Swimming in Summer । ఈతకొట్టడం వలన ఆకలి బాధ పెరుగుతుందట.. ఎందుకో తెలుసా?
swimming increase appetite: ఈత కొట్టడం వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వేసవిలో ఈత గొప్ప వ్యాయామం అయితే, స్విమ్మింగ్ చేయడం వలన మీకు ఆకలి పెరుగుతుంది. కారణాలు చూడండి..
Swimming in Summer: వేసవి ఎండలకు ప్రజలు తాళలేకపోతున్నారు, ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలా మంది నీటి వనరులు ఉండే చల్లని ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు, లేదా స్థానికంగా ఉండే ఈతకొలనులకు వెళ్లి ఈతకొట్టడం, వాటర్ స్పోర్ట్స్ లో మునిగి తేలడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈత కూడా ఒక వ్యాయామం లాంటిదే, కాబట్టి నిపుణులు కూడా వేసవిలో ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు ఈత మంచి ఎంపిక అని సిఫారసు చేస్తున్నారు. ఈత కొట్టడం వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది బరువు తగ్గటానికి గొప్ప వ్యాయామం, కొన్ని వారాలలోనే మీ బరువులో తేడా కనిపిస్తుంది. స్విమ్మింగ్ శరీరంలోని ఏ కణజాలంపై ఒత్తిడి చేయని వ్యాయామం, కాబట్టి వెన్నునొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది గొప్ప వ్యాయామం. అంతేకాకుండా స్విమ్మింగ్ ఒక ఆహ్లాదకరమైన కార్యకలాపం. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి నీటిలో కేరింతలు కొడుతూ గొప్ప వినోదాన్ని పొందవచ్చు, ఇది మీ ఒత్తిడికి స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
అయితే, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. స్విమ్మింగ్ చేయడం వలన మీకు ఆకలి పెరుగుతుందంటే నమ్ముతారా? న్యూట్రిషనిస్ట్ నేహా సహాయ ఈత గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు, స్విమ్మింగ్ చేసేటపుడు ఆకలి ఎక్కువవుతుందని చెప్పుకొచ్చారు. మారి ఇలా ఎందుకో మీరూ తెలుసుకోండి.
నేహా సహాయ ప్రకారం.. స్విమ్మింగ్ అనేది ఒక రకమైన వ్యాయామం, ఇది అనేక కారణాల వల్ల ఆకలిని పెంచుతుంది.
- చల్లటి నీటిలో ఈత కొట్టడం వల్ల శరీరం అందుకు వ్యతిరేకంగా స్పందిస్తుంది, శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా వెచ్చగా ఉండటానికి లోపలి వ్యవస్థ ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈ శక్తి నష్టం ఆకలి పెరుగుదలకు దారితీస్తుంది.
- ఈత కూడా నిర్జలీకరణానికి కారణమవుతుంది, ప్రత్యేకించి వేడి కొలనులో లేదా వేడి వాతావరణంలో, ఎండలో స్విమ్మింగ్ చేస్తున్నపుడు డీహైడ్రేషన్ కలుగుతుంది, ఇది ఆకలిని పెంచుతుంది.
- ఈత అనేది అధిక-తీవ్రత కలిగిన వ్యాయామం, ఇది గణనీయమైన సంఖ్యలో కేలరీలను బర్న్ చేయగలదు. శరీరం వినియోగించే దానికంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేసినప్పుడు, అది శక్తి నిల్వలను తిరిగి నింపడానికి ఆకలి సంకేతాలను ప్రేరేపిస్తుంది. అందువల్ల, ఈత కొట్టిన తర్వాత, శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది , ఎక్కువ ఆహారం తీసుకోవడానికి మెదడుకు సిగ్నల్ వెళ్తుంది, తద్వారా ఆకలి పెరుగుతుంది.
చివరగా న్యూట్రిషనిస్ట్ చెప్పిందేమిటంటే.. స్విమ్మింగ్ అనేది ఆరోగ్యంగా ఉండటానికి ఒక గొప్ప వ్యాయామం, అయితే మీ ఫిట్‌నెస్ లక్ష్యాలకు మద్దతుగా మీ శరీరానికి సరైన పోషకాలను అందించడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీరు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు బాగా ఆకలివేస్తుంటే కాసేపు స్విమ్మింగ్ చేయడం మానేయండి, ఏదైనా తినండి, ఆకలి తీరిన వెంటనే మళ్లీ మీరు మీ ఈతను కొనసాగించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్