Kothimeera Nuvvula Chutney: కొత్తిమీర నువ్వుల పచ్చడి భారానికోసారి తింటే ఎంతో ఆరోగ్యం
Kothimeera Nuvvula Chutney: పచ్చళ్ళు అంటే ఇష్టమా? మీకు అయితే కొత్తిమీర నువ్వుల పచ్చడిని ఒకసారి ప్రయత్నించండి. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వారానికి ఒకసారి ఈ పచ్చడి తింటే చాలు.
Kothimeera Nuvvula Chutney: తెలుగువారికి పచ్చళ్ళు అంటే ఎంతో ప్రీతి. సాంప్రదాయ వంటకాలలో కచ్చితంగా పచ్చడికి స్థానం ఉంటుంది. రకరకాల పచ్చళ్ళు తెలుగువారి మెనూలో ఉంటాయి. అలాగే నువ్వులు కొత్తిమీర పచ్చడి కూడా ఒకటి. ఇది రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని వారానికి ఒకసారి తినడం అలవాటు చేసుకుంటే మహిళలకు ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా నెలసరి సమస్యలను అడ్డుకోవచ్చు. పొట్టనొప్పి వంటివి వచ్చేవారు వారానికి రెండుసార్లు ఇలా నువ్వుల పచ్చడి చేసుకుని తింటే వారికి నెలసరి సమయంలో నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. కొత్తిమీర నువ్వుల పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.
కొత్తిమీర నువ్వుల పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
నువ్వులు - 100 గ్రాములు
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చిమిర్చి- నాలుగు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
నిమ్మరసం - అర స్పూను
కొత్తిమీర నువ్వుల పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట మీద నువ్వులను వేయించాలి. పెద్ద మంట పెడితే మాడిపోయే అవకాశం ఉంది.
2. ఇప్పుడు వేయించిన నువ్వులను మిక్సీలో వేసి పొడి చేయాలి.
3. ఆ పొడిలోనే కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కాస్త నీటిని వేసుకోవచ్చు.
4. రుచికి సరిపడా ఉప్పుని వేసి మెత్తగా పచ్చడిలా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
5. ఆ గిన్నెలో అర స్పూను నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి.
6. దీన్ని తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
7. ఇది అన్నంతోనూ, చపాతీ తో కూడా మంచి జోడి అని చెప్పవచ్చు. పిల్లలకు పెద్దలకు కొత్తిమీర నువ్వుల కాంబినేషన్ ఎన్నో పోషకాలను అందిస్తుంది.
మహిళలు నువ్వులు తరచూ తినాల్సిన అవసరం ఉంది. నువ్వులు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. కాబట్టి పిల్లలకు కూడా నువ్వులను తినిపించాలి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. నెలసరి సమస్యలను నువ్వులు అడ్డుకుంటాయి. ఇక నువ్వుల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శాకాహారులకు నువ్వుల నుంచి అధిక ప్రోటీన్ అందుతుంది. ఇక డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడుతున్న వారు నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు ఎక్కువ. శరీరంలో వచ్చే బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని రోగనిరోధక వ్యవస్థకు ఇస్తాయి. గుండెకు మేలు చేసే ఒలాయిక్ యాసిడ్ నువ్వుల్లో ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మన ఎముకల బలంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి ఇందులో ఉంటాయి. చర్మాన్ని కాపాడడంలో నువ్వులు ముందుంటాయి. నువ్వులు తరచూ తినేవారిలో చర్మం కాంతివంతంగా ఉంటుంది. కొత్తిమీర తినడం వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఆరోగ్యానికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర వాసన పిలిస్తేనే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.