Tasty pachadi: పాతకాలం నాటి కొత్తమీర ఉల్లి పచ్చడి రెసిపీ, దీనికి నూనె స్టవ్ అవసరం లేదు-kothimeera ulli pachadi recipe that doesnt require an oil and stove ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tasty Pachadi: పాతకాలం నాటి కొత్తమీర ఉల్లి పచ్చడి రెసిపీ, దీనికి నూనె స్టవ్ అవసరం లేదు

Tasty pachadi: పాతకాలం నాటి కొత్తమీర ఉల్లి పచ్చడి రెసిపీ, దీనికి నూనె స్టవ్ అవసరం లేదు

Haritha Chappa HT Telugu
Dec 02, 2024 03:30 PM IST

Tasty pachadi: వండాల్సిన అవసరం లేకుండానే పొలం పచ్చడిని చేసేయొచ్చు. పూర్వం దీన్ని అధికంగా తినే వారని చెప్పుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా.

కొత్తిమీర ఉల్లి పచ్చడి రెసిపీ
కొత్తిమీర ఉల్లి పచ్చడి రెసిపీ

ఒకప్పుడు అందరూ పొలం పనులకి వెళ్లేవారు. సులువుగా అయిపోయే ఆహారాలను మూటకట్టుకొని తీసుకెళ్లేవారు. అలా అప్పట్లో ఎక్కువ మంది తిన్న ఆహారంగా పొలం పచ్చడి పేరు తెచ్చుకుంది. దీని చేయడం చాలా సులువు. నూనె, స్టవ్ వంటివి అవసరం లేదు. ఈ పొలం పచ్చడిలో మనం ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడతాము. దీన్ని వండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎలాంటి రోగాలు రాకుండా అడ్డుకోవడం ముందుంటుంది. రోలూ, రోకలి ఉంటే చాలు. చక్కగా పొలం పచ్చడిని చేసుకోవచ్చు. మిక్సీ లేకపోయినా ఫర్వాలేదు.

కొత్తిమీర ఉల్లి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

కొత్తిమీర తరుగు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

జీలకర్ర - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - పది

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు

చింతపండు - నిమ్మకాయ సైజులో

కొత్తిమీర ఉల్లి పచ్చడి రెసిపీ

1. చింతపండును ఒక గిన్నెలో వేసి నీళ్లు వేసి ముందుగానే నానబెట్టుకోవాలి.

2. ఉల్లిపాయను పెద్ద పెద్దగా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

3. పచ్చిమిర్చి మాత్రం సన్నగా తరిగి పక్కన పెట్టాలి.

4. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు రోట్లో జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి.

6. ఆ తర్వాత నానిన చింతపండు గుజ్జును కూడా వేసి మెత్తగా రుబ్బాలి.

7. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా రుబ్బుకోవాలి.

8. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా దంచాలి.

9. తర్వాత కొత్తిమీర తరుగును వేసి దంచుకోవాలి.

10. చివర్లో ఉల్లిపాయలను వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అంతే టేస్టీ పొలం పచ్చడి రెడీ అయినట్టే.

11. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనికి పోపు పెట్టాల్సిన అవసరం లేదు.

అన్నంలో పొలం పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి మీరు కలుపుకొని తిని చూడండి. మీకు దాని రుచి తెలుస్తుంది. అప్పట్లో పొలం పచ్చడిని ఎక్కువగా తినే వారు, పైగా ఇది ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఒకప్పుడు మిక్సీలో వంటివి ఉండేవి కాదు. రోట్లోనే దంచుకునే వాళ్ళు. అందుకే ఇలాంటి రోటి పచ్చళ్ళు అప్పట్లో తినేవారు.

పొలం పచ్చడిలో మన ఆరోగ్యానికి మేలు చేసేవే వాడాము. కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొత్తిమీరను తినడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. జీలకర్రలో ఉన్న గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

Whats_app_banner