Homemade Protein Powder । ప్రోటీన్ పౌడర్ కొనుగోలు చేస్తున్నారా? ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!
Homemade Protein Powder: కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అవసరం. ఇది ఆహారంతో లభిస్తుంది, కొంతమంది మార్కెట్లో లభించే ప్రోటీన్ పదార్థాలపైనా ఆధారపడతారు. కానీ దీనిని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి.
మానవ శరీరంలోని ప్రతి కణం ప్రోటీన్‌తో నిర్మితమవుతుంది. ప్రోటీన్ అనేది అమైనో ఆమ్లాల కలయిక. ఇది మీ శరీరం కణాలను సరిచేయడానికి, కొత్త వాటిని తయారు చేయడానికి, వాటి పెరుగుదలకు అవసరం. ఎదిగే పిల్లలకు ప్రోటీన్ అనేది ఎంతో ముఖ్యమైన పోషకం. ఎత్తు పెరగటానికి, కండరాల పెరుగుదలకు ఇది అవసరం. పిల్లలు, టీనేజ్, గర్భిణీ స్త్రీలలో పెరుగుదల, అభివృద్ధికి ప్రోటీన్ ఎంతో ముఖ్యమైనది.
చాలా మంది మంచి శరీరాకృతి కోసం, బరువు తగ్గటానికి జిమ్‌లకు వెళ్తుంటారు. వారికి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను సూచిస్తారు. తినే ఆహారంతో సరైన ప్రోటీన్ కంటెంట్ లభించని పక్షంలో ఆరోగ్య నిపుణులు ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫారసు చేస్తారు. అయితే ఈ ప్రొటీన్ పౌడర్‌లన్నీ మార్కెట్‌లో లభిస్తున్నప్పటికీ ఇవి చాలా ఖరీదైనవి ఉంటాయి. వాటి తయారీలో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ వలన సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవచ్చు. ఈ ప్రోటీన్ పౌడర్లన్నింటి తయారీలో ప్రధానంగా ఉపయోగించేవి ప్రోటీన్లు ఎక్కువగా లభించే తృణధాన్యాలు, నట్స్, పొడులతోనే మరి అలాంటప్పుడు ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ఎందుకు చేసుకోకూడదు?
మీరు ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన నట్స్ ఉపయోగించి ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా శాకాహారం అది ఎలాగో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
Homemade Protein Powder Recipe కోసం కావలసినవి
- జీడిపప్పు 50 గ్రాములు
- బాదం 50 గ్రాములు
- వాల్‌నట్ 50 గ్రా
- వేరుశెనగ 50 గ్రాములు
- సోయాబీన్ 50 గ్రాములు
- తెల్ల నువ్వులు 10 గ్రాములు
- గుమ్మడికాయ గింజలు 10 గ్రాములు
- పాల పొడి
- దాల్చిన చెక్క పొడి
ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలి?
- ముందుగా జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లను పాన్‌పై దోరగా వేయించాలి, మాడకుండా చూసుకోండి.
- ఆ తర్వాత సోయా గింజలను విడిగా వేయించుకోవాలి
- ఆ పైన వేరుశెనగలను బాగా వేయించాలి
- మిగిలిన గుమ్మడి గింజలు, తెల్ల నువ్వులను వేడి చేయండి
- ఇలా వేయించిన నట్స్ అన్నింటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇందుకోసం పొడిని ఒకటికి రెండుసార్లు గ్రైండ్ చేయాలి.
- ఇప్పుడు పొడిలో పాలపొడి కలపండి. దాల్చిన చెక్క పొడి కూడా వేయండి.
అంతే, ప్రోటీన్ పౌడర్ సిద్ధం అయినట్లే. వేడివేడి గ్లాసు పాలలో ఒకటిన్నర టీస్పూన్ ప్రొటీన్ పౌడర్ వేసి తాగాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం అందుబాటులో ఉన్న నివేదికల నుంచి తీసుకున్నది. మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు, ఫుడ్ అలర్జీలు ఉన్నట్లయితే దీనిని నివారించండి. అలాగే వినియోగించే ముందు మీ డాక్టర్ సలహా తీసుకోవడం మరిచిపోవద్దు.
సంబంధిత కథనం