IND vs AUS 2nd Test: అడిలైడ్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియాకి గట్టి ఎదురుదెబ్బ.. టీమిండియాకి ఊరట
India vs Australia 2nd Test: పెర్త్ టెస్టులో భారత్ జట్టుని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్. ఎక్స్‌ట్రా బౌన్స్ రాబట్టిన హేజిల్‌వుడ్.. విరాట్ కోహ్లీని సైతం సులువుగా బుట్టలో వేసేశాడు. అయితే.. రెండో టెస్టుకి..?
భారత్‌తో అడిలైడ్ టెస్టు ముంగిట ఆస్ట్రేలియా జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. డిసెంబరు 6 నుంచి డే/నైట్ టెస్టు రూపంలో అడిలైడ్ వేదికగా పింక్ బాల్‌తో రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌కి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు. పెర్త్‌లో విరాట్ కోహ్లీతో పాటు మొత్తం 5 వికెట్లు పడగొట్టిన జోష్ హేజిల్‌వుడ్‌కి గాయమైంది. దాంతో అతని స్థానంలో టీమ్‌లోకి ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్‌ని ఆస్ట్రేలియా తీసుకుంది. అలానే డొగ్గేట్‌ని కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జట్టుతో చేర్చింది.
ఎక్స్‌ట్రా బౌన్స్‌తో వికెట్లు
డే/నైట్ పింక్ బాల్ టెస్టులో హేజిల్‌వుడ్‌కి మంచి రికార్డ్ ఉంది. 2020లో భారత్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన జోష్ హేజిల్‌వుడ్.. ఒంటిచేత్తో ఆస్ట్రేలియా టీమ్‌ను గెలిపించాడు.దాంతో.. అడిలైడ్ టెస్టులో అతనితో ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని మాజీలు హెచ్చరిస్తూ వచ్చారు. జోష్ హేజిల్‌వుడ్ తన ఎత్తుని వినియోగించుకుంటూ.. అదనపు బౌన్స్ రాబట్టడంలో ఎక్స్‌ఫర్ట్. పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీని కూడా ఆ ఎక్స్‌ట్రా బౌన్స్‌తోనే హేజిల్‌వుడ్ పడగొట్టాడు. దాంతో అడిలైడ్ టెస్టుకి హేజిల్‌వుడ్ దూరమవడం.. ఆస్ట్రేలియాకి పెద్ద లోటుగా చెప్పొచ్చు.
10 ఏళ్లలో ఫస్ట్ టైమ్
వాస్తవానికి ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ.. హేజిల్‌వుడ్ మెరుగ్గా ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేస్తుంటాడు. అతను గాయపడటం చాలా అరుదు. 2014లో ఆస్ట్రేలియా టీమ్‌లోకి అరంగేట్రం చేసిన ఈ పేసర్.. స్వదేశంలో గాయం కారణంగా ఒక టెస్టు మ్యాచ్‌కి దూరమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021లో ఆఖరిగా ఈ 33 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ గాయపడ్డాడు.
భారత్‌తో పెర్త్ టెస్టులో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ ఇబ్బంది పడుతున్న వేళ.. జోష్ హేజిల్‌వుడ్ వరుసగా వికెట్లు తీసి భారత్ జట్టుని 150 పరుగులకి ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పరుగుల్ని అడ్డుకట్ట వేయడంలో కూడా హేజిల్‌వుడ్ ఎక్స్‌ఫర్ట్. ఇప్పటి వరకూ హేజిల్‌వుడ్ 71 టెస్టులు ఆడగా.. అతని బౌలింగ్ ఎకానమీ 2.77గానే ఉండటం గమనార్హం.
మిగిలిన ఇద్దరు ఎవరు?
పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లకి జోడీగా మరో ఇద్దరు పేసర్లు ఇప్పుడు అడిలైడ్ టెస్టు కోసం ఆస్ట్రేలియాకి కావాలి. మిచెల్ మార్ష్ కూడా ఫిట్‌గా లేకపోవడంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌ను ఇప్పటికే టీమ్‌లోకి తీసుకున్నారు. అలానే హేజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్ కూడా వచ్చాడు. దాంతో ఈ ఇద్దరినీ ఆడిస్తారా? లేదా మరో ప్రత్యామ్నాయం ఏమైనా చూస్తారా? అనేది చూడాలి.
డిసెంబరు 6న అడిలైడ్ టెస్టు ప్రారంభంకానుండటంతో.. హేజిల్‌వుడ్ గాయాన్ని ఆస్ట్రేలియా టీమ్ వైద్య బృందం పరిశీలిస్తోందట. హేజిల్‌వుడ్‌కి నడుము కింది భాగంలో నొప్పి వచ్చినట్లు చెప్తున్న ఆస్ట్రేలియా.. గాయం తీవ్రత గురించి మాత్రం వెల్లడించట్లేదు. కేవలం రెస్ట్ ఇవ్వాలని వైద్యులు సూచించినట్లు చెప్పుకొస్తోంది. ఒకవేళ సర్జరీ అవసరమైతే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తానికీ హేజిల్‌వుడ్ దూరమయ్యే ప్రమాదం ఉంది.