ్లు, లిపిడ్లు, నూనెలు, జంతు, మొక్కలకు సంబంధిత కొవ్వులు. మరి వీటిలో ఏవి మంచి కొవ్వులు ఏవి చెడ్డ కొవ్వులు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందువల్ల మనం తినేటప్పుడు ఈ విషయంలో అవగాహనతో ఉంటాం.

మంచి కొవ్వులు :

బాదాం, వాల్‌నట్స్‌, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, వేరుసెనగ గింజలు, అవకాడో లాంటి వాటిల్లోనూ కొవ్వులు ఉంటాయి. వీటిని అన్‌ శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అంటారు. వీటిని అలాగే తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన మంచి ప్రభావాలను చూపుతాయి. పైగా వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

  • ఆలివ్‌, పొద్దుతిరుగుడు, వేరుసెనగ, నువ్వులు, సోయా నూనెల్లాంటి వాటిని మనం ఎక్కువగా వంట నూనెలుగా వాడుతుంటాం. వీటిని ఎలాంటి కల్తీ లేకుండా నేరుగా తినడం వల్ల అవి మన ఆరోగ్యంపై పెద్దగా దుష్ప్రభావాన్ని కలిగించవు. అయితే ఇక్కడ మనం వాడే నూనెలన్నీ రిఫైన్డ్‌ ఆయిల్స్‌. అందువల్ల వాటిని ముందుగానే వేడి చేసి ప్రోసెస్‌ చేస్తారు. దీంతో అవి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని గుర్తుంచుకోవాలి. ఇంట్లో తిన్నా మనం వాటిని బాగా వేడి చేసి తినడం వల్ల అవి దుష్ప్రభావాలను చూపిస్తాయి.

చెడ్డ కొవ్వులు :

ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అనే పదాన్ని మనం చాలా ప్యాక్డ్‌ ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద చూస్తూ ఉంటాం. ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్‌ని పెంచే విధంగా ఉంటాయి. వేయించిన ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ఈ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ చేరతాయి. కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాలు, ఫ్రెంచ్‌ ఫ్రైలు, పొటాటో చిప్స్‌, పాప్‌కార్న్‌, బిస్కెట్లు, ఐస్‌ క్రీంలు, ఛీజ్‌లాంటి పదార్థాల్ని తినడం వల్ల ఈ చెడ్డ కొవ్వులనేవి మన శరీరంలోకి వస్తాయి. చెడు కొవ్వులు మనలోకి ఎక్కువగా చేరడం వల్ల రక్త నాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్‌, క్యాన్సర్‌, ఊబకాయం తదితర సమస్యలు తలెత్తుతాయి.

Whats_app_banner