Mukesh Ambani Diet: బిలియనీరైన ముఖేష్ అంబానీ తినే ఆహారం ఇదే, ఆయన రోజూ ఏం తింటారంటే...
Mukesh Ambani Diet: ముఖేశ్ అంబానీ ఆసియాలోనే ధనవంతుడిగా పేరుపొందారు. కానీ ఆయన తినే ఆహారం మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. ముఖేశ్ అంబానీ డైట్ పై నీతా అంబానీ కొన్ని వివరాలను అందించారు.
Mukesh Ambani Diet: అనంత్ అంబానీ వివాహంతో అంబానీల పేరు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ. అతను తన ప్రేయసి రాధిక మర్చంట్‌ను వివాహమాడుతున్నారు. ఈ సందర్భంగా అంబానీల కుటుంబం దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తోంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని నీతా అంబానీ సందర్శించారు. అక్కడ ఆమె ఒక చిన్న దుకాణంలో ఆలూ చాట్ టేస్ట్ చూశారు. ఆ సమయంలో ఆమె తన భర్త గురించి స్థానికులతో కాసేపు మాట్లాడారు.
శాకాహారమా? మాంసాహారమా?
తన భర్తతో పాటూ కుటుంబమంతా బయట ఆహారాన్ని తినడానికి ఇష్టపడమని చెప్పారు నీతా అంబానీ. ముకేశ్ అంబానీ ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే ఇష్టపడతారని అన్నారు. ఆయన పూర్తి శాకాహారి అని చెప్పారు. వారానికి ఒకసారి మాత్రమే బయట తినేందుకు ఇష్టపడతారని వివరించారు. ఆయన కఠినమైన డైట్ ను పాటిస్తారని చెప్పారు నీతా అంబానీ. అందుకే ముఖేష్ అంబానీ ఎలాంటి వ్యాయామాలు చేయకుండానే 15 కిలోలు తగ్గినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆయన తేలికపాటి ఆహారాన్ని తింటూనే బరువు తగ్గారు.
ముఖేశ్ అంబానీ ఉదయం ఐదున్నరకే నిద్రలేస్తారు. ఆయన ధ్యానం చేసేందుకు ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి మనసు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యమని ముఖేష్ అంబానీ నమ్ముతారు. అందుకే ప్రతిరోజు యోగా సాధన, ధ్యానం కోసం ఉదయం సమయంలో కొంత సమయాన్ని కేటాయిస్తారు. వాకింగ్ చేయడానికి ఇష్టపడతారు. తీవ్రమైన షెడ్యూల్ ఉన్నా కూడా వాకింగ్ చేయడం మాత్రం మరిచిపోరు.
ముఖేష్ అంబానీ తినే ఆహారం ఇదే
ఉదయం ఆహారంలో భాగంగా అల్పాహారంలో భాగంగా తాజా పండ్లు, పండ్ల రసాలు, ఇడ్లీ సాంబార్ వంటి తేలికపాటి ఆహారాన్ని తింటారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్ వంటివి ఆయన డైట్లో ఉండవు. ఇక మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం విషయానికి వస్తే సలాడ్లు, పప్పు అన్నం, హెల్దీ సూప్‌లు, ఇంట్లో వండిన కూరలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా అంబానీల ఇంట్లో అన్ని వంటలు సాంప్రదాయ గుజరాతీ శైలిలోనే ఉంటాయి. మిగతా అంబానీ గుజరాతీ స్నాక్స్‌లను చాలా ఇష్టపడతారు.
నీతా అంబానీకి పంకీ అని పిలిచే గుజరాతి స్నాక్ అంటే చాలా ఇష్టం. దీన్ని బియ్యప్పిండితో చేస్తారు. దీని తయారీలో అరటి ఆకులను కూడా వినియోగిస్తారు. అరటి ఆకులతో వండిన వంటలకు సహజమైన రుచి వస్తుందని, అలాగే పోషకాలతో నిండి ఉంటుందని నీతా అంబానీ నమ్మకం. అలాగే అరటి ఆకులలో సహజమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాని చంపడానికి సహాయపడతాయి. అందుకే అరటి ఆకుల్లో వండిన పంకీ అనే స్నాక్ ను ఇష్టంగా తింటారు. అంబానీ కుటుంబం వారి తినే స్నాక్స్ లో ఎక్కువగా బియ్యప్పిండితో చేసిన ఆహారాలే ఉంటాయి. నెయ్యితో వండిన వంటకాలు అధికంగానే ఉంటాయి. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకుంటారు.
అంబానీల కుటుంబంలో అనంత్ అంబానీ అతిగా బరువు పెరిగారు. ఆయన ఆస్తమా సమస్య వల్ల ఎక్కువ స్టెరాయిడ్లను వాడి ఇలా అధిక బరువును బారిన పడ్డారు. బరువు తగ్గేందుకు అనంత్ కూడా పూర్తి శాకాహారాన్ని మాత్రమే తింటున్నారు. రోజులో ఎక్కువసార్లు చిన్నచిన్న మొత్తాలలో భోజనాన్ని తినడం అలవాటు చేసుకున్నారు. ఇది ఆరోగ్యకరమైన జీవన శైలి అని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. వ్యాయామం చేయడం, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం ఇవే అంబానీల ఆరోగ్య రహస్యాలు.
టాపిక్