YS Sharmila : బోట్లు వేసుకెళ్లి హడావిడి చేయడం కాదు, రేషన్ మాఫియాపై నిజాలు నిగ్గు తేల్చండి- వైఎస్ షర్మిల
YS Sharmila : ప్రపంచానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేస్ ను రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇది జాతీయ స్థాయి కుంభకోణం అన్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
రేషన్ బియ్యం రాష్ట్రం నుంచి విదేశాలకు తరలించడం వెనుక పెద్ద మాఫియా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జాతీయ స్థాయి కుంభకోణం అన్నారు. పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఈ స్కామ్ లో ఉందన్నారు. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లుమూసుకుందన్నారు.
నిజాలు నిగ్గుతేల్చండి
గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని షర్మిల అన్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదని, నిజాలు నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
రూ.48 వేల కోట్లు ఎవరు తిన్నారు?
"పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ? మిల్లర్ల చేతివాటం ఉందా ? రేషన్ డీలర్ల మాయాజాలమా? నిత్యం తనిఖీల సంగతి ఏంటి? నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది"- వైఎస్ షర్మిల
రైతుకు కన్నీళ్లు, అక్రమార్కులకు కాసులు
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్నారు. ఆంధ్రపదేశ్ అంటే అన్నపూర్ణమ్మ, ధాన్యాగారానికి భాండాగారం అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. ఆరుగాలం కష్టించి పడించే రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే... బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులు. ఇది మన రాష్ట్ర దుస్థితి అని షర్మిల విమర్శించారు.
కెన్ స్టార్ షిప్ ఎందుకు వదిలేశారు- పేర్నినాని
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని విమర్శలు చేశారు. స్టెల్లాషిప్‌ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్... కెన్‌స్టార్‌షిప్‌ను ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో చెప్పాలన్నారు. కెన్‌స్టార్ షిప్‌లోకి వెళ్లకూడదని పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు చెప్పారా? అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు ఓనర్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం