Heart Attack Symptoms: శరీరంలో ఈ ఐదు భాగాల్లో నొప్పులు వస్తే అది గుండెపోటు రావడానికి ముందస్తు హెచ్చరిక
Heart Attack Symptoms: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే గుండెపోటు లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. శరీరంలో ఐదు భాగాల్లో వచ్చే నొప్పులు గుండెపోటుకు ముందు వచ్చే హెచ్చరికగా భావించాలని చెబుతున్నారు వైద్యులు.
Heart Attack Symptoms: ఒకప్పుడు గుండెపోటు 50 ఏళ్లు దాటిన వారికే వచ్చేది. ఇప్పుడు 20 ఏళ్లలోనే గుండెపోటు బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకే గుండె ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధను పెట్టాలి. గుండెపోటు లక్షణాల పై కూడా అవగాహన పెంచుకోవాలి. గుండెపోటు లక్షణాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. గుండెపోటు అనగానే ఛాతిలో వచ్చే నొప్పి మాత్రమే అనుకుంటారు. కానీ శరీరంలో అనేక భాగాల్లో వచ్చే నొప్పిని కూడా గుండెపోటును సూచిస్తాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. శరీరంలో ఏ ఏ భాగాల్లో నొప్పి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలో వైద్యులు వివరిస్తున్నారు. ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు.
ఛాతీ నొప్పి
గుండె నొప్పికి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి. ఛాతిలో నొప్పి రావడం లేదా అసౌకర్యంగా అనిపించడం, ఒత్తిడిగా అనిపించడం... ఇవన్నీ గుండె నొప్పిని సూచిస్తాయి. అలాగే ఛాతీ బిగుతుగా పట్టేసినట్టు ఉండటం, ఛాతీ భాగంలో పిండినట్టు, సూదులతో గుచ్చినట్టు అనిపించడం కూడా గుండెపోటు వచ్చే ముందు హెచ్చరికగానే భావించాలి. ఛాతీలోని ఎడమవైపు లేదా మధ్యలో ఈ నొప్పి అధికంగా వస్తుంది. ఇలా వస్తే అదే గుండెపోటుకు సంబంధించినదే అయి ఉండాలని అనుమానించాల్సిందే.
చెయ్యి నొప్పి
గుండెపోటు రావడానికి ముందు ఒక చేతిలో లేదా రెండు చేతులలో నొప్పి వస్తుంది. అలాగే రెండు చేతుల్లో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఏ పనీ చేయలేరు. చాలా నీరసంగా అనిపిస్తుంది. చేతులను ఎత్తడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఛాతీ నుండి ఎడమ చేయి వరకు నొప్పి ప్రసరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది గుండెపోటుకు మరొక ప్రధాన సంకేతం. కొన్నిసార్లు ఈ నొప్పి భుజాలకు, అక్కడి నుంచి వీపుకు కూడా ప్రసరిస్తుంది.
గొంతు, దవడనొప్పి
గుండెపోటు వచ్చే ముందు కొంతమందిలో గొంతు భాగంలో నొప్పి రావచ్చు. అలాగే దవడలో కూడా నొప్పి అధికంగా వస్తుంది. నడిచేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. దంతాలు కూడా నొప్పిగా అనిపిస్తుంది. మెడలో తీవ్ర ఒత్తిడి కలుగుతుంది. ఇలాంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోకండి. ఇవి గుండెపోటును సూచిస్తాయి.
పొత్తికడుపు భాగంలో నొప్పి
ఒకసారి పొత్తి కొడుకు భాగంలో కూడా నొప్పి వేస్తుంది. ఇది కూడా గుండెపోటును సూచించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నొప్పిగా ఉండటమే కాదు ఒత్తిడిగా అనిపించడం, బిగుతుగా అనిపించడం, వాంతులు వస్తున్నట్టు అనిపించడం, వాంతులు అవ్వడం కూడా గుండెపోటు రావడానికి ముందు హెచ్చరికగానే చెబుతున్నారు వైద్యులు.
ఒక్కోసారి పైన చెప్పిన ఎలాంటి నొప్పులు లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 10% గుండెపోటులు ఇలానే వస్తాయి. దీన్ని సైలెంట్ మయో కార్డియాల్ ఇస్కీమియా అంటారు. మధుమేహం, నరాల వ్యాధులు, వృద్ధులలో ఇలాంటి గుండెపోటు కనిపిస్తూ ఉంటుంది.
ఏమాత్రం గుండెపోటు లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. తీవ్రంగా చెమట పట్టడం, మైకం కమ్మడం, మానసిక ఆందోళన అధికంగా రావడం వంటివి కూడా గుండెపోటుతో సంబంధం కలిగి ఉంటాయి, ఈసీజీ, ఎకో, బ్లడ్ టైటర్స్ వంటి కొన్ని సాధారణ పరీక్షలు చేసి గుండెనొప్పి వచ్చే అవకాశం ఉందో లేదో తెలుస్తారు.
టాపిక్