Magnesium Diet । మీ ఆహారంలో మెగ్నీషియం ఉందా? తప్పకుండా ఇవి తినండి!-these are main reasons to add magnesium to your diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Are Main Reasons To Add Magnesium To Your Diet

Magnesium Diet । మీ ఆహారంలో మెగ్నీషియం ఉందా? తప్పకుండా ఇవి తినండి!

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 10:02 AM IST

Magnesium Diet: మీరు తినే ఆహారంలో అన్ని ఇతర పోషకాలతో పాటు మెగ్నీషియం తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఈ ఖనిజం శరీరంలో ఎన్నో రకాల విధులకు సహాయపడుతుంది. మెగ్నీషియం లభించే ఆహార పదార్థాలు తెలుసుకోండి.

Magnesium Diet
Magnesium Diet (Unsplash)

Magnesium Diet: మనం రోజూ తినే ఆహారం పోషకాల సరైన మిశ్రమంతో సమతుల్యంగా ఉండాలని పోషకాహార నిపుణులు, వైద్యులు తరచూ నొక్కి చెబుతారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ పోషకాలన్నీ ఒక్కొక్కటి శరీరంలో ఒక్కో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఏదైనా పోషక లోపం తలెత్తితే దాని ప్రభావం మనకు ఏదో రూపంలో కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు బయటపడతాయి. అందుకే వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉండాలంటే సరైన ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది.

ఉదాహరణకు, మెగ్నీషియం ఒక ముఖ్యమైన పోషకం, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడం, కండరాలు, నరాలు దృఢత్వం, గుండె పనితీరును నిర్ధారించడం వంటి కీలకమైన శరీర విధులను నిర్వహిస్తుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మనం తినే ఆహారంలోని మెగ్నీషియం చాలా వరకు, దాదాపు 60% ఎముకలు సాంద్రతను నిర్వహించడానికి వినియోగం అవుతుంది. శరీరంలో తగినంత మెగ్నీషియం లేకపోవడం వల్లే బోలు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహాన్ని దూరంగా ఉంచవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

Magnesium Health Benefits - మెగ్నీషియంతో ఆరోగ్య ప్రయోజనాలు

మీ ఆహారంలో సరైన మోతాదులో మెగ్నీషియం ఎందుకు ఉండాలో ప్రధాన కారణాలను ఇక్కడ చూడండి.

1. ఎముకల ఆరోగ్యం

మెగ్నీషియం ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది: ఇది కాల్షియం శోషణకు అవసరమైన విటమిన్ డిని శరీరంలో సక్రియం చేయడంలో సహాయపడుతుంది కాబట్టి, ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరం. ఇది కాల్షియం స్థాయిలను క్రమబద్ధీకరించడానికి, బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

2. రక్తపోటును తగ్గిస్తుంది

మెగ్నీషియం హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్త నాళాలను సడలించడం, విస్తరించడంలో సహాయం చేస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. ఒత్తిడిని తగ్గిస్తుంది

మెగ్నీషియం స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది ప్రశాంతమైన ప్రభావాన్ని అందిస్తుంది, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.

4. మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది

మెగ్నీషియం మానసిక స్పష్టత, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది, మన జ్ఞాపకశక్తిని పదును పెడుతుంది. నిరాశ, ఆందోళన లక్షణాలను కూడా తగ్గిస్తుంది. ఇది మైగ్రేన్ తలనొప్పుల ఫ్రీక్వెన్సీ, తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

5. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

చాలా మంది పెద్దలకు రోజుకు 300-400 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం. ఇది ఆహారంలో ఉండే గ్లూకోజ్‌ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి శక్తి స్థాయిని స్థిరంగా ఉంచడం వలన ఇది రోజంతా మీకు సహజమైన శక్తిని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

6. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

మెగ్నీషియం స్కిన్ ప్రొటీన్ అయిన కొల్లాజెన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది, కాబట్టి ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం చర్మ సంరక్షణ సప్లిమెంట్ , గమ్మీలలో ఉపయోగిస్తారు.

7. నిద్ర నాణ్యతను పెంచుతుంది

సరిగ్గా నిద్రపోవాలంటే మన శరీరం, మెదడు విశ్రాంతి తీసుకోవాలి. మెగ్నీషియం మన మెదడు, నాడీ వ్యవస్థను సడలించడానికి పారాసింపథెటిక్ నరాల వ్యవస్థను సక్రియం చేస్తుంది. ఇది నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్‌ను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి ఇది మెదడు, శరీరాన్ని నిద్రించడానికి సిద్ధం చేస్తుంది.

8. తెల్ల రక్త కణాలను మెరుగుపరుస్తుంది.

మెగ్నీషియం రోగనిరోధక వ్యవస్థతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంది. ఇది సూక్ష్మక్రిములతో పోరాడటానికి, వాటిని నాశనం చేయడానికి తెల్ల రక్త కణాలను మెరుగుపరుస్తుంది. కాబట్టి మెగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు, శరీరం సంక్రమణతో పోరాడటానికి బదులుగా దాని స్వంత కణాలు, కణజాలాలపై దాడి చేస్తుంది.

Magnesium-rich Foods- మెగ్నీషియం లభించే ఆహారాలు

ఆకుపచ్చ ఆకు కూరలు, నట్స్, విత్తనాలు, తృణధాన్యాలు వంటి ఆహారాలలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. పాలకూర, స్విస్ చార్డ్, గుమ్మడి గింజలు, పెరుగు లేదా కేఫీర్, బాదం, బ్లాక్ బీన్స్, అవకాడోలు, అత్తి పండ్లు, డార్క్ చాక్లెట్లు తినడం ద్వారా మెగ్నీషియం శరీరానికి లభిస్తుంది. అంతేకాకుండా అరటిపండు, కొన్ని కొవ్వు చేపలు, టోఫు , చిక్కుళ్ళలోనూ మెగ్నీషియం కొద్ది మొత్తంలో లభిస్తుందని న్యూట్రిషనిస్ట్ ప్రీతి గుప్తా చెప్పారు.

WhatsApp channel

సంబంధిత కథనం