Chicken Roast: కొత్తిమీర చికెన్ రోస్ట్ ఇలా చేశారంటే చల్లని వాతావరణంలో వేడివేడిగా అదిరిపోతుంది-coriander chicken roast recipe in telugu know how to make this nonveg curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Roast: కొత్తిమీర చికెన్ రోస్ట్ ఇలా చేశారంటే చల్లని వాతావరణంలో వేడివేడిగా అదిరిపోతుంది

Chicken Roast: కొత్తిమీర చికెన్ రోస్ట్ ఇలా చేశారంటే చల్లని వాతావరణంలో వేడివేడిగా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 02, 2024 05:30 PM IST

Chicken Roast: చికెన్ ప్రియులు కొత్త రుచుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికే ఈ కొత్తిమీర చికెన్ రోస్ట్ రెసిపీ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలా చేయాలో తెలుసుకోండి.

కొత్తిమీర చికెన్ వేపుడు
కొత్తిమీర చికెన్ వేపుడు

చికెన్ ఎంత తిన్నా బోర్ కొట్టదు. ప్రతిరోజూ చికెన్ తినే వారు కూడా ఉన్నారు. అలా ఒకేలా వండితే ప్రతిరోజు తినలేరు. కాబట్టి ఇక్కడ మేము కొత్తిమీర చికెన్ రోస్ట్ రెసిపీ ఇచ్చాము. దీన్ని తినడానికి అన్నం జతగా ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా స్నాక్స్ లాగా తినొచ్చు. పైగా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సాయంత్రం ఎలా వేడివేడిగా తినాలనిపించినప్పుడు దీన్ని తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. కొత్తిమీర చికెన్ రెస్ట్ రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

కొత్తిమీర చికెన్ రోస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - అరకిలో

కారం - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

గరం మసాలా - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కొత్తిమీర చికెన్ రోస్ట్ రెసిపీ

1. చికెన్ ముక్కలను మీడియం ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

2. ఆ గిన్నెలోనే కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి.

3. సగం కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలిపి గంట పాటు పక్కన పెట్టేయాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి.

6. చిన్న మంట మీద దీన్ని వేయించుకోవాలి.

7. ఒక పావు గంట సేపు చికెన్ ఉడికాక మిగిలిన కొత్తిమీర తరుగును కూడా పైన చల్లుకోవాలి.

8. ఈ మొత్తాన్ని కలుపుతూ మధ్యలో మూత పెడుతూ ఉండాలి.

9. ఒక 40 నిమిషాల్లో చికెన్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది.

10. దీనికి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. నీళ్లు వేస్తే ఇగురు లాగా అవుతుంది.

11. మీరు వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంతే టేస్టీ కొత్తిమీర చికెన్ రోస్ట్ రెడీ అయినట్టే. దీన్ని నేరుగా తిన్నా బాగుంటుంది. సాంబార్ రైస్ వంటి వాటితో ఈ రెసిపీ తింటే ఎంతో మజాగా ఉంటుంది. బిర్యానీకి కూడా జతగా బాగుంటుంది. ఒక్కసారి దీన్ని మీరు వండుకొని చూడండి, మీకు నచ్చడం ఖాయం.

చికెన్ ను తినడం వల్ల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. లీన్ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల్లో చికెన్ ఒకటి. కాబట్టి వారానికి రెండు మూడు సార్లు అయినా చికెన్ తినమని చెబుతారు వైద్యులు. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం అధికంగా తింటే మాత్రం అది కొలెస్ట్రాల్ రూపంలో శరీరంలో పేరుకు పోతుంది. కాబట్టి చికెన్ ప్రతిరోజూ తినేవారు రోజుకి 50 గ్రాములకు మించి తినకపోవడమే మంచిది. వారానికి ఒకటి రెండుసార్లు తినే వారు మాత్రం ఎక్కువ మొత్తంలో తిన్నా సమస్య ఉండదు.

Whats_app_banner