Plant-based Meat | ఎర్రమాంసం కంటే మొక్కల ఆధారిత మాంసమే ఆరోగ్యానికి మంచిది!
జంతు మాంసం కంటే మొక్కల ఆధారిత మాంస ఉత్పత్పులు మనుషుల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొక్కల అధారిత మాంసం, జంతు మాంసం మధ్య తేడా ఇక్కడ తెలుసుకోండి.
శాఖాహారంలోనూ మాంసానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంటే ఇవి తినేటపుడు కలిగే అనుభూతి, ఆ రుచి, రూపురేఖలు అలాగే లభించే పోషకాలు దాదాపు మాంసాహారంలాగే ఉంటాయి. అందుకే దీనిని 'మొక్కల ఆధారిత మాంసం' (Plant-based meat) కానీ ఇవి పూర్తిగా శాఖాహారం. ఒక కొత్త అధ్యయనం ప్రకారం జంతు మాంసం కంటే శాఖాహార ప్రత్యామ్నాయాలు ఇటు ప్రజల ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా రెండు విధాల ఎంతో శ్రేయస్కరం అని నిరూపితమైంది. ప్రోటీన్లు, ఇతర పోషకాలు శాఖాహార ఆధారిత మాంసంలోనే అధికమని, అలాగే ఇది ఆరోగ్యకరమని ఫ్యూచర్ ఫుడ్స్ జర్నల్‌లో ప్రచురించారు.
మొక్కల ఆధారిత ఆహార పదార్థాలతో మనుషుల ఆరోగ్యం, పర్యావరణంపై అది చూపే ప్రభావంపై పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అలాగే వినియోగదారుల వైఖరి ఎలా ఉందనేది కూడా సమీక్షించారు. ఇలాంటి అంశాలతో చేపట్టిన మొత్తం 43 అధ్యయనాల ఫలితాలను పరిశోధకులు పరిశీలించారు. వాటి ప్రకారం 90 శాతం మంది మొక్కల ఆధారిత మాంసం అనేది ప్రాసెస్ చేసిన మాంసానికి సమానమైన రుచి, ఆకృతి కలిగి ఉందని అంగీకరించారు. అంతేకాకుండా ధర కూడా జంతు మాంసం కంటే చాలా తక్కువ కాబట్టి మొక్కల ఆధారిత మాంసాహారమే భవిష్యత్తులో స్థిరమైన ప్రత్యామ్నాయం అనే నిర్ణయానికి వచ్చారు.
పర్యావరణానికి మేలు, ఖర్చు తక్కువ
ఈ మొక్కల ఆధారిత మాంసాహారం తినడం ద్వారా జంతు ఉత్పత్తులు తినే దాని కంటే తక్కువ స్థాయిలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు ఉత్పత్తి అవుతాయని పరిశోధనలో నిరూపితమైంది. జర్మన్ దేశంలో గొడ్డు మాంసం వినియోగంలో కేవలం 5 శాతం బఠానీ ప్రోటీన్‌తో భర్తీ చేయడం వల్ల CO2 ఉద్గారాలు ఏడాదికి ఎనిమిది మిలియన్ టన్నుల వరకు తగ్గించవచ్చని పరిశోధనలో వెల్లడైంది. బీఫ్ బర్గర్‌లతో పోలిస్తే, మొక్కల ఆధారిత బర్గర్‌లు తినడం ద్వారా 98 శాతం తక్కువ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు వెలువడుతాయి అని తేలింది.
అంతేకాదు మొక్కల ఆధారిత మాంస ఉత్పత్తులకు చాలా తక్కువ వ్యవసాయ భూమి అవసరమవుతుంది. నీరు, పోషణ కోసం అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. జంతు ఉత్పత్తుల వలన కలిగే పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు.
మనుషులకు ఏ విధంగా ఆరోగ్యకరం?
అధ్యయనం ప్రకారం దాదాపు 40 శాతం జంతు ఉత్పత్తులు మనుషులకు ఆరోగ్యకరమైనవి కావు. వీటితో పోలిస్తే మొక్కల ఆధారిత ఉత్పత్తులు మెరుగైన పోషకాహార ప్రొఫైల్‌లను కలిగి ఉన్నాయని కనుగొన్నారు. మొక్కల ఆధారిత మాంసాహారం కండరాలు పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరగదు తద్వారా బరువు తగ్గటానికి ఉత్తమమైనది. ఎడిబుల్ ఫంగై, మైక్రోఅల్గే లేదా స్పిరులినా వంటి పదార్థాలను కూడా ప్లాంట్ బేస్డ్ మాంసాహారాలుగా చేర్చుకోవచ్చు. వీటిలో శరీరానికి కావాల్సిన కీలకమైన అమైనో ఆమ్లాలు, విటమిన్లు B, E అలాగే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం