Avoid Exercise: ఈ ఆరోగ్య సమస్యలుంటే వ్యాయామం అస్సలు చేయొద్దు.. మరింత ప్రమాదం
Avoid Exercise: కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు యోగా లేదా వ్యాయామాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ అనారోగ్యాలేంటో, వ్యాయామం ఎందుకు చేయకూడదో తెల్సుకోండి.
వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయి. కానీ మనకు విశ్రాంతి అవసరమైనప్పుడు వ్యాయామం చేయడం సరికాదు. మీరు ఈ సమస్యలతో బాధపడుతుంటే మీరు చేయాల్సింది వ్యాయామం కాదు. సరైన విశ్రాంతి తీసుకోవడం. ఈ సమస్యలతో బాధపడుతుంటే వ్యాయామానికి దూరంగా ఉండండి.
తలనొప్పి:
మీకు తలనొప్పి ఉంటే, వ్యాయామం చేయడం సరికాదు. తలనొప్పి శరీరం నిర్జలీకరణకు గురికావడం వల్ల కనిపించే లక్షణాలలో ఒకటి. లేదంటే అధిక రక్తపోటు కూడా కారణం కావచ్చు. కాబట్టి తలనొప్పి ఉంటే విశ్రాంతి తీసుకోండి. వ్యాయామం చేయకపోవడమే మేలు.
బెణుకు:
మీకు ఏదైనా గాయమై పాదాల్లో బెణుకు ఉంటే.. వ్యాయామాలకు దూరంగా ఉండండి. వ్యాయామం చేస్తేనే బెణకడం పోతుందనుకుంటారు కానీ తప్పు. కొందరు ఎగువ శరీరానికి సంబంధించిన వ్యాయామాలూ చేయొచ్చని భావిస్తారు. ఈ రెండూ సరికాదు. ఇలా చేస్తే నొప్పి తగ్గడానికి మరింత సమయం పడుతుంది.
జలుబు, దగ్గు:
జలుబు, దగ్గు ఉంటే కూడా వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. శరీరం బ్యాక్టీరియాతో పోరాడటానికి తన శక్తిని వెచ్చిస్తుంది. అటువంటి సమయంలో వ్యాయామం చేయడం వల్ల అలసట, మరింత బలహీనంగా అనిపిస్తుంది. జలుబు, దగ్గు నయం కావడానికి సమయం పడుతుంది.
నిద్ర లేమి:
మీకు తగినంత నిద్ర లేకపోతే వ్యాయామం చేయకండి. ఎందుకంటే నిద్రకు భంగం కలిగించినప్పుడు శరీరం అలసిపోతుంది. ఈ అలసటతో వ్యాయామం చేయడం వల్ల గాయాలు ఏవైనా అయ్యే ప్రమాదమూ ఉంటుంది.
ఆల్కహాల్:
మీరు మద్యం సేవించినట్లయితే వ్యాయామం చేయకూడదు. ఎందుకంటే ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేసి అలసిపోయేలా చేస్తుంది. దీని ల్ల వ్యాయామాల్లో గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. కండరాలూ దెబ్బతింటాయి.