Rohit Sharma: టీమిండియా ధోనీ నెలకొల్పిన సంప్రదాయాన్ని విస్మరించిన రోహిత్ శర్మ.. ట్రోఫీని తీసుకెళ్లి రిషబ్ పంత్ చేతికి
India tour of Australia 2024-25: సుదీర్ఘకాలంగా భారత్ జట్టులో ధోనీ నెలకొల్పిన సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆ సంప్రదాయాన్ని విస్మరించి టీమిండియా అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు.
టీమిండియా దశాబ్దాల నుంచి వస్తున్న ఒక పాత సంప్రదాయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో భారత్, ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్ల మధ్య రెండు రోజుల డే/నైట్ వార్మప్ మ్యాచ్ జరిగింది, ఇందులో ఒక రోజు ఆట వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. మిగిలిన ఒక్క రోజు జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పంత్ చేతికి ట్రోఫీ
ఈ వార్మప్ మ్యాచ్ కోసం ట్రోఫీని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉంచింది. దాంతో మ్యాచ్ గెలిచిన అనంతరం ఆ ట్రోఫీని కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి ఇవ్వగా.. దాన్ని రోహిత్ శర్మ తీసుకెళ్లి నేరుగా రిషబ్ పంత్ చేతుల్లో పెట్టాడు. దాంతో ఆశ్చర్యపోవడం టీమిండియా అభిమానుల వంతైంది.
ధోనీ సంప్రదాయానికి తూట్లు
దశాబ్దం క్రితం మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఒక కొత్త సంప్రదాయాన్ని టీమిండియాలో ప్రవేశపెట్టాడు. జట్టు ఏ సిరీస్ లేదా ట్రోఫీ గెలిచినా.. దాన్ని కెప్టెన్ తీసుకొచ్చి జట్టులోకి కొత్తగా వచ్చిన ప్లేయర్ చేతికి తొలుత అందించాలి. ఈ సంప్రదాయాన్ని ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై సడన్‌గా రోహిత్ శర్మ ఆ సంప్రదాయాన్ని విస్మరించి.. రిషబ్ పంత్ చేతికి ఆ ట్రోఫీ ఇచ్చాడు.
మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండర్ షో
మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
ఆ తర్వాత టీమిండియా 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 45 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 27, శుభ్మన్ గిల్ 50 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటవ్వగా, నితీశ్ రెడ్డి 42, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులు చేశారు.