Saturday Motivation: ముఖేష్ అంబానీ నుండి ఎలన్ మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకున్న అలవాట్లు ఇవే-these are the habits of successful billionaires from mukesh ambani to elon musk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation: ముఖేష్ అంబానీ నుండి ఎలన్ మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకున్న అలవాట్లు ఇవే

Saturday Motivation: ముఖేష్ అంబానీ నుండి ఎలన్ మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకున్న అలవాట్లు ఇవే

Haritha Chappa HT Telugu
Jun 29, 2024 05:00 AM IST

Saturday Motivation: ప్రపంచవ్యాప్తంగా అనేకమంది విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు. తమ లక్ష్యాలను సాధించడానికి వారు ఎంతో కృషి చేశారు. ముకేశ్ అంబానీ నుండి మస్క్ వరకు విజయవంతమైన బిలియనీర్లకు ఉన్న కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.

బిలియనీర్లకు ఉన్న అలవాట్లు
బిలియనీర్లకు ఉన్న అలవాట్లు

Saturday Motivation: ఒక వ్యక్తి విజయం సాధించాడంటే అతనికి కచ్చితంగా కొన్ని మంచి లక్షణాలు, మంచి అలవాట్లు ఉంటాయి. వారి ప్రయాణాన్ని ప్రారంభించడానికి వారు ఆ మంచి అలవాట్లనే పునాదులుగా చేసుకుని ఉంటారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది విజయవంతమైన వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడంలో వారికి సహకరించిన అలవాట్ల గురించి చాలా సార్లు చెప్పారు. అలాంటి అలవాట్లను ఇక్కడ మేము ఇచ్చాము. మీరు కూడా జీవితంలో ఎదగాలనుకుంటే ఈ అలవాట్లలో కొన్నింటిని అయినా పాటించండి. కచ్చితంగా మీకు విజయం దక్కే తీరుతుంది.

yearly horoscope entry point

ఉదయానే లేవడం

ముఖేష్ అంబానీ నుంచి మస్క్ వరకు కోట్లకు అధిపతులు అయిన వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తెల్లవారుజామున 5:30 గంటలకే నిద్రలేస్తారు. ఇది వారి ఫిట్నెస్ కు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వారిలో ప్రోడక్టివిటీని పెంచడంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సమయానికి నిద్రపోవడం తెల్లవారుజామునే లేవడం అనేది ప్రతి ఒక్కరూ పాటించవలసిన అలవాటు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బిలియనీర్ బిల్ గేట్స్ తాను ఏడాదికి 50 పుస్తకాలు చదువుతానని చెప్పారు. ఇలా చదవడం వల్ల తమలో అవగాహన, మానసిక ఎదుగుదల పెరుగుతాయని వివరించారు. బిల్ గేట్స్ మాత్రమే కాదు ఎంతో మంది బిలియనీర్లు పుస్తక పఠనం అలవాటుగా ఉంది. ఇలా పుస్తకాలు చదివేవారు చాలా సమర్థవంతంగా పనిచేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. వారి ఆలోచన శైలి భిన్నంగా ఉంటుందని, వారు చాలా విశాలమైన దృక్పథాలను కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ముందుగా మీరు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోండి.

జెఫ్ బెజోస్ వంటి వ్యాపారవేత్తలు ప్రతి రోజును వ్యాయామంతోనే మొదలుపెడతారు. ఉదయం లేచిన తర్వాత తమ శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం అలవాటు మాత్రమే కాదు, ఎంతోమంది ఉదయం కనీసం అరగంట నుంచి గంట వరకు వివిధ రకాల వ్యాయామాలు చేయడంలో బిజీగా ఉంటారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానివల్ల వారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి జీవితంలో విజయం సాధించాలనుకుంటే ప్రతిరోజూ వ్యాయామం కూడా మీ దినచర్యలో భాగం చేసుకోండి.

నిండైన నిద్ర

శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిండైన నిద్ర కూడా అంతే అవసరం. రాత్రి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోయే వారిలో ఆలోచనా శైలి, మానసిక స్పష్టత అధికంగా ఉంటాయి. బిలియనీర్లు చెబుతున్న ప్రకారం వారు ప్రతి రోజు రాత్రి ఒకే సమయానికి నిద్రపోతారు. ఉదయం తెల్లవారుజామునే లేచేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా ఒక నెల రోజులు పాటు అలా చేసి చూడండి. మీలో వచ్చే మార్పు మీరే గమనిస్తారు.

విజయం సాధించడానికి సామాజిక అనుబంధాలు చాలా ముఖ్యం. విజయవంతమైన వ్యక్తులు తరచూ సామాజిక కార్యక్రమాల్లో భాగం అవుతారు. వీలైనప్పుడు మద్దతును ప్రకటిస్తారు. ఆర్థిక మద్దతును ప్రకటించిన సందర్భాలు అధికంగానే ఉంటాయి. ఇలా చేయడం వల్ల వారిలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ఇది మరింతగా ముందుకు వెళ్లడానికి దోహదపడుతుంది.

ధ్యానం

మైండ్ ఫుల్ నెస్, ధ్యానం వంటివి బిలినియర్లలో రోజువారీ దినచర్యలో భాగం అయిపోయాయి. ప్రతిరోజు 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఓప్రా విన్ ఫ్రే, టిమ్ కుక్ వంటి బిలియనీర్లు తమ ఉదయపు దినచర్యలో ధ్యానాన్ని భాగం చేసుకున్నారు. ధ్యానం వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కాదు. ఇది మీలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ప్రశాంతతను పెంచుతుంది. మీరు ఏ పనైనా సావధానంగా విజయవంతంగా చేయగలిగేలా చేస్తుంది.

ఒక మనిషి విజయవంతం కావడానికి అతని కుటుంబం మద్దతు చాలా అవసరం. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపితే ఆ రోజంతా చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఉదయాన లేచిన వెంటనే కాసేపు పిల్లలతో, జీవిత భాగస్వామితో మాట్లాడడం, వారితో కలిసి పనులు షేర్ చేసుకోవడం వంటివి చేయండి. ఇది మీ వారితో మీ బంధాన్ని దృఢపరుస్తుంది. వారితో కలిపి బ్రేక్ ఫాస్ట్ తినడం వంటివి అలవాటు చేసుకోండి. లేదా రాత్రిపూట డిన్నర్ అయినా వారితో కలిసి తినేందుకు ప్రయత్నించండి. కుటుంబ సమయం ప్రతి వ్యక్తికి అవసరం.

బిలియనీర్లుగా ఎదిగిన వారంతా ఇలాంటి మంచి లక్షణాలను కలిగి ఉన్నవారే. మీరు కూడా జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలనుకుంటే పైన చెప్పిన అలవాట్లలో కొన్నింటినైనా పాటించండి. మీలో వచ్చే మంచి మార్పులను మీరే గమనిస్తారు.

Whats_app_banner