Palnadu Diarrhea: పల్నాడులో డయేరియా మరణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యతో రోగాలు-diarrhea deaths in palnadu diseases due to drinking water problem in villages ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Palnadu Diarrhea: పల్నాడులో డయేరియా మరణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యతో రోగాలు

Palnadu Diarrhea: పల్నాడులో డయేరియా మరణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యతో రోగాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 25, 2024 11:25 AM IST

Palnadu Diarrhea: ఏపీలో విజయనగరం జిల్లా గుర్లలో కలుషిత నీటిని తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే పల్నాడులో అదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. దాచేపల్లి పట్టణంలో కలుషిత నీరు, అపరిశుభ్రత వాతావరణంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

పల్నాడులో డయేరియాతో ఇద్దరు మృతి
పల్నాడులో డయేరియాతో ఇద్దరు మృతి

Palnadu Diarrhea: ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు. ఇటీవల విజయనగరం జిల్లా గుర్లలో సైతం డయేరియాతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే దాచేపల్లి పట్టణంలోని అంజనీపురం కాలనీలో కలుషిత తాగునీరు, అపరిశుభ్రత వాతావరణంతో డయేరియా వ్యాప్తి చెందింది.

yearly horoscope entry point

అంజనీపురం కాలనీలోగత నాలుగు రోజులుగా పలువురు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి పరిస్థితి విషమించి బుధవారం రాత్రి తమ్మిశెట్టి వెంకటేష్‌ (20), గురువారం తెల్లవారుజామున బండారు చిన వీరయ్య (65) మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

డయేరియాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కలెక్టరు అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి రవికుమార్ దాచేపల్లి వచ్చారు. బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పారిశుద్ధ్యం మెరుగుపచాలని అధికారులను ఆదేశించారు. అంజనీపురం కాలనీలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో…

విజయనగరం జిల్లా గుర్ల మండలంలో కొద్ది రోజుల క్రితం డయేరియాతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో బుధవారం వ్యాధి ప్రబలి ఇద్దరు చనిపోగా, 14 మంది ఆస్పత్రుల పాలయ్యారు.

గత జూలై నెలలోనే పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లో డయేరియా కేసులు నమోదై పలువురు మరణించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కలుషిత నీటి సరఫరాకు అడ్డుకట్ట వేయకపోవడంతో దాచేపల్లి మండలంలో మరోసారి వ్యాధి విజృంభించింది.

దాచేపల్లి పంచాయతీ అంజనాపురంలో బుధవారం బండారు చిన్న వీరయ్య(58), తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌ (21) బుధవారం రాత్రి మృతి చెందారు. చిన్న వీరయ్య మంగళవారం నుంచే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం డయేరియా బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు విడిచాడు.

కలుషిత నీటితోనే…

అంజనాపురంలో తారు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అంజనాపురం కాలనీ ప్రజలకు తాగు నీరు అందించే బోరు సమీపంలో సెప్టిక్‌ ట్యాంక్‌ నీళ్లు, మురికి కాలువల్లోని నీరు చేరటం వల్లే కలుషితమైనట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయింది.

పల్నాడు జిల్లాలో అతిసారంపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను కలెక్టర్‌ సీఎంకు వివరించారు. ఆ ప్రాంతంలో సాధారణ స్థితి వచ్చేంతవరకు నిత్యం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.

జూలై నెలలోనే జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందిందని, అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు వ్యాపించి ఉండేది కాదని స్థానికులు ఆరోపించారు. జులైలో దాచేపల్లి మండలం కేసానుపల్లిలో డయేరియాకు వంగూరి నాగమ్మ అనే మహిళ మృతి చెందగా, మరో 30 మంది ఆస్పత్రి పాలయ్యారు.పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లోనూ పదుల సంఖ్యలో డయేరియా బారినపడ్డారని అప్పట్లో మంత్రి నారాయణ సమస్య పరిష్కరిస్తామని చెప్పినా చేయలేదని ఆరోపించారు. డయేరియా విస్తరించిన నేపథ్యంలో బోర్లను మూసివేసి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Whats_app_banner