Tasty Dosa: పెసరపప్పు పాలకూర దోశ ఇలా చేశారంటే ఎంతో ఆరోగ్యం పైగా టేస్టీ-pesarapappu palakura dosa recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tasty Dosa: పెసరపప్పు పాలకూర దోశ ఇలా చేశారంటే ఎంతో ఆరోగ్యం పైగా టేస్టీ

Tasty Dosa: పెసరపప్పు పాలకూర దోశ ఇలా చేశారంటే ఎంతో ఆరోగ్యం పైగా టేస్టీ

Haritha Chappa HT Telugu
Nov 22, 2024 11:30 AM IST

Tasty Dosa: ఆరోగ్యానికి మేలు చేసేలాగా పాలకూర పెసరపప్పు దోశ వేయడానికి ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పెసరపప్పు పాలకూర దోశ రెసిపీ
పెసరపప్పు పాలకూర దోశ రెసిపీ

శీతాకాలంలో మనం తినే ప్రతి ఆహారం మన రోగ నిరోధక శక్తిని పెంచేలా ఉండాలి. ఎందుకంటే చల్లని వాతావరణంలో మన రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారిపోతుంది. అందుకే మేము ఇక్కడ పెసరపప్పు పాలకూర దోశ రెసిపీ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో దీన్ని తింటే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. పెసరపప్పు, పాలకూర ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇక దీని రెసిపీ ఎలాగో చూడండి.

పెసరపప్పు పాలకూర దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు - ముప్పావు కప్పు

పాలకూర తరుగు - అరకప్పు

పచ్చిమిర్చి పేస్ట్ - ఒక స్పూను

అల్లం పేస్ట్ - అర స్పూను

ఇంగువ - చిటికెడు

కారం - పావు స్పూను

పసుపు - పావు స్పూను

జీలకర్ర - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - వేయించడానికి సరిపడా

పెసరపప్పు పాలకూర దోశ రెసిపీ

1. పెసరపప్పును రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి.

2. ఆ తర్వాత శుభ్రంగా కడిగి మిక్సీలో పప్పును వేసుకోవాలి. మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.

4. అందులో పాలకూర వేసి వేయించుకోవాలి.

5. పాలకూరలోని పచ్చివాసన పోయేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

6. ఇప్పుడు ఈ పాలకూరను మిశ్రమాన్ని పెసరపప్పు రుబ్బులో కలిపేయాలి.

7. అలాగే పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్టు, ఇంగువ, కారం, పసుపు, జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకోవాలి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

9. ఒక పావుగంట వదిలేసి తర్వాత మరొకసారి కలుపుకోవాలి.

10. దోశకి ఎంత మందంగా పిండి కావాలో అంత మందానికి వచ్చేలా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

11. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.

12. రెండు గరిటలా పిండిని వేసి దోశలాగా పరుచుకోవాలి.

13. రెండు వైపులా కాల్చాక తీసి పక్కన పెట్టుకోవాలి.

14. దీన్ని కొబ్బరి చట్నీ తో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.

పాలకూర చలికాలంలో తాజాగా దొరుకుతుంది. పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది. పెసరపప్పు కూడా మన ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ రెండూ ఖచ్చితంగా పెట్టాలి. కాబట్టి వారంలో ఒకసారైనా ఈ పాలకూర పెసరపప్పు దోశను ప్రయత్నించండి. మీకు మంచి రుచిని ఇస్తుంది. టమాటో తిన్న టేస్టీ గానే ఉంటుంది. అయితే పాలకూరతో పాటు కొందరు టమాటోను తినడానికి ఇష్టపడరు. అలాంటివారు కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ తింటే మంచిది.

Whats_app_banner