Podi or Karam Idli: ఇంట్లోనే టేస్టీగా కారం ఇడ్లీ ఎలా చేసుకోవచ్చంటే..
Podi or Karam Idli: ఇంట్లోనే పొడి ఇడ్లీ లేదా కారం ఇడ్లీ రుచిగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక మసాలా పొడిని సిద్ధం చేసుకుంటే చాలు. అదెలాగో వివరంగా తెల్సుకోండి.
పొడి ఇడ్లీ (flickr)
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న పొడి ఇడ్లీ లేదా కారం ఇడ్లీ ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికోసం ఒక స్పెషల్ మసాలా పొడి సిద్ధం చేసి పెట్టుకుంటే చాలు. దాన్నే చాలా రోజులు వాడుకోవచ్చు. ఈ పొడి చల్లి కాస్త నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే గీ కారం ఇడ్లీ కూడా రెడీ అయినట్లే. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
1/8 కప్పు నువ్వులు
4 చెంచాల నువ్వుల నూనె లేదా ఏదైనా వంటనూనె
10 ఎండుమిర్చి
1 కరివేపాకు రెమ్మ
పావు కప్పు శనగపప్పు
సగం కప్పు మినప్పప్పు
సగం టీస్పూన్ ఇంగువ
తగినంత ఉప్పు
తాలింపు కోసం:
పావు టీస్పూన్ ఆవాలు
కరివేపాకు రెబ్బ
సగం చెంచా కారం
తయారీ విధానం:
- ముందుగా నూనె లేకుండా కడాయిలో నువ్వులను వేయించుకోవాలి. కాస్త రంగు మారాక బయటకు ప్లేట్ లో తీసుకోవాలి.
- అందులోనే శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుని రంగు మారేదాకా వేయించుకోవాలి. వీటని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.
- అదే కడాయిలో 1 చెంచా నూనె వేసుకుని ఎండు మిర్చి వేసుకుని వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకుని కరకరలాడేదాకా వేయించుకుని, వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే ఇడ్లీ కారం లేదా ఇడ్లీ పొడి.
- ఇప్పుడు ఇడ్లీలను తాలింపు పెట్టుకోడానికి ముందుగా పెద్ద సైజు ఇడ్లీలు లేదా బటన్ ఇడ్లీలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి.
- కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఒక చెంచాడు, కాస్త కారం కూడా వేసుకుని కలుపుకోవాలి.
- ఇప్పుడు ఇడ్లీలు వేసుకుని బాగా కలియబెట్టాలి. పొడి అంతా ఇడ్లీలకు బాగా అంటుకునే లాగా కలపాలి. ఒక నిమిషం అలా కలియబెట్టాక సర్వ్ చేసుకుంటే సరి. కాస్త నెయ్యి కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే నెయ్యి కారం ఇడ్లీ రెడీ అయినట్లే.