Rava Paratha: ఉప్మా రవ్వతో టేస్టీ పరోటా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది-rava paratha recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rava Paratha: ఉప్మా రవ్వతో టేస్టీ పరోటా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది

Rava Paratha: ఉప్మా రవ్వతో టేస్టీ పరోటా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

Rava Paratha: పరోటా అనగానే మైదా, గోధుమ పిండితో చేసేదే అనుకుంటారు. ఉప్మా రవ్వతో టేస్టీ పరోటా వండవచ్చు. ఇది టేస్టీగా ఉంటుంది.

ఉప్మా రవ్వ పరోటా రెసిపీ (pixabay)

Rava Paratha: పరోటా అనగానే అందరికీ గుర్తొచ్చేది మైదా, గోధుమ పిండితో చేసేవే. కేవలం మైదా, గోధుమపిండి మాత్రమే కాదు ఉప్మా రవ్వతో కూడా మెత్తని పరోటాలు చేసుకోవచ్చు. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. నెయ్యితో కాలిస్తే చాలా రుచిగా ఉంటాయి. మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీగా రవ్వ పరోటా అని చెప్పుకోవచ్చు. పిల్లలకి ఇది చాలా నచ్చుతుంది. ఇది మెత్తగా ఉంటాయి, కనుక పెద్దగా నమలాల్సిన అవసరం లేదు. కాబట్టి పిల్లలు సులువుగానే తినేస్తారు. ఒక్కసారి పిల్లలకు వీటిని పెట్టి చూడండి. ఈ ఉప్మా రవ్వ పరోటా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

రవ్వ పరోటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఉప్మా రవ్వ - ఒక కప్పు

గోధుమపిండి - అరకప్పు

నీళ్లు - సరిపడినన్ని

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - రెండు స్పూన్లు

రవ్వ పరోటా రెసిపీ

1. ఉప్మా రవ్వని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2. స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు వేయాలి. ఆ నీళ్లలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

3. నీళ్లు సలసలా కాగుతున్నప్పుడు మంటను తగ్గించి రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి.

4. ఇలా చేస్తే ముద్ద కట్టకుండా ఉంటుంది. ఈ రవ్వ ముద్ద గట్టిగా, మందంగా అయ్యేవరకు కలుపుకోవాలి.

5. అలా అయ్యాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చేత్తో నలుపుకోవాలి.

6. అందులోనే గోధుమపిండిని వేసి పిండి ముద్దను గట్టిగా చేసుకోవాలి.

7. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పరోటాలాగా ఒత్తుకోవాలి.

8. వీటిని స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేసి ఈ పరోటాని రెండు వైపులా కాల్చుకోవాలి.

9. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మెత్తగా కూడా వస్తాయి.

10. దీన్ని చికెన్ కర్రీ, మటన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది.

11. శాకాహారులు పనీర్ కర్రీతో ఈ రవ్వ పరోటాను ట్రై చేయండి. రుచి మాములుగా ఉండదు.

ఇప్పుడు ఒకేలాంటి పరోటాలు తినడం బోరుగా అనిపిస్తుంది. ముఖ్యంగా బయట మార్కెట్లలో ఎక్కువగా మైదాతో చేసిన పరోటాలనే అమ్ముతారు. మైదా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో అయితే గోధుమపిండి పరోటాలు లభిస్తాయి. కానీ రెస్టారెంట్లలో మాత్రం కేవలం మైదా పరాటాలు లభిస్తాయి. కాబట్టి మీరు ఇంట్లోనే గోధుమపిండి, ఉప్మా రవ్వ కలిపి టేస్టీగా పరోటాలను చేసుకోండి. ఇవి మెత్తగా, మృదువుగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు వీటిని బంగాళదుంప కర్రీతో పెడితే ఇష్టంగా తింటారు. అదే పెద్దవాళ్ళు అయితే వారికి నచ్చిన కర్రీతో తినవచ్చు. ఒకసారి ఈ రవ్వ పరోటా ట్రై చేసి చూడండి. మళ్ళీ వీటిని చేసుకోవాలని మీకే అనిపిస్తుంది. వీటిని తయారు చేయడానికి అరగంట సమయం పడుతుంది. కాబట్టి ఉదయం పూట వీటిని అల్పాహారంలా తయారుచేసుకోవచ్చు. రాత్రి డిన్నర్లో కూడా ఈ పరోటాలు చాలా బావుంటాయి.