Pawan Meets CBN: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ..రాజ్యసభ అభ్యర్థిత్వాలపై సర్వత్రా ఆసక్తి, మోపిదేవి స్థానంలో నాగబాబు?
Pawan Meets CBN: ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వాలను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది.
Pawan Meets CBN: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల వ్యవహారంలో పవన్ స్వయంగా సోదాలు చేయడంతో కలకలం రేగిన నేపథ్యంలో తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాకినాడ నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు జరుగుతుండటంపై పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎంతో జరుగుతున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభ అభ్యర్థిత్వాలపై చర్చ...
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ వెలువడనుంది. డిసెంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. గత వారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలోనే రాజ్యసభ అభ్యర్థిత్వాల అంశం తెరపైకి వచ్చింది. జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అభ్యర్థిత్వానికి మద్దతు కోరినట్టు వార్తలు వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించినా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇవ్వాలని పవన్ కోరినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కోరడంతో బీజేపీ కూడా సానుకూలంగా స్పందించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకట రమణకు 2026 జూన్ 21 వరకు పదవీ కాలం ఉండగా 2024 ఆగస్టు 29న రాజీనామా చేశారు. తనకు మరోసారి రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని మోపిదేవి అప్పట్లో స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నట్టు చంద్రబాబుకు కూడా తన అభిమతం వెల్లడించినట్టు మోపిదేవి స్పష్టం చేశారు.
వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలకు 2028 జూన్ 21 వరకు పదవీ కాలం ఉంది. బీద మస్తాన్ రావు మరోసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తారనే హామీతో పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నారు.
మోపిదేవి స్థానంలో నాగబాబు…
మోపిదేవి వెంకట రమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి 2026 జూన్ 21వరకు పదవీ కాలం ఉంది. ప్రస్తుతం ఈ స్థానాన్ని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
మిగిలిన రెండు స్థానాల్లో ఆర్ కృష్ణయ్య స్థానంలో గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జనసేనలో కీలకంగా ఉన్న లింగమనేని రమేష్ పేరు కూడా ప్రచారం జరుగుతోంది. మూడు స్థానాల్లో బీజేపీకి కేటాయిస్తారా , టీడీపీ అభ్యర్థినే ఎంపిక చేస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మాజీ కేంద్రమంత్రి బీజేపీ నేత సురేష్ ప్రభు పేరు కూడా వినిపిస్తోంది.
డిసెంబర్ 3 మంగళవారం నుంచి రాజ్యసభ నామినేషన్లు మొదలవుతాయి. డిసెంబర్ 10తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 13న ఉపసంహరణ జరుగుతుంది. డిసెంబర్ 20వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 24 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీలకు 164మంది సభ్యుల బలం ఉంది. దీంతో మూడు స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కనున్నాయి.