Munagaku Fry: మునగాకు ఎంత తింటే అంత ఆరోగ్యం, ఇదిగో మునగాకు కొబ్బరి వేపుడు రెసిపీ
Munagaku Fry: మునగాకుల్లో ఉండే పోషకాలు నిండి ఉంటాయి. తోటకూర, పాలకూర తింటే ఎంత ఆరోగ్యమో... మునగాకు తినడం వల్ల అంతకుమించి ఆరోగ్యం దక్కుతుంది. ఇక్కడ మేము మునగాకు కొబ్బరి వేపుడు రెసిపీ ఇచ్చాము.
Munagaku Fry: మునగాకు ఎంత తింటే అంత ఆరోగ్యం.పాలకూర, తోటకూర తింటే ఎంత మంచిదో మునగాకులు అంతకన్నా మేలు చేస్తాయో. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఆకుకూరల్లో మునగాకు మొదటిస్థానం. మునగాకును పొడి రూపంలో తీసుకున్నా మంచిదే. మునగాకుతో చేసే రెసిపీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
మునగాకు కొబ్బరి వేపుడు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మునగాకులు - రెండు కప్పులు
ఉల్లిపాయ - ఒకటి
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
కొబ్బరి తురుము - ఒక కప్పు
నూనె - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
ఎండు మిర్చి - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూను
మునగాకు కొబ్బరి వేపుడు రెసిపీ
1. మునగాకులను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టి పక్కనపెట్టుకోవాలి.
2. మిక్సీ జార్లో కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, పసుపు వేసి రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
5. అందులోనే కరివేపాకులు, కొన్ని ఉల్లిముక్కలను వేసి వేయించాలి.
6. అవి వేగాక మునగాకును వేసి కలుపుకోవాలి.
7. ఉప్పు వేస్తే అది త్వరగా ఉడుకుతుంది.
8. ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం కూడా గరిటెతో కలుపుకోవాలి.
9. చిన్న మంట మీదే దీన్ని వేయించాలి. లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది.
10. పదినిమిషాలు చిన్న మంట మీద వేయిస్తే మునగాకు కొబ్బరి వేపులు రెడీ అయినట్టే. ఇది ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం.
మునగాకులు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మునగాకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరమైనవే. బరువు తగ్గాలనుకునేవారికి మునగాకు ఉత్తమ ఎంపిక. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు, ఆస్తమా ఉన్నవారు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా మునగాకు పొడిని తింటే మంచిది. లేదా పప్పులో మునగాకు వేసి వండుకోవచ్చు. అలాగే మునగాకు వేపుడు కూడా చేసుకోవచ్చు.