Dating : మా అక్క మాజీ ప్రియుడు నాకు నచ్చాడు.. నేను పెళ్లి చేసుకోవచ్చా?-should i marriage my sisters exboyfriend ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dating : మా అక్క మాజీ ప్రియుడు నాకు నచ్చాడు.. నేను పెళ్లి చేసుకోవచ్చా?

Dating : మా అక్క మాజీ ప్రియుడు నాకు నచ్చాడు.. నేను పెళ్లి చేసుకోవచ్చా?

Galeti Rajendra HT Telugu
Aug 14, 2024 12:30 PM IST

Relationships : అక్కాచెల్లెలు మధ్య దాదాపు దాపరికాలు ఉండవు. బట్టలు నుంచి బాయ్ ఫ్రెండ్ వరకూ అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ అక్క‌తో విడిపోయిన బాయ్‌ఫ్రెండ్‌ను చెల్లి ఇష్టపడొచ్చా? అతడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలదా?

అక్క మాజీ ప్రియుడు నచ్చాడు
అక్క మాజీ ప్రియుడు నచ్చాడు (istock)

Relationships : ప్రశ్న: నా వయసు 19 ఏళ్లు. ఐదేళ్లుగా ఒక బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్న మా అక్క ఇటీవల మనస్పర్థలతో విడిపోయింది. అతను నాకు కూడా పరిచయమే.. చాలా మంచి వ్యక్తి . మా అక్క డేటింగ్‌లో ఉన్నప్పుడు నాకు పరిచయం చేస్తే.. కొద్దిరోజుల్లోనే మేము కూడా ఫ్రెండ్స్ అయ్యాం. అయితే అతనితో బ్రేకప్ తర్వాత.. మా అక్క హ్యాపీగా తన లైఫ్‌ని లీడ్ చేస్తోంది.

కానీ.. అతను మాత్రం ఆ బ్రేకప్ నుంచి బయటపడలేకపోతున్నాడు. దాంతో నేను అతన్ని ఓదారుస్తూ ఎక్కువ సమయం గడిపాను. ఈ క్రమంలో ఎమోషనల్‌గా అతను నాకు కనెక్ట్ అయిపోయాడు. కొద్దిరోజుల్లోనే నేను కూడా అతనితో ప్రేమలో పడిపోయా. మా అక్క మాజీ ప్రియుడితో నేను డేటింగ్ చేయొచ్చా? పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు గురించి తలుచుకుని భయమేస్తోంది. ఏం చేయమంటారు?

- ఓ సోదరి (పేరు చెప్పలేదు)

జవాబు: మీ సమస్య గురించి మాకు చెప్పి.. మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు. సాధారణంగా మనం ఎవరితోనైనా ప్రేమగా ఎక్కువ సమయం గడిపినప్పుడు.. వాళ్ల వైపు మొగ్గు చూపడం చాలా కామన్. పైగా మీరు అతనికి చాలా కాలంగా తెలుసు. కాబట్టి..అతడిని మీరు కుటుంబ సభ్యుడిలానే భావించి దగ్గర అయ్యారు.

కానీ.. మీరు ఒకరికొకరు మరింత దగ్గర అవ్వాలి అనుకుంటే.. నేను ఇచ్చే మొదటి సలహా ఏంటంటే..? మీ ఇద్దరి విషయం వెంటనే మీ సోదరికి చెప్పండి. నిజానికి మీ సోదరి, అతను ఏ పరిస్థితుల్లో విడిపోయారో మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయనేది కూడా ఇద్దరూ మనసు విప్పి మీకు చెప్పకపోవచ్చు. కాబట్టి మొదట మీ సోదరికి ఈ విషయం చెబితే తను మీ ముందు అన్నీ ఓపెన్‌గా చెప్పే అవకాశం ఉంది. అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు.

ఒకవేళ మీరు అతడిని పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీ అక్క నుంచి సానుకూల స్పందన తప్పనిసరి. ఒకవేళ మీ అక్క.. అతనితో నీ డేటింగ్‌కి అభ్యంతరం తెలిపితే.. మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవడం మంచిది. రానున్న రోజుల్లో మీ అక్కతో వచ్చిన సమస్యే.. మీతోనూ అతనికి రావచ్చు. కాబట్టి.. అన్నీ సవివరంగా తెలుసుకుని ముందుకు వెళితే మంచిది.

మీ అక్కతో చెప్పడానికి మీ అభ్యంతరం అయితే.. కొన్ని రోజుల పాటు అతనితో ట్రావెల్ చేస్తూ నిశితంగా అతని వ్యక్తిత్వాన్ని పరిశీలించండి. మీకు అన్ని విధాలుగా ఓకే అనుకుంటే.. అప్పుడు మీ అక్కకి విషయం చెప్పి.. ఆమె అభిప్రాయాన్ని తీసుకోండి. ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినా.. ఒప్పించగలిగే కారణాలు మీ వద్ద ఉండాలి. ఒకవేళ మీ జర్నీలో అతనితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే.. వెంటనే దూరంగా జరిగిపోవడం ఉత్తమం. ఏదైనా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.