Shocking Electricity Bills: ఏపీలో పెరిగిన విద్యుత్‌ బిల్లులు, కొత్త సర్దుపోటు మొదలు, విద్యుత్ పోరాటాలకు సీపీఎం పిలుపు..-ap consumers hit hard by increased electricity bills and new surcharge ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Shocking Electricity Bills: ఏపీలో పెరిగిన విద్యుత్‌ బిల్లులు, కొత్త సర్దుపోటు మొదలు, విద్యుత్ పోరాటాలకు సీపీఎం పిలుపు..

Shocking Electricity Bills: ఏపీలో పెరిగిన విద్యుత్‌ బిల్లులు, కొత్త సర్దుపోటు మొదలు, విద్యుత్ పోరాటాలకు సీపీఎం పిలుపు..

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 02, 2024 04:57 PM IST

Shocking Electricity Bills: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ వినియోగదారులపై కొత్త సర్దుబాటు భారం మొదలైంది. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి అమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.6వేల కోట్ల సర్దుబాటు ఛార్జీల వసూలు మొదలైంది. వచ్చే నెలలో మరో సర్దుబాటు భారం మొదలు కానుంది. పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం పిలుపునిచ్చింది.

విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలపై పోరాటాలకు సిద్ధమవుతున్న సీపీఎం
విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలపై పోరాటాలకు సిద్ధమవుతున్న సీపీఎం

Shocking Electricity Bills: ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌ నెల విద్యుత్‌ బిల్లులతో కొత్త సర్దుబాటు భారం మొదలైంది. ఏపీ ఈర్సీ ఆమోదంతో రూ. 6072 కోట్ల వసూళ్లను విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రారంభించాయి. కొత్త సర్‌ఛార్జీలతో విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఏపీలో మూడు రకాల సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నారు. వచ్చే నెల నుండి మరో సర్దుపోటు పడనుంది. మొత్తం 15,484 కోట్ల రూపాయల విద్యుత్ భారం రాష్ట్ర ప్రజలపై పడనుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల తిరగకముందే 15,484 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై పడనుంది. 2022 -23 సంవత్సరాల్లో వినియోగించుకున్న విద్యుత్ పై 6072 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జీల వసూలు మొదలైంది. నెల నుండి 2023 -24 సర్దుబాటు చార్జీ 9412 కోట్ల రూపాయల భారం పడనుంది.

2014-19 ట్రూ అప్ చార్జీలుగా గత నెల బిల్లులపై 40 పైసలు సర్దుబాటు చార్జీ వసూలు చేస్తున్నారు. తాజాగా మూడవ సర్దుబాటు చార్జీ బిల్లులో వేశారు, వచ్చేనెల 4వ సర్దుబాటు చార్జీ కలపటానికి రంగం సిద్ధం అయ్యింది. సర్దుబాటు ఛార్జీలతో ఈ నెల బిల్లులలో 10 శాతం నుండి 30 శాతం వరకు బిల్లులు పెరిగాయి. విద్యుత్‌ బిల్లుల్లో సర్దుబాటు ఛార్జీల భారంపై పోరాటాలకు సీపీఎం సిద్ధం అవుతోంది.

విజయవాడలోని పలు ప్రాంతాల్లో సీపీఎం నేతలు పర్యటించి విద్యుత్‌ బిల్లులను పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్‌లోని లింగం వెంకటలక్ష్మి కి మొత్తం రూ.958 బిల్లు రాగా, అందులో రూ.282 30%)2022-23 సర్దుబాటు చార్జీగా పేర్కొన్నారు. బిల్లులో వినియోగించిన విద్యుత్ ఛార్జీలు 30 శాతం ఉంటే సర్దుబాటు చార్జీలు, అదనపు చార్జీలు 70 శాతం ఉంటున్నాయి.

ఈ సర్దుబాటు చార్జీల పాపం పాలక పార్టీలన్నింటిదని, కేంద్రంలోని బీజేపీ, గతంలో పాలించిన వైసిపి, నేడు పాలిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు వీటికి బాధ్యత వహించాలని సీపీఎం డిమాండ్ చేసింది. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచమని, తగ్గిస్తామని మాట ఇచ్చిన కూటమి మాట తప్పి ప్రజలను వంచించిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేయాల్సిన బాధ్యత కూటమిపై ఉండగా ,భారం మోపి చేతులు దులుపుకోవడం సరికాదని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ధరలు యూనిట్ 12 రూపాయల నుండి క్రమంగా రెండు రుపాయలకు తగ్గాయని చెబుతూనే, ఛార్జీలు మాత్రం తగ్గించకుండా పెంచడం అన్యాయమంటున్నారు. అదానీ వద్ద నుండి వందలాది కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని, ప్రజలపై భారాల మోపే ఒప్పందాలను బిజెపి, వైసిపి పార్టీలు చేశాయని, ఆ ఒప్పందాలను రద్దు చేయకుండా తెలుగుదేశం, జనసేన వారితో కుమ్మక్కు అవుతున్నాయని సీపీఎం నాయకుడు చిగురుపాటి బాబురావు ఆరోపించారు.

విద్యుత్ ఛార్జీల భారంలో బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం, జనసేనలు ఉన్నాయని బడా కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలు వలనే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని ఆరోపించారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై ప్రజలు గళం విప్పాలి. కేంద్ర, రాష్ట్ర పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ పాపాన్ని గమనించాలని, మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల భారాన్ని నిలిపివేయాలని, అదానీ, జగన్, కేంద్ర ప్రభుత్వ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. మాట ఇచ్చినట్లు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, స్మార్ట్ మీటర్లను ఆపాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner