Healthy Oil: ఈ నూనెలను పచ్చిగా తింటేనే గుండెకు మంచిది, అవేంటో తెలుసుకోండి-know that these oils are good for the heart when eaten raw here are the healthy oils ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Oil: ఈ నూనెలను పచ్చిగా తింటేనే గుండెకు మంచిది, అవేంటో తెలుసుకోండి

Healthy Oil: ఈ నూనెలను పచ్చిగా తింటేనే గుండెకు మంచిది, అవేంటో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Oct 07, 2024 10:30 AM IST

Healthy Oil: కొన్ని రకాల నూనెలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఏ నూనె అయినా మితంగా తీసుకుంటేనే మంచిది. కొన్ని నూనెలను పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పచ్చిగా తినాల్సిన నూనెలు
పచ్చిగా తినాల్సిన నూనెలు (Pixabay)

Healthy Oil: నూనెలను కూరలు వండుకోవడానికే వినియోగిస్తాం. నిజానికి వండిన నూనె కన్నా కొన్ని రకాల నూనెలను పచ్చిగా తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేడివేడి అన్నంలో ఒక స్పూను నూనె వేసుకుని కలుపుకొని తిన్నా మంచిదే. అయితే అన్ని రకాల నూనెలను ఇలా తినకూడదు. కొన్ని రకాల నూనెలను వేడి చేస్తే వాటిలోని పోషకాలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి వాటిని పచ్చిగానే తీసుకోవాలి. ఇలా పచ్చిగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చే నూనెలను ఇక్కడ ఇచ్చాము. వీలైనంతవరకు వీటిని అప్పుడప్పుడు పచ్చిగా తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి.

ఆవనూనె

ఆవనూనెను అధికంగా ఆవకాయని పెట్టడానికి వినియోగిస్తారు. లేదా సలాడ్‌లపై చల్లుకుంటారు. మన దేశంలో ఎన్నో ప్రాంతాల వారు దీన్ని వంటనూనెగా ఉపయోగిస్తారు. ఒడిశాలో ఎక్కువగా ఆవనూనె వినియోగిస్తారు. నిజానికి ఆవనూనెలో వేడి చేసి కూర ఉండే బదులు దాన్ని అన్నం పై నేరుగా వేసుకొని తినడం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పోషకాలకు కేంద్రమని చెప్పవచ్చు. ఈ ఆవనూనెలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కూడా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఈ నూనెలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఆవ నూనెను పచ్చిగా తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఏదైనా మితంగానే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.

కొబ్బరి నూనె

తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను తలకు అప్లై చేయడానికి వినియోగిస్తారు. నిజానికి కొబ్బరినూనె ఆరోగ్యకరమైనది. కేరళలో పూర్తిగా కొబ్బరినూనె వంటలకు వినియోగిస్తారు. ఈ కొబ్బరి నూనెను పచ్చిగా తిన్నా కూడా మంచిదే. దీనిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇతర నూనెలతో పోలిస్తే ఇది వేడిని బాగా తట్టుకుంటుంది. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వులు, జీవ క్రియకు, మెదడు పనితీరుకు ఎంతో ముఖ్యం. శక్తిని కూడా అందిస్తాయి. కొబ్బరి నూనె రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాయామానికి ముందు ఆహారంలో కొబ్బరి నూనెను భాగం చేసుకుని తింటే ఇది శక్తి స్థాయిలను అందిస్తుంది. కొబ్బరి నూనెతో కాఫీని కూడా తయారు చేసుకుంటారు. అలాగే హెర్బల్ టీలకు కూడా ఈ కొబ్బరినూనె జోడించవచ్చు. కొబ్బరి నూనెను ఇలా పచ్చిగా హెర్బల్ టీ వేసుకొని లేదా సలాడ్లపై చల్లుకొని, వీలైతే రెండు ముద్దలు అన్నంలో కలుపుకుని తింటే ఎంతో మంచిది.

వేరుశెనగ నూనె

మన భారతదేశంలో వాడే ప్రసిద్ధ నూనెల్లో వేరుశనగ నూనె కూడా ఒకటి. దీనిలో మోనో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. గుండెకు ఇది ఎంతో మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. శరీరాన్ని ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి రక్షిస్తుంది. వేరుశనగ నూనెలో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి, చర్మ కణాల పునరుత్పత్తికి ఎంతో అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా వేరుశెనగ నూనె ఉపయోగపడుతుంది. వేరుశనగ నూనెను అధిక మంట వద్ద వేడి చేసి ఉండడం వల్ల ప్రయోజనాలు తగ్గిపోతాయి. వాటిలోని ప్రయోజనకరమైన సమ్మేళనాలు విచ్ఛిన్నం అయిపోతాయి. అనారోగ్యమైన ట్రాన్స్ ఫ్యాట్స్ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి వేరుశెనగ నూనెలోని పోషకాలు సమృద్ధిగా అందాలంటే వీలైనంత వరకు దీన్ని పచ్చిగా అప్పుడప్పుడు తినేందుకు ప్రయత్నించండి. ఒక స్పూను నూనె పచ్చళ్ల పైన చల్లుకోవడం లేదా అన్నం ముద్దల్లో ఒక స్పూన్ వేరుశెనగ నూనె వేసుకొని కలుపుకొని తినడం వంటివి చేయండి.

నువ్వుల నూనె

ఆయుర్వేద వైద్యంలో నువ్వుల నూనె మంచిదని చెబుతారు. ఇది శరీరంలోని అంతర్గత శక్తులను సమతల్యం చేస్తుందని వివరిస్తారు. నువ్వుల నూనెలో జీర్ణక్రియకు ఉపయోగపడే సుగుణాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటివి దీనిలో సమృద్ధిగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా నువ్వుల నూనె ఎంతో మంచిది. అంతే కాదు నువ్వుల నూనెను వేడి చేస్తే పోషకాలు నశించే అవకాశం ఉంది. కాబట్టి సలాడ్లపై చల్లుకొని లేదా కొబ్బరి పచ్చడి, వేరుశెనగ పచ్చడి వంటివి చేసుకున్నప్పుడు వాటి పైన ఈ నువ్వుల నూనె వేసుకొని తినడానికి ప్రయత్నించండి. లేదా అన్నం వండాక అన్నం పైన నువ్వుల నూనె వేయండి. ఇలా తినడం వల్ల నువ్వుల నూనె సకల పోషకాలు శరీరంలో చేరుతాయి.

ఆలివ్ నూనె

పచ్చి ఆలివ్ నూనెను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో మోనోస్యాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన లక్షణాలు కూడా ఉంటాయి. రోజూ ఒక స్పూన్ ఆలివ నూనెను సలాడ్ మీద లేదా అన్నం పైన వేసుకొని తినేందుకు ప్రయత్నించండి. ఇది గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

Whats_app_banner