Nuvvula Pulihora: నువ్వుల చింతపండు పులిహోర ఒకసారి చేసి చూడండి, మామూలు పులిహోర కన్నా అదిరిపోతుంది-nuvvula pulihora recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nuvvula Pulihora: నువ్వుల చింతపండు పులిహోర ఒకసారి చేసి చూడండి, మామూలు పులిహోర కన్నా అదిరిపోతుంది

Nuvvula Pulihora: నువ్వుల చింతపండు పులిహోర ఒకసారి చేసి చూడండి, మామూలు పులిహోర కన్నా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Aug 19, 2024 11:30 AM IST

Nuvvula Pulihora: తెలుగిళ్లల్లో పులిహోరకు ప్రత్యేక స్థానం ఉంది. తరచూ చేసుకునే వంటకం కూడా. ఎప్పుడూ చూసే పులిహారతో పోలిస్తే నువ్వుల చింతపండు పులిహోర రుచిగా ఉంటుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.

నువ్వుల పులిహోర రెసిపీ
నువ్వుల పులిహోర రెసిపీ

Nuvvula Pulihora: పండగలు వస్తే ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన నైవేద్యం పులిహోర. చింతపండుతో చేసే పులిహోరనే ఎక్కువ మంది వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ మేము నువ్వుల పొడితో చింతపండు పులిహోర ఎలా చేయాలో చెప్పాము. సాధారణంగా చేసే పులిహారతో పోలిస్తే ఈ నువ్వులపొడి పులిహోర అదిరిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. అన్నట్టు దీన్ని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. నువ్వుల చింతపండు పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందాం.

నువ్వుల చింతపండు పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు

వండిన అన్నం - రెండు కప్పులు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నువ్వుల నూనె - రెండు స్పూన్లు

చింతపండు - నిమ్మకాయ సైజులో

బెల్లం తురుము - పావు స్పూను

పచ్చిమిర్చి - మూడు

నువ్వులు - మూడు స్పూన్లు

ఎండుమిర్చి - పది

వేరుశెనగ పలుకులు - గుప్పెడు

శెనగపప్పు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

నువ్వుల చింతపండు పులిహోర రెసిపీ

1. సాధారణ పులిహోరలో చేసినట్టే ముందుగానే అన్నాన్ని వండి పెట్టుకోవాలి.

2. ఆ వండిన అన్నాన్ని పెద్ద ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఇలా విడివిడిగా అన్నాన్ని పరచడం వల్ల అన్నం ముద్ద కాకుండా ఉంటుంది.

3. ఆ అన్నంలో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, పసుపు, ఉప్పు, కరివేపాకులు వేసి కలుపుకోండి.

4. ఆ అన్నం మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నువ్వులు, ఎండుమిర్చి వేసి వేయించండి.

6. ఆ రెండింటినీ కలిపి మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి ఒక స్పూన్ నువ్వుల నూనె వేయండి.

8. ఆ నూనెలో ఆవాలు వేసి చిటపటలాడించండి.

9. అలాగే మినప్పప్పు, శనగపప్పు, వేరుశెనగ పలుకులు, ఎండుమిర్చి వేసి వేయించండి.

10. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి అందులో కొంచెం నూనె వేయండి.

11. పచ్చిమిర్చిని వేసి వేయించండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసి అది దగ్గరగా మరిగే వరకు ఉడికించండి.

12. అందులోనే చిటికెడు బెల్లం తురుము వేసి కలుపుకోండి.

13. ఈ చింతపండు గుజ్జులోనే ముందు వేయించి పెట్టుకున్న వేరుశెనగ పలుకులు, మినప్పప్పు, శనగపప్పుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసేయండి.

14. ఈ మొత్తం మిశ్రమాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేయండి.

15. అలాగే నువ్వుల పొడిని వేసి అన్నాన్ని పొడి పొడిగా వచ్చేలా కలుపుకోండి. అంతే టేస్టీ నువ్వుల చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టే.

నువ్వుల పులిహోర వండిన వెంటనే తింటే రుచి రాదు. ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేయండి. అన్ని పదార్థాలు అన్నంలో బాగా కలిసి మంచి రుచిని అందిస్తాయి. ఆ తర్వాత వడ్డించుకుని తినండి.. మీకు ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

చింతపండును ముందుగానే గుజ్జుగా చేసుకొని మరిగించి పెట్టుకుంటే ఈ పులిహోర త్వరగా అయిపోతుంది. ఈ పులిహారలో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ పులిహోర తిని బోర్ కొట్టిన వారు ఈ నువ్వుల చింతపండు పులిహోర చేసుకుని చూడండి. ఇది మీకు నచ్చడం ఖాయం. పండుగల సమయంలో నైవేద్యాలుగా దీన్ని పెట్టవచ్చు. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు మహిళలు కచ్చితంగా తినాల్సిన వాటిలో నువ్వులు ఒకటి. ముఖ్యంగా ఆడపిల్లలు నువ్వులు తినడం వల్ల నెలసరి సమస్యలను తట్టుకోవచ్చు. వారంలో ఒకసారైనా ఈ నువ్వుల చింతపండు పులిహోర చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి.

Whats_app_banner