Kobbari Bobbatlu: టేస్టీ కొబ్బరి బొబ్బట్లు రెసిపీ, స్నాక్స్ గా నైవేద్యంగా ఎలాగైనా వాడుకోవచ్చు
Kobbari Bobbatlu: కొబ్బరి బొబ్బట్లు, కొబ్బరి పోలీలు అని కూడా పిలుస్తారు ఇది రుచికరమైన స్వీట్ దీన్ని స్నాక్స్ గా పండగల సమయంలో నైవేద్యంగా ఉపయోగించుకోవచ్చు రెసిపీ చాలా సులువు
Kobbari Bobbatlu: బొబ్బట్లు పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. ఎప్పుడూ ఒకేలాంటి బొబ్బట్లు తింటే ఎలా? ఒకసారి కొబ్బరితో బొబ్బట్లు చేసి చూడండి. వీటిని కొబ్బరి పోలీలు, కొబ్బరి బొబ్బట్లు అంటారు. ఇవి చేయడం చాలా సులువు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు లేదా పండగల సమయంలో నైవేద్యాలు పెట్టాల్సి వచ్చినప్పుడు... ఇలా కొబ్బరి పోలీలను లేదా కొబ్బరి బొబ్బట్లు చేసి పెడితే కొత్తగా ఉంటుంది. పిల్లలకు కూడా ఈ కొబ్బరి బొబ్బట్లు చాలా నచ్చుతాయి. సాధారణ బొబ్బట్లలో శనగపప్పును అధికంగా వాడతాము. ఈ కొబ్బరి బొబ్బట్లలో కొబ్బరిని, శెనగపప్పును కలిపి వినియోగిస్తాము. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పోలీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కొబ్బరి బొబ్బట్ల రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బెల్లం తరుగు - పావు కిలో
తురిమిన కొబ్బరి - పావు కిలో
యాలకుల పొడి - ఒక స్పూను
జాజికాయ పొడి - చిటికెడు
గోధుమపిండి - 300 గ్రాములు
నెయ్యి - ఐదు స్పూన్లు
పసుపు - ఒక స్పూను
నీరు - సరిపడినంత
నూనె - తగినంత
శనగపప్పు - పావు కిలో
కొబ్బరి బొబ్బట్లు రెసిపీ
1. కుక్కర్లో ముందుగా నానబెట్టిన శనగపప్పును వేసి ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు ఉడికించాలి. అప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
3. ఆ నెయ్యిలో బెల్లం తరుగు, కొబ్బరి తురుమును వేసి బాగా కలపాలి.
4. చిన్న మంట మీద పెడితే ఇవి మాడకుండా ఉంటాయి.
5. జాజికాయ పొడిని, యాలకుల పొడిని చల్లి బాగా కలుపుకోవాలి అందులో.
6. అందులో ముందుగా ఉడికించుకున్న శెనగపిండిని నీరు లేకుండా వడగట్టుకొని వేసుకోవాలి.
7. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. కాస్త మందంగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
8. ఇప్పుడు గోధుమ పిండిని చపాతీలు కలుపుకున్నట్టు కలుపుకోవాలి. అందులో కాస్త నూనె లేదా నెయ్యి వేయాలి. అలాగే పసుపును కూడా కలపాలి.
9. పిండి మృదువుగా కలుపుకున్నాక ఒక బాల్ లాగా కొంత పిండిని తీసుకోవాలి.
10. ఆ పిండిని పూరీలాగా ఒత్తుకోవాలి.
11. మధ్యలో శెనగపిండి, కొబ్బరి తురుము మిశ్రమాన్ని తీసుకొని పెట్టాలి.
12. దాన్ని పూరీలా మడత పెట్టుకొని తిరిగి ఒత్తుకోవాలి.
13. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి.
14. దానిపై ఒత్తుకున్న బొబ్బట్టు వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
15. పైన కాస్త నెయ్యి రాసుకొని వేడివేడిగా తింటే ఆ రుచే వేరు.
16. పండుగలు వచ్చినప్పుడు నైవేద్యాలు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇలా కొబ్బరి బొబ్బట్లు చేసుకొని పెడితే బాగుంటుంది.
కొబ్బరి బొబ్బట్ల తయారీలో అన్ని మన శరీరానికి ఆరోగ్యకరమైనవే వినియోగించాము. కాబట్టి ఇది అన్ని విధాలా మేలే చేస్తుంది. చాలామంది మైదా పిండిని బొబ్బట్లు తయారీలో వాడతారు. మైదాపిండి వాడడం వల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గోధుమపిండినే వినియోగించాలి. అలాగే కొబ్బరి తురుము, బెల్లము, శనగపప్పు ఇవన్నీ కూడా మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇందులో పచ్చి కొబ్బరి తురుమును తాజాగా ఉన్నప్పుడు వినియోగించాం. కాబట్టి రుచి అదిరిపోతుంది. బెల్లం తినడం వల్ల ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. పైన నెయ్యి వేసుకొని తింటాం కాబట్టి మెదడుకు కావలసిన పోషకాలు కూడా అందుతాయి. ఒక్కసారి ఈ కొబ్బరి బొబ్బట్ల రెసిపీని ప్రయత్నించండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.