Weight loss myths: బరువు తగ్గడంపై ఈ 6 అపోహలు తెలిస్తే మీ జర్నీ హిట్టయినట్టే
Weight loss myths: బరువు తగ్గడంలో ఉన్న అపోహలు తెలుసుకుంటే మీ ప్రయత్నం సగం సక్సెస్ అయినట్టే.
వెయిట్ లాస్ ప్రక్రియ సుదీర్ఘమైంది. అలాగే సవాలుతో కూడుకున్నదని చాలా మంది భావిస్తుంటారు. కానీ సరైన అవగాహన కలిగి ఉండి తగిన విధానాలు పాటిస్తే ఎవరైనా వెయిట్ లాస్ గోల్స్ సాధించవచ్చు. దురదృష్టవశాత్తూ వెయిట్ లాస్ చుట్టూ చాలా అపోహాలు, అనుమానాలు, తప్పుడు పద్ధతులు తిరుగుతుంటాయి. దీంతో ఈ బరువు తగ్గే ప్రక్రియ మరింత క్లిష్టతరమవుతుంది.
క్రాష్ డైట్స్, క్యాలరీలను కఠినంగా నియంత్రించడం, భోజంన మానేయడం బరువు తగ్గించడానికి దోహదపడుతాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఈ పద్ధతులు దీర్ఘకాలంలో చాలా ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుంటాయి. నిజానికి బరువు తగ్గడం ఒక సమ్మిళిత ప్రక్రియ. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకర జీవనశైలి అనుసరించడం వంటి ప్రక్రియల సమ్మిళతంగా ఉంటుంది. బరువు తగ్గడం గురించిన వాస్తవాలను అర్థం చేసుకుని సుస్థిర పద్ధతులను అమలు చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మేస్తే మీ ఆరోగ్యం పెనం నుంచి పొయ్యిలో పడ్డ మాదిరగా అవుతుంది.
ఫిట్‌నెస్ ట్రైనర్, ట్రాన్స్‌ఫార్మేషన్ కోచ్ మిక్స్ బాట్‌మా మీ వెయిట్ లాస్ జర్నీని ప్రభావితం చేసే 5 అపోహలను వివరించారు.
1. కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతారు
అపోహ: మన శరీరానికి కార్బొహైడ్రేట్లు అవసరం లేదన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. అలాగే కార్బో వల్ల కొవ్వు పెరుగుతుందన్న అపోహ కూడా ఉంటుంది. ఉదయాన్నే కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రోజంతా వాటిని కరిగించవచ్చని నమ్ముతారు.
నిజం: శరీర అవయవాలకు గ్లూకోజ్ అవసరం. ఇది పొందేందుకు సులభమైన మార్గం కార్బొహైడ్రేట్లు. అధిక క్యాలరీలు తీసుకుంటే ఏ ఆహారమైన మీలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. మీ రోజు వారీ శక్తి అవసరాలకు తగినట్టుగా ఉదయం కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం మంచిదని మీకు అనిపించడం సహజమే. క్యాలరీలు కంట్రోల్‌లో ఉన్నప్పుడు మనం తీసుకునే సమయం ఎలాంటి ప్రభావం చూపదు.
2. నిర్ధిష్ట ప్రాంతంలో కొవ్వు తగ్గించడం
అపోహ: కొన్ని నిర్ధిష్ట కండరాలను ట్రైన్ చేస్తే బరువు తగ్గుతుందన్న అపోహ ఉంది. 100 సిట్-అప్స్ చేస్తే ఆబ్స్ వస్తాయన్న అపోహ కూడా ఉంది. కాళ్లలో బరువు తగ్గించడం వల్ల తొడల మధ్య గ్యాప్ పెరుగుతుందన్న అపోహ ఉంది.
వాస్తవం: కొవ్వు, కండరాలు రెండు వేర్వేరు కాంపోనెంట్స్. ఆబ్స్ చేయడం వల్ల లేదా లెగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల మీరు సన్నమైపోరు. కొవ్వు మొదట ఎక్కడ చేరుతుందో, ఎక్కడ తొలగించాలో మీరు తెలుసుకోలేరు. మీరు తగినంత ఓపికతో ఉంటే ఎక్కువగా కొవ్వు నిల్వలు పేరుకుని ఉండే ప్రాంతాల్లో కూడా కొవ్వు అదృశ్యమైపోతుంది. కొవ్వును కోల్పోయిన తరువాత కండర నిర్మాణం కోసం తగిన వ్యాయామాలు చేయొచ్చు.
3. డీటాక్స్ అవసరం
అపోహ: డీటాక్స్ డైట్ పాటిస్తే వారానికి 5 కిలోల కొవ్వును కోల్పోతారన్న అపోహ ఉంది. శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయని కూడా ప్రచారంలో ఉంది. డీటాక్స్ ప్రక్రియ పూర్తయ్యాక అంతా బాగుంటుందన్న అపోహ ఉంది.
నిజం: వెయిట్ లాస్‌లో డీటాక్స్ డైటింగ్ అనేది కేవలం వాటర్ రిటెన్షన్ మాత్రమే. మార్కెట్లో చాలా హెర్బల్ డీటాక్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటి వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని ప్రచారం చేసుకుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటుందని, ఉబ్బరం తగ్గుతుందని, మొటిమలు తగ్గుతాయని, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని ప్రచారం చేస్తాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. డీటాక్స్ డైటింగ్ పూర్తయ్యాక కాస్త మీకు హుషారు ఉన్నట్టు అనిపించడానికి కారణం మీరు ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు కొంత జంక్ ఫుడ్ తీసుకోవడమే.
4. తరచుగా తినాలి
అపోహ: తరచుగా ఆహారం తీసుకుంటే మీ మెటబాలిజం వేగవంతమవుతుందన్న అపోహ ఉంది. ఇది బరువు కోల్పవడానికి కారణమవుతుందన్న అపోహ కూడా ఉంది. అలాగే ప్రతి కొన్ని గంటలకు కార్బొహైడ్రేట్లు తీసుకోని పక్షంలో మీ మెదడు పనిచేయడదన్న అపోహ కూడా ఉంది.
వాస్తవం: శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడానికి క్యాలరీలు ఖర్చు చేస్తుంది. కానీ మీకు అవసరానికి మించిన క్యాలరీలు దానికి అక్కర్లేదు. మీరు భోజనం తీసుకునే సమయం ఫ్యాట్ లాస్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. మీరు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారన్నదే ముఖ్యమైన విషయం.
5. క్రాష్ డైట్స్
అపోహ: క్రాష్ డైట్, కాలరీల్లో పూర్తి కోత దీర్ఘకాలంలో బరువు కోల్పోయేందుకు ఉపయోగపడుతుందన్న అపోహ ఉంది.
వాస్తవం: క్రాష్ డైట్స్, క్యాలరీలో పూర్తి కోత వేగంగా బరువు కోల్పోవడానికి దారితీస్తుంది. కానీ ఆ డైట్ ముగిసిన వెంటనే ఈ బరువు మళ్లీ వస్తుంది. ఈ తరహా డైట్స్ వల్ల మనం తీసుకునే విభిన్న ఆహార పదార్థాల్లో కోత పడుతుంది. కేలరీ ఇన్‌టేక్ తగ్గుతుంది. దీని వల్ల పోషకాలు అందకుండా పోతాయి. కండరాలు బలహీన పడుతాయి. మెటబాలిజం నెమ్మదిస్తుంది. పైగా ఈ డైట్స్ దీర్ఘకాలంలో సుస్థిరంగా ఉండవు. అందువల్ల అవి శారీరకంగా, మానసికంగా నష్టం చేకూరుస్తాయి.
6. భోజనం స్కిప్ చేయడం
అపోహ: భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారన్న అపోహ ఉంది.
వాస్తవం: భోజనం మానేయడం వల్ల మెటబాలిజం ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల బరువు కోల్పోవడం ఇంకా కష్టమవుతుంది. భోజనం స్కిప్ చేసినప్పుడు మీ శరీరం ‘ఆకలి’ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అంటే శక్తిని సంరక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. మెటబాలిజం ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. భోజనం స్కిప్ చేసినప్పుడు తదుపరి భోజనం ఎక్కువగా లాగించేలా చేస్తుంది. బరువు తగ్గాలన్న మీ ప్రయత్నాలకు విరుద్ధంగా మారుతుంది.
టాపిక్