Kothimeera Rice: కొత్తిమీర రైస్... బెస్ట్ లంచ్ లేదా డిన్నర్ రెసిపి, పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది
Kothimeera Rice: అన్నం మిగిలిపోతే కొత్తిమీర రైస్‌ను చేయండి. ఇది టేస్టీగా ఉంటుంది. కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కొత్తిమీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Kothimeera Rice: కొత్తిమీర ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. కొత్తిమీరను కేవలం గార్నిషింగ్ కోసమే కాదు, దీనితో రైస్ కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా లేదా అప్పటికప్పుడు చేసుకునే డిన్నర్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది. బాగా ఆకలి వేస్తున్నప్పుడు అన్నం మిగిలిపోతే కొత్తిమీర రైస్‌ను కేవలం ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు. కొత్తిమీర రైస్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కొత్తిమీర రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం - ఒక కప్పు
కొత్తిమీర - ఒక కట్ట
నూనె - ఒక స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - మూడు
టమోటో - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా - పావు స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
లవంగాలు - మూడు
షాజీరా - ఒక స్పూను
దాల్చిన చెక్క - ఒక ముక్క
బిర్యానీ ఆకు - ఒకటి
యాలకులు - మూడు
కొత్తిమీర రైస్ రెసిపీ
1. మిగిలిపోయిన అన్నం ఒక ప్లేట్లో వేసి పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. అందులో లవంగాలు, యాలకులు, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.
4. అవి వేగాక నిలువుగా కోసిన పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.
5. సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేయించాలి.
6. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
7. తర్వాత టమోటో ముక్కలను సన్నగా కోసి వేయించుకోవాలి.
8. పైన మూత పెడితే టమాటో మెత్తగా ఉడుకుతుంది.
9. తర్వాత కొత్తిమీరను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా మార్చుకోవాలి.
10. ఆ కొత్తిమీర పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా వేయించాలి.
12. ఈ మిశ్రమం ఇగురులాగా దగ్గరగా అయ్యాక ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలపాలి.
13. అంతే కొత్తిమీర రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది.
కొత్తిమీరను తినడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. కొత్తిమీర ఆకుల్లోనే కాదు కాండంలోనూ, గింజల్లోనూ కూడా ఔషధ గుణాలే ఉంటాయి. ఫుడ్ పాయిజరింగ్ అవ్వకుండా కొత్తిమీర అడ్డుకుంటుంది. నిజంగా ఆహారాన్ని విషతుల్యం చేయకుండా ఇది కాపాడుతుంది. ఎన్నో రకాల బ్యాక్టీరియాలతో ఇది పోరాడుతుంది. ఈ కొత్తిమీర ఆకులలో ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, సోడియం ఇలా ఎన్నో ఉంటాయి. కొత్తిమీరను తినడం వల్ల శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. రక్తప్రసరణ కూడా సవ్యంగా జరుగుతుంది. కాబట్టి కొత్తిమీరను ప్రతిరోజూ తింటే ఎంతో మంచిది.
ఇక్కడ మేము చేసిన కొత్తిమీర రైస్ ను ప్రయత్నించండి. ఇది అందరికీ నచ్చుతుంది. పిల్లలకు పచ్చిమిర్చిని తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇది వారికి లంచ్ బాక్స్ రెసిపీలో ఉపయోగపడుతుంది. డిన్నర్ లో అప్పటికప్పుడు చేసుకోవడానికి కూడా ఇది చాలా సులువు.