CM Chandrababu : రేషన్ బియ్యం, బెల్ట్ షాపుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్, బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్-anantapur cm chandrababu serious warning on liquor belt shops ration rice sand issues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : రేషన్ బియ్యం, బెల్ట్ షాపుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్, బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్

CM Chandrababu : రేషన్ బియ్యం, బెల్ట్ షాపుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్, బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్

Bandaru Satyaprasad HT Telugu
Nov 30, 2024 05:57 PM IST

CM Chandrababu : బెల్ట్ షాపులు, రేషన్ బియ్యం రవాణా, ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. రేషన్ బియ్యం వ్యాపారులను వదలిపెట్టమన్నారు. ఇసుక విషయంలో కల్పించుకుంటే ఊరుకోమన్నారు.

రేషన్ బియ్యం, బెల్ట్ షాపుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్, బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్
రేషన్ బియ్యం, బెల్ట్ షాపుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్, బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్

అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వితంతు రుద్రమ్మ ఇంటికెళ్లి పింఛ‌ను అంద‌జేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యమ్మకు దివ్యాంగ పింఛను రూ.15 వేలను సీఎం చంద్రబాబు స్వయంగా అంద‌జేశారు. ఆంజ‌నేయ‌స్వామి గుడిలో పూజ‌లు నిర్వహించారు. మ‌హిళ‌లు, స్కూలు పిల్లల‌తో సీఎం ముచ్చటించారు.

బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా

అనంతరం నిర్వహించిన పేదల సేవలో సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...మద్యం బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కూటమి పార్టీలను గెలిపించారన్నారు. పక్క రాష్ట్రాల్లో పింఛన్లు చాలా తక్కువగా ఇస్తున్నారన్నారు. కర్ణాటకలో కేవలం రూ.1200 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఎన్ని అప్పులు చేయాలో అన్నీ చేశారన్నారు. చివరకు తహసీల్దార్ ఆఫీసులు కూడా తాకట్టుపెట్టారన్నారు. గత ప్రభుత్వం నాసిరకం మద్యం దొరికేదని, ఇప్పుడు మంచి మద్యం దొరుకుతుందన్నారు. అయితే బెల్ట్‌ షాపులు పెడుతున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారు. మద్యం షాపుల విషయలో దందాలు చేస్తే వారిని వదలనంటూ హెచ్చరించారు.

ఇసుక విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోం

పేద కుటుంబాల ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచుతామని సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడి పనిచేసి సంపద పెంచుతామన్నారు. సంపద పేదలకు పంచుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 198 అన్న క్యాంటీన్లు పెట్టామని గుర్తుచేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా ఇప్పటి వరకు 50 లక్షల మంది గ్యాస్‌ బుక్‌ చేసుకున్నారన్నారు. సిలిండర్‌కు చెల్లించిన నగదు 48 గంటల్లో రిఫండ్‌ చేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు ఇసుక దొరక్క లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోయారన్నారు. ఏపీలో ఇప్పుడు ఇసుక ఉచితంగా లభిస్తుందన్నారు. ఉచిత ఇసుక విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.

రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టం

రేషన్ బియ్యం కొని విదేశాలకు విక్రయిస్తున్నారని తెలిసిందని సీఎం చంద్రబాబు అన్నారు. రేషన్ బియ్యం వ్యాపారులను వదలిపెట్టమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ ఉందన్నారు. అంతా ప్రక్షాళన చేస్తామన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ‘ఈగల్‌’ పేరుతో నార్కోటిక్ బ్యూర్ ఏర్పాటు చేశామన్నారు.

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ ఫైర్

కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారని, ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కాకినాడ పోర్టులో పర్యటించిన పవన్ కల్యాణ్... రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న షిప్ సీజ్ చేయాలని ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్ధాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా?' అని అధికారులను నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. శుక్రవారం కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో రేషన్ బియ్యంతో పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ప్రత్యేక బోట్‌లో వెళ్లి పరిశీలించారు.

Whats_app_banner

సంబంధిత కథనం