Signs of Vitamin C deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ సి లోపమే..-know the signs of vitamin c deficiency in our body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Signs Of Vitamin C Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ సి లోపమే..

Signs of Vitamin C deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ సి లోపమే..

HT Telugu Desk HT Telugu
Sep 04, 2023 07:55 PM IST

Signs of Vitamin C deficiency : శరీరంలో విటమిన్ సి లోపిస్తే కొన్ని లక్షణాల ద్వారా శరీరం మనకు ఆ సూచననిస్తుంది. ఆ లక్షణాలేంటో తెలుసుకోండి.

విటమిన్ సి లోపం
విటమిన్ సి లోపం (pexels)

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్‌ సి పాత్ర కీలకమైనది. ఇది రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. శ్వాసకోస సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. చర్మంపై ముడతలు లేకుండా చేసి కాంతివంతంగా ఉంచుతుంది. యవ్వనంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. శరీరంలోని కణ జాలాన్ని వృద్ధి చేయడంలో సహకరిస్తుంది. నష్టపోయిన కణాలకు సమానంగా కొత్త కణాలు వచ్చేలా చూస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే విటమిన్‌ సి అనేది మన శరీరానికి అతి ముఖ్యమైన విటమిన్‌ అని చెబుతారు. అయితే సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల కొన్ని సార్లు మనలో దీని లోపం తలెత్తుతుంది. శరీరం కొన్ని సూచనల ద్వారా ఆ విషయాన్ని మనకు చెబుతుంది. వాటిని గుర్తించడం ద్వారా మన శరీరంలో సి విటమిన్‌ లోపం ఉందని ఎలాంటి పరీక్షలూ లేకుండానే గుర్తించగలుగుతాం.

గుంటలు పడిన గోళ్లు :

సాధారణంగా మన గోళ్లు కాస్త ఉబ్బెత్తుగా ఉంటాయి. విటమిన్‌ సీ లోపం ఉన్న వారిలో గోళ్ల మధ్యలో గుంటలు పడినట్లై, పెళుసుబారినట్లుగా తయారవుతాయి. చూడ్డానికి అవి స్పూన్‌ మాదిరిగా అనిపిస్తాయి. కొందరిలో పలుచగా అయిపోయి తేలికగా విరిగిపోతుంటాయి. మరి కొందరికి గోరు లోపలి నుంచి ఎర్రటి మచ్చలు కనిపిస్తుంటాయి.

పాడైన చర్మం :

శరీరానికి తగినంత విటమిన్ సీ అందితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొలాజిన్‌ ఉత్పత్తిని ఇది ప్రోత్సహిస్తుంది. ఒకవేళ సీ విటమిన్‌ తక్కువైతే చర్మంలో నిగారింపు తగ్గిపోతుంది. చర్మం దెబ్బతిని రఫ్‌గా మారినట్లు అవుతుంది. ముడతలు పడినట్లు అవుతుంది. పొడిబారుతుంది.

ఊరికే రక్తస్రావం :

చర్మంపై ఏది తగిలినా ఊరికే గాయాలు అవుతాయి. రక్త స్రావం అవుతుంది. గాయాలు తొందరగా తగ్గవు. చర్మం కింద భాగంలో ఉండే రక్త నాళాల నుంచి ఏ కొంచెం ఒత్తిడి కలిగినా రక్తం బయటకి వస్తుంది. చర్మం అడుగున ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. అందువల్ల చర్మంపై అక్కడక్కడ ముదురు ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తాయి.

కీళ్ల వాపులు :

కీళ్ల దగ్గర వాపులు వస్తాయి. వీటి దగ్గర ఉండే కణజాలాలకు కొలాజిన్‌ అవసరం. సీ విటమిన్‌ లోపం వల్ల శరీరంలో కొలాజిన్‌ సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. అందువల్ల కీళ్ల దగ్గర వాపులు, నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

చిగుళ్ల వాపులు :

విటమిన్‌ సి శరీరంలో తక్కువైతే చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. చిగుళ్లలో వాపులు, రక్తస్రావం కనిపిస్తాయి. పళ్లు బలహీనంగా మారి కదిలిపోతాయి.

ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తుంటే దాన్ని మీరు సీ విటమిన్‌ లోపం అని గుర్తించాలి. జామపళ్లు, నిమ్మ, నారింజ, కమల, స్రాబెరీ, బొప్పాయి, కివి, చెర్రీలు వంటి వాటిని తినడం ద్వారా ఈ లోపం నుంచి బయట పడొచ్చు.

Whats_app_banner