AP Excise Rules: మద్యం విక్రయాలకు కొత్త రూల్స్‌.. ఎమ్మార్పీ ఉల్లంఘనకు రూ.5లక్షల జరిమానా, లైసెన్స్ రద్దు-liquor sellers beware strict new rules and heavy penalties for violations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Excise Rules: మద్యం విక్రయాలకు కొత్త రూల్స్‌.. ఎమ్మార్పీ ఉల్లంఘనకు రూ.5లక్షల జరిమానా, లైసెన్స్ రద్దు

AP Excise Rules: మద్యం విక్రయాలకు కొత్త రూల్స్‌.. ఎమ్మార్పీ ఉల్లంఘనకు రూ.5లక్షల జరిమానా, లైసెన్స్ రద్దు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 02, 2024 03:40 PM IST

AP Excise Rules: మద్యం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్ట్‌షాపులకు సరఫరాలపై భారీ జరిమానాలు విధించింది. ఈ మేరకు ఎక్సైజ్‌ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాల్లో అక్రమాలపై భారీగా జరిమానాలు..
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాల్లో అక్రమాలపై భారీగా జరిమానాలు.. (istockphoto)

AP Excise Rules: మద్యం విక్రయాల్లో ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, ప్రైవేట్‌ మద్యం దుకాణాలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

వైసీపీ హయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో అక్టోబర్ 16 నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలను మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల నిర్వహ‍ణపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఊరురా బెల్ట్‌షాపులతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, అధికార పార్టీ నాయకులకే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తోంది.

మద్యం దుకాణాల నిర్వహణ, బెల్టు షాపుల నిర్వహణపై ప్రతిపక్షం ఆరోపణల నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాల్లో అక్రమాలపై జరిమానాలను సవరిస్తూ డిసెంబర్ 2న ఎక్సైజ్‌ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ‌లో ప్రచురిస్తున్నట్టు జీవో నంబర్ 278 జారీ చేశారు.

సవరించిన జరిమానాలు..

ఏపీలో ప్రైవేట్‌ మద్యం దుకాణదారులు ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తే మొదటి సారి రూ.5లక్షల జరిమానా విధిస్తారు. రెండో సారి అదే నేరానికి పాల్పడితే షాప్ లైసెన్స్‌ రద్దు చేస్తారు.

లైసెన్స్‌ మంజూరు చేసిన దుకాణంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే మొదటి సారి నేరానికి రూ.5లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే షాప్ లైసెన్స్‌ రద్దు చేస్తారు.

2018లో ఎక్సైజ్‌ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 12లో పేర్కొన్న జరిమానాలను ఎమ్మార్పీ నిబంధనల ఉల్లంఘన, బెల్టు షాపుల నిర్వహణ మినహా మిగిలిన అంశాల్లో కొనసాగనుంది. ఇవే నేరాలను బార్‌ లైసెన్స్‌ దారులు పాల్పడితే వారికి ఏపీ ఎక్సైజ్‌ యాక్ట్‌ 1968 అండర్‌ సెక్షన్ 47(1) ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు

Whats_app_banner