Bleeding eye virus : ఈ వైరస్ సోకితే కళ్ల నుంచి రక్తం వచ్చి చనిపోతారు! ప్రపంచవ్యాప్తంగా అలర్ట్..
Bleeding eye virus : 'బ్లీడింగ్ ఐ'గా పిలుస్తున్న మార్బర్గ్ వైరస్ రివాండాని గడగడలాడిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్‌కి ఇప్పటికే 15మంది ప్రాణాలు కోల్పోయారు. 17 దేశాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ప్రపంచ దేశాల్లో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది! ఈ మార్బర్గ్ వైరస్‌పై పదిహేడు దేశాల్లో ప్రయాణికులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కంటి నుంచి రక్తస్రావం అవ్వడం ఈ వైరస్ లక్షణాల్లో ఒకటి కావడంతో దీనికి “బ్లీడింగ్ ఐ” వైరస్ అన్న పేరు కూడా వచ్చింది.ఈ మార్బర్గ్ వైరస్ ఇప్పటికే రువాండాలో 15 మందిని బలితీసుకుంది. కనీసం మరో వంద మంది ఈ వైరస్ బారిన పడినట్టు తెలుస్తోంది.
మార్బర్గ్ వైరస్ అంటే ఏమిటి?
మార్బర్గ్ లేదా బ్లీడింగ్ ఐ వైరస్ ఎబోలా ఫ్యామిలీకి చెందినది. ఇది వైరల్ హెమరేజిక్ జ్వరానికి దారితీస్తుంది. రక్త నాళాల నష్టం, రక్తస్రావానికి దారితీస్తుంది. మార్బర్గ్ వైరస్ జూనోటిక్ స్వభావం కలిగి ఉంటుంది. ఇది గబ్బిలాల నుంచి పుట్టుకొస్తుంది. రక్తం, మూత్రం లేదా లాలాజలం వంటి శారీరక ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది.
మార్బర్గ్ వైరస్ లక్షణాలు..
బ్లీడింగ్ ఐ వైరస్ లక్షణాలు ఎబోలాతో దాదాపు సమానంగా ఉంటాయి. వైరస్ సోకిన వారిలో విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతునొప్పి, దద్దుర్లు, విరోచనాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో బ్లీడింగ్ ఐ వైరస్ అంతర్గత రక్తస్రావం, అవయవ వైఫల్యం, షాక్‌కి దారితీస్తుంది. ఇది మరణానికి దారితీస్తుంది. అనుకోకుండా బరువు తగ్గడం, ముక్కు, కళ్లు, నోరు లేదా యోని నుంచి రక్తస్రావం ఈ ప్రాణాంతక వైరస్ తొలిదశలోని లక్షణాలు.
కళ్లు లోపలికి పోవడం, ముఖంలో ఎక్స్ప్రెషన్స్ లేకపోవడం, విపరీతమైన బద్ధకం వంటి లక్షణాలు ఈ మార్బర్గ్ సోకిన రోగుల్లో కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
మార్బర్గ్ వైరస్ చికిత్స..
రోగి పరిస్థితి, వైద్య సంరక్షణ బట్టి ఈ మార్బర్గ్ వైరస్ మరణాల రేటు 24శాతం నుంచి 88శాతం మధ్యలో ఉంటుంది. అయినప్పటికీ, మార్బర్గ్ వైరస్‌కి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు! రీహైడ్రేషన్, వంటి కొన్ని విషయాలు సహాయపడుతుంది. ప్రయోగాత్మక వ్యాక్సిన్లు అధ్యయనాల ప్రారంభ దశలో ఉన్నాయి. రక్త ఉత్పత్తులు, రోగనిరోధక చికిత్సలు, ఔషధ చికిత్సలు వంటి సంభావ్య చికిత్సపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.
(గమనిక: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి.)
సంబంధిత కథనం