Sameera Reddy: కాబోయే భర్తను అమ్మాయి తప్పక అడగాల్సిన ప్రశ్నలు ఏవో చెప్పిన హీరోయిన్ సమీరా రెడ్డి.. అలా అంటే నో చెప్పాలట
Sameera Reddy: పెళ్లికి ముందు కాబోయే భర్తను అమ్మాయిలు తప్పనిసరిగా ఏ ప్రశ్నలు అడగాలో చెప్పారు సమీరా రెడ్డి. వైవాహిక జీవితంలో గొడవలు వచ్చేందుకు ప్రధాన కారణమేంటో కూడా వెల్లడించారు. ఆ వివరాలు ఇవే..
ఒకప్పుడు టాలీవుడ్‍లో వరుసగా సినిమాలు చేశారు సమీరా రెడ్డి. 2014లో పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చేశారు. సుమారు పదేళ్ల తర్వాత ఇటీవల హిందీలో నామ్ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. కాగా, తాజాగా సమీరా రెడ్డి ఓ పోడ్‍కాస్ట్‌లో పాల్గొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫైనాన్షియల్ యాప్ లక్ష్మి (Lxme) కోసం తన అత్త మంజ్రి వర్దేతో కలిసి మాట్లాడారు . వివాహాల్లో ఆర్థిక వివాదాల గురించి స్పందించారు. పెళ్లికి ముందు కాబోయే భర్తను అడగాల్సిన ప్రశ్నలు ఏవో అమ్మాయిలకు సూచించారు సమీరా రెడ్డి.
చాలా ముఖ్యం
వివాహంలో ఎమోషనల్ బంధానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. ఆర్థికపరమైన స్పష్టత కూడా అంతే ముఖ్యమని సమీరా రెడ్డి అన్నారు. ఆర్థిక స్థితిగతుల గురించి, పిల్లలను పెంచే విషయంలో ఆలోచనల గురించి కాబోయే భర్తను అమ్మాయి తప్పనిసరిగా ప్రశ్నలు అడగాలని సూచించారు. “వివాహాల్లో ఆర్థిక వివాదాలు పెద్ద సమస్య. ఎమోషనల్‍లాగానే ఆర్థికపరమైన విషయాల్లోనూ క్లారిటీ చాలా ముఖ్యం” అని సమీరా రెడ్డి అన్నారు. పెళ్లిళ్లలో ఆర్థికపరమైన స్పష్టత ఎందుకు అవసరమో వివరించారు.
అమ్మాయిలు ఈ ప్రశ్నలు అడగాలి
కాబోయే భర్తను అమ్మాయిలు అడగాల్సిన ప్రశ్నలు ఏవో సమీరా రెడ్డి తెలిపారు. “మీ పిల్లలను ఎలా పెంచాలని కోరుకుంటున్నారనే విషయాలను ఎందుకు మాట్లాడడం లేదు. అసలు పిల్లలు కావాలనుకుంటున్నారా? కుటుంబంలో నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? పిల్లల కోసం, నా కోసం తీసుకునే నిర్ణయాల్లో నేను ఎంత వరకు భాగం అవుతాను?” అనే ప్రశ్నలను కాబోయే భర్తను అమ్మాయి అడగాలని చెప్పారు. ఆర్థిక విషయాల్లో పూర్తిస్థాయి స్పష్టత తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. సమానమైన భాగస్వామిగా భావించే అబ్బాయిని అమ్మాయిలు వెతుక్కోవాలని అన్నారు.
అలా అంటే నో చెప్పండి
ఆర్థిక విషయాల గురించి దాచి పెట్టే అబ్బాయిల నుంచి దూరం వెళ్లాలని సమీరా రెడ్డి సూచించారు. “ఇలాంటివి అన్ని అడగకూడదని మా అమ్మ చెప్పింది అని అనే అబ్బాయి నుంచి దూరంగా పారిపోండి” అని సమీరా రెడ్డి చెప్పారు. మొత్తంగా పెళ్లికి ముందే ఆర్థిక విషయాలు, నిర్ణయాల్లో ఇచ్చే ప్రాధాన్యత గురించి కాబోయే భర్తతో పూర్తి విషయాలు మాట్లాడి స్పష్టత తీసుకోవాలని సమీర సూచించారు.
నెటిజన్ల స్పందన ఇలా..
పెళ్లిలో ఆర్థిక విషయాల గురించి సమీరా రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమీరా రెడ్డి చెప్పిన విషయాలను చాలా మంది సమర్థిస్తున్నారు. పెళ్లికి ముందే ఈ విషయాలపై స్పష్టత తీసుకోవడం ముఖ్యమేనని అంగీకరిస్తున్నారు. పిల్లలను పెంచడం గురించి వివాహం ముందే ఓ నిర్ణయానికి వస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయని, సమీర చెప్పింది కరెక్ట్ అంటూ రాసుకొస్తున్నారు. నిజంగా పిల్లలను ఎలా పెంచాలనే విషయం గురించి పెళ్లికి ముందు ఎందుకు చర్చించరు అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
సమీరా రెడ్డి ఇటీవల ఓ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. ఇంటి ఆర్థిక పరిస్థితి, ఖర్చులు లాంటి విషయాలపై జీవిత భాగస్వాములు ఇద్దరూ వివరంగా మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. గృహిణులుగా ఉండే మహిళలు.. ఇంటికి సీఈవోలా వ్యవహరించాలని, వారే ఓనర్‌షిప్ తీసుకోవాలని సూచించారు.