Moong Dal Idli । రక్తంలో చక్కెర స్థాయి తగ్గించాలా? అయితే తినండి పెసరిపప్పు ఇడ్లీ!
Moong Dal Idli Recipe: పెసరిపప్పుతో సాంప్రదాయ పద్ధతిలో ఇలా ఇడ్లీలు చేసుకొని తింటే రుచికరం, ఆరోగ్యకరం. పెసరిపప్పు ఇడ్లీ రెసిపీని ఇక్కడ తెలుసుకోండి.
Healthy Breakfast Recipes: ఇడ్లీ ఎల్లప్పుడూ సులభంగా జీర్ణం అయ్యే ఆరోగ్యకరమైన ఆహారం. ఇడ్లీలను మనం సాంప్రదాయ పద్ధతిలో అయితే బియ్యం, మినపపప్పులను కలిపి, పిండిగా రుబ్బుకొని తయారు చేస్తాము. ఇడ్లీ రవ్వతో చేసేకంటే ఇలా పిండి రుబ్బుకొని తినడం ఆరోగ్యకరం. అయితే ఇడ్లీలను మరింత తేలికైన, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మార్చేందుకు మరొక పద్ధతిని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
బియ్యానికి బదులుగా పెసరిపప్పు, మినపపప్పులను కలిపి, పిండిగా రుబ్బుకొని ఇడ్లీలు చేసుకోవచ్చు. ఇలా చేసిన ఇడ్లీలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర పెరగకుండా చేస్తుంది. మధుమేహం ఉన్న వారికి ఈ రకమైన ఇడ్లీ చాలా శ్రేష్టమైనది. బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైనది, అంతేకాకుండా కాలేయ కొవ్వును తగ్గించడానికి కూడా ఈ పెసరిపప్పు ఇడ్లీ ఎంతో ఉత్తమమైనది. పెసరిపప్పు ఇడ్లీ రెసిపీని ఈ కింద చదవండి.
Moong Dal Idli Recipe కోసం కావలసినవి
- 1 కప్పు పెసరిపప్పు
- 1/3 కప్పు మినపపప్పు
- ఉప్పు రుచికి తగినంత
- నెయ్యి తగినంత
పెసరిపప్పు ఇడ్లీలు ఎలా చేయాలి
- ముందుగా మినపపప్పు, పెసరిపప్పులను విడిగా కడిగి, ఆపైన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. ఈ నానబెట్టే ప్రక్రియలో వాటిలోని నీటిని ఒకసారి మార్చండి.
- అనంతరం రెండు పప్పులను విడివిడిగా గ్రైండ్ చేయండి, అవసరం మేరకు నీళ్లు కలపండి.
- ఆ తర్వాత రుబ్బుకున్న మెత్తటి పిండి బ్యాటర్లను ఒక గిన్నెలో కలిపేసి కొద్దిగా ఉప్పు కలపండి. ఆపైన ఈ పిండిని 8-10 గంటలపాటు పులియబెట్టండి.
- పులియబెట్టిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ తయారైనట్లే, ఈ పిండిని ఇడ్లీ మేకర్ అచ్చులలో వేసి ఆవిరిలో ఉడికించండి.
- ఇడ్లీలు ఉడికిన తర్వాత వేడివేడి ఇడ్లీలపై కొంత నెయ్యి రుద్దండి, బయటకు తీయండి.
అంతే, పెసరిపప్పు ఇడ్లీలు రెడీ. మీకు నచ్చిన చట్నీని అద్దుకుంటూ ఆస్వాదించండి.
సంబంధిత కథనం