Gym and Heart attack: జిమ్ చేస్తున్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, గుండెపోటు వచ్చే అవకాశం
Gym and Heart attack: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువత గుండెపోటు బారిన పడుతు ముఖ్యంగా జిమ్ చేస్తూ లేదా డాన్స్ చేస్తూ కుట్టు కూలిపోతున్న యువతీ యువకుల సంఖ్య అధికంగానే ఉంది
Gym and Heart attack: వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే, కానీ కొంతమంది జిమ్ అధికంగా చేసి గుండెపోటు బారిన పడి మరణిస్తున్న సంఘటనలు చాలా జరిగాయి. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఇలా మరణించారు. జిమ్, గుండె పోటు మధ్య అనుబంధం ఉందనే భయం ఎంతోమందిలో మొదలైంది. అతిగా వ్యాయామం చేస్తే గుండె అలసిపోవడం సాధారణమే, కాబట్టి వ్యాయామం చేస్తున్నప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. గుండెపోటు వచ్చే ముందు ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
జిమ్‌లో వర్కౌట్స్ చేసేటప్పుడు మీ శరీరాన్ని అతిగా కష్టపెట్టేయకండి. శరీరం అతిగా కష్టపడడం అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవం పైన చెడు ప్రభావం పడుతుంది. ఎంత వరకు అవసరమో అంతే చేయండి. బరువు తగ్గడానికి అయితే నడకకు మించిన వ్యాయామం ఇంకేమీ లేదు.
కండలు పెంచేందుకు, సిక్స్ ప్యాక్‌ల కోసం జిమ్ కి వెళ్తూ ఉంటారు యువకులు. అలాంటి వారు అతిగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. శరీరం ఫిట్‌గా ఉంచుకోవడం అవసరమే, కానీ గుండెను విపరీతంగా అలసిపోయేలా చేయడం మాత్రం మంచిది కాదు. అతిగా వ్యాయామం చేస్తే గుండెలోని కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి గుండె ఆగిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి వ్యాయామాలు చేసేటప్పుడు గుండెకు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపేయండి.
ఆకస్మికంగా ఛాతీ నొప్పి రావడం, అది తీవ్రంగా మారడం అనేది గుండెపోటు రావడానికి ముందు వచ్చే అత్యంత సాధారణ లక్షణం. గుండె దగ్గర అసౌకర్యంగా అనిపించినా, ఒత్తిడిగా అనిపించినా, ఊపిరాడడం కష్టంగా ఉన్నా, కాస్త నొప్పిగా అనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. తక్షణమే వ్యాయామం మానేయడం చాలా ముఖ్యం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా కూడా అది గుండెపోటు లక్షణంగానే కొన్నిసార్లు పరిగణించాల్సి వస్తుంది.
వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా చేశాక తల తిరుగుతున్నట్టు అనిపించడం, ఛాతీలో నొప్పి రావడం, మూర్చ, మైకం లాంటివి కమ్మడం వంటివి జరిగితే తేలికగా తీసుకోకండి. గుండెల్లో దడగా అనిపించడం కూడా అసాధారణ గుండె లయను సూచిస్తుంది.
విపరీతమైన చెమట పట్టడం కూడా గుండెపోటు లక్షణంగానే చెప్పుకోవాలి. వ్యాయామం చేసినప్పుడు సాధారణంగా చెమటలు పడతాయి. కానీ అతిగా అసాధారణంగా చెమటపడితే మాత్రం గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అర్థం. వర్కవుట్స్ చేస్తున్నప్పుడు మీకు ఏ మాత్రం శరీరం అసౌకర్యంగా, గుండె నొప్పిగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు. ఎడమ చేతుల్లో నొప్పి రావడం, మెడ నుంచి దవడ వైపుగా నొప్పి రావడం, పొత్తికడుపులో అసౌకర్యంగా అనిపించడం, తీవ్ర ఒత్తిడి రావడం... ఇవన్నీ కూడా గుండె అనారోగ్యాన్ని సూచిస్తాయి. వర్కవుట్స్ చేసే సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి టెస్టులు చేయించుకోవడం మంచిది.తగ్గిపోయింది కదా అని తేలికగా తీసుకోవద్దు. మరొకసారి అది తీవ్రంగా రావచ్చు.
టాపిక్