Gongura Pachadi: స్పైసీ గోంగూర నువ్వుల పచ్చడి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది-gongura nuvvula pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Pachadi: స్పైసీ గోంగూర నువ్వుల పచ్చడి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది

Gongura Pachadi: స్పైసీ గోంగూర నువ్వుల పచ్చడి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Sep 10, 2024 11:30 AM IST

Gongura Pachadi: పుల్లని గోంగూర పచ్చడి అంటే మీకు ఇష్టమా? ఒకసారి గోంగూర నువ్వులు కాంబినేషన్లో పచ్చడిని ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి చేసుకుంటే వారం రోజులు పాటు నిల్వ ఉంటుంది.

గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ
గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ

Gongura Pachadi: గోంగూర పచ్చడి పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. గోంగూర పచ్చడిలో కొన్ని నువ్వులు కూడా వేసి పచ్చడి చేసి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. ఈ పుల్లని వంటకం రుచిగా అనిపిస్తుంది. వేడి అన్నంలో రెండు స్పూన్ల గోంగూర నువ్వులు పచ్చడి, ఒక స్పూను నెయ్యి వేసుకుంటే ఆ రుచి మామూలుగా ఉండదు. భోజనంలో పచ్చడి, పప్పు, కూర, పెరుగు అన్నీ ఉంటేనే సంపూర్ణ భోజనం. ఇలా గోంగూర నవ్వుల పచ్చడిని చేసుకుంటే వారం రోజులు పాటు నిల్వ ఉంటుంది.

గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

గోంగూర - నాలుగు కట్టలు

నువ్వులు - పావు కప్పు

పసుపు - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఎండుమిర్చి - రెండు

జీలకర్ర - అర స్పూను

ఆవాలు - అర స్పూను

మినుములు - ఒక స్పూను

శనగపప్పు - ఒక స్పూను

నూనె - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

వెల్లుల్లి - ఐదు రెబ్బలు

పచ్చిమిర్చి - పది

గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ

1. గోంగూర పచ్చడి చేయడానికి మొదటగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. అదే కళాయిలో ఒక స్పూను నూనె వేసి పచ్చిమిర్చిని వేసి వేయించాలి. వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.

4. అదే కళాయిలో మరొక స్పూన్ నూనె వేసి గోంగూరను వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

5. నీళ్లు వేయకుండానే అది మెత్తగా ఉడికిస్తుంది.

6. తర్వాత వెల్లుల్లి కూడా వేసి ఉడికించాలి.

7. ఇప్పుడు మిక్సీ జార్లో గోంగూర ఆకులు, నువ్వులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు అవేసి మెత్తగా రుబ్బుకోవాలి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.

9. ఇప్పుడు దీన్ని తాళింపు పెట్టేందుకు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.

10. పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకులు, పసుపు వేసి వేయించుకొని.

11. ఆ మొత్తం మిశ్రమాన్ని గిన్నెలోని గోంగూర మిశ్రమంపై వేయాలి. అంతే టేస్టీ గోంగూర నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది.

ఈ గోంగూర నువ్వుల పచ్చడిని ఒకసారి చేసుకుంటే వారం నుంచి రెండు వారాలు పాటు తాజాగా ఉంటుంది. నూనె కాస్త ఎక్కువగా వేసుకుంటే నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. భోజనం తినేముందు రెండు ముద్దలు ఈ పచ్చడితో తినండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో నువ్వులను మరి కొంచెం ఎక్కువ వేసుకుంటే మహిళలు ఈ పచ్చడి తినడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారు. నువ్వులు వారి నెలసరి సమస్యలను తగ్గిస్తాయి. గోంగూరలో కూడా రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ పచ్చడి ఆరోగ్యానికి పూర్తిగా మేలు చేసేదే.

టాపిక్