ICC Champions Trophy 2025: భారత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌కే తలూపిన పాకిస్థాన్.. వార్నింగ్‌తో దారికొచ్చిన దాయాది-icc champions trophy 2025 pcb surrenders to bcci accepts hybrid model ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Champions Trophy 2025: భారత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌కే తలూపిన పాకిస్థాన్.. వార్నింగ్‌తో దారికొచ్చిన దాయాది

ICC Champions Trophy 2025: భారత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌కే తలూపిన పాకిస్థాన్.. వార్నింగ్‌తో దారికొచ్చిన దాయాది

Galeti Rajendra HT Telugu

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025పై ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది. భారత్ జట్టుని తమ దేశానికి రప్పించాలని పట్టుబట్టిన పాకిస్థాన్.. చివరికి పట్టువీడక తప్పలేదు.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025

ICC Champions Trophy 2025 Schedule: ఛాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీపై తెగే వరకూ లాగుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అల్టిమేటం జారీ చేయడంతో దారికొచ్చింది. టోర్నీ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం పాక్ వద్ద ఉండగా.. మెగా టోర్నీని పాక్ గడ్డపై నిర్వహించాలని పీసీబీ పట్టుబట్టింది. కానీ.. భద్రతా కారణాలతో పాక్ గడ్డపైకి భారత్ జట్టుని పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పుకోలేదు.

మూడు ఆప్షన్స్

దాంతో బీసీసీఐ రిక్వెస్ట్ మూడు ప్రత్యామ్నాయ మార్గాలను పీసీబీ ముందు ఐసీసీ ఉంచింది.

1. హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీలోని మెజారీ మ్యాచ్‌లను పాకిస్థాన్ గడ్డపై నిర్వహించి.. భారత్ జట్టు ఆడే మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికల్లో నిర్వహించడం.

2. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తాన్ని పాకిస్థాన్ నుంచి తరలించి.. తటస్థ వేదికపై నిర్వహించడం. (శ్రీలంక, యూఏఈ దేశాలు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే.. ఆతిథ్య హక్కులు మాత్రం పాక్ చేతిలోనే ఉంటాయి.)

3. పాక్ గడ్డపైకి వచ్చేందుకు ఇష్టపడని భారత్‌ను టోర్నీ నుంచి తప్పించి.. మిగిలిన జట్లతో పాక్‌లోనే టోర్నీని నిర్వహించడం.

ఐసీసీ అల్టిమేటం జారీ

కానీ.. భారత్ జట్టుని ఎలాగైనా తమ దేశానికి రప్పించాలని కుట్ర చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ మూడింటికీ తొలుత ఒప్పుకోలేదు. దాంతో ఐసీసీ అల్టిమేటం జారీ చేస్తూ.. ఏదో ఒకదాన్ని అంగీకరించాలని లేదంటే టోర్నీ మొత్తాన్ని మరో దేశానికి తరలించేస్తామని తేల్చి చెప్పేసింది. దాంతో పీసీబీ వెనక్కి తగ్గక తప్పలేదు.

బీసీసీఐ మాత్రం హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీని నిర్వహిస్తేనే ఆడతామని.. పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లే అవకాశమే లేదని ఐసీసీ ముందు తేల్చి చెప్పేసింది. బీసీసీఐని ఎదిరించి.. పాక్‌కి మద్దతుగా ఐసీసీ నిలిచే పరిస్థితి లేదు. అలానే భారత్‌ని తప్పించి ఛాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీ నిర్వహిస్తే కోట్ల రూపాయల్ని నష్టపోవాల్సి వస్తుంది. పాకిస్థాన్‌ కూడా రూ.296 కోట్లని నష్టపోవాల్సి వస్తుంది.

ఓవరాల్‌గా ఛాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీ సాఫీగా సాగిపోవాలంటే హైబ్రిడ్ పద్ధతి మినహా ఐసీసీ, పీసీబీ వద్ద మరో ఆప్షన్ లేకుండా పోయింది. దాంతో.. హైబ్రిడ్ పద్ధతికే శనివారం పీసీబీ చీఫ్‌ మోసిన్‌ నఖ్వీ అంగీకరించారు.

భారత్ మ్యాచ్‌లకి దుబాయ్ ఆతిథ్యం

  • పాకిస్థాన్ హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పడంతో.. భారత్ జట్టు ఆడే మ్యాచ్‌లన్నింటికీ దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
  • ఒకవేళ భారత్ జట్టు సెమీ ఫైనల్, ఫైనల్‌కి అర్హత సాధిస్తే.. ఈ రెండూ దుబాయ్‌లోనే జరుగుతాయి
  • ఒకవేళ భారత్ జట్టు సెమీస్‌కి అర్హత సాధించలేకపోతే.. అప్పుడు సెమీస్, ఫైనల్ పాకిస్థాన్‌లో జరుగుతాయి.