Green Chilli: పచ్చిమిర్చిని కారం కోసమే వాడతామని పక్కన పడేయకండి.. లాభాలు తెలిస్తే మతిపోతుంది-know different benefits of green chilli for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Chilli: పచ్చిమిర్చిని కారం కోసమే వాడతామని పక్కన పడేయకండి.. లాభాలు తెలిస్తే మతిపోతుంది

Green Chilli: పచ్చిమిర్చిని కారం కోసమే వాడతామని పక్కన పడేయకండి.. లాభాలు తెలిస్తే మతిపోతుంది

Koutik Pranaya Sree HT Telugu
Jul 04, 2024 09:30 AM IST

Green Chilli: పచ్చిమిర్చి కూరకు కారం కోసమే కాదు. దాంట్లో పోషకాలు బోలెడుంటాయి. వాటిని మితంగా వాడితే లాభాలు, ఎక్కువగా వాడితే వచ్చే నష్టాలు ఏంటో వివరంగా తెల్సుకోండి.

పచ్చిమిర్చి లాభాలు
పచ్చిమిర్చి లాభాలు (freepik)

పచ్చిమిర్చిలో పోషకాలేం ఉంటాయి అనుకోకండి. మనం ఊహించని చాలా లాభాలున్నాయి. దాదాపు అన్ని వంటల్లో పచ్చిమిర్చిని విరవిగా వాడతాం. ఫ్రిజ్ లో ఏమున్నా లేకపోయినా కొన్న పచ్చిమిర్చి మాత్రం ఉండి తీరాల్సిందే. పచ్చిమిర్చిని ఆంగ్లంతో గ్రీన్ చిల్లీ అని ఎక్కువగా అంటాం. కానీ విదేశీయులు వీటిని చిల్లి పెప్పర్ అంటారు. ఇదే జాతికి చెందిని క్యాప్సికంను బెల్ పెప్పర్ అంటారు.

అయితే వంటలు కారంగా చేయడంతోనే పచ్చిమిర్చి పని అయిపోలేదు. బోలెడు ఇతర ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సంవత్సరం మొత్తం కొదవ లేకుండా దొరికే పచ్చిమిర్చి లాభాలేంటో చూసేయండి.

పచ్చిమిర్చి ఆరోగ్య ప్రయోజనాలు:

1. డయాబెటిస్ తగ్గిస్తుంది:

పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో గ్లుకోజ్ స్థాయుల్ని నియంత్రిస్తుంది.

2. రక్తహీనత తగ్గించడంలో:

మన శరీరంలో ఐరన్, హెమోగ్లోబిన్ స్థాయులు తక్కువగా ఉంటే అనీమియా లేదా రక్త హీనత అంటాం. పచ్చిమిర్చిలో సహజంగానే ఐరన్ ఉంటుంది. దాంతో పాటే వీటిలో ఉండే విటమిన్ సి శరీరం ఐరన్ శోషించుకునేలా సాయపడుతుంది.

3. చర్మ సౌందర్యానికి:

వీటిలో విటమిన్ సి, ఈ ఉంటాయి. విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఈ వయసుతో పాటూ చర్మం మీద వచ్చే సంకేతాలను తగ్గిస్తుంది. చర్మానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో పచ్చిమిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సాయపడతాయి. వీటికున్న మైక్రోబయల్ లక్షణాలు యాక్నె, చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.

4. బరువు తగ్గించడంలో:

పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. వేగంగా జరిగే జీర్ణక్రియ వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గి బరువు తగ్గడంలో సాయపడుతుంది. దీంట్లో కేలరీలు తక్కువ.

5. కడుపులో అల్సర్లు:

కడుపులో యాసిడ్లు ఎక్కువగా విడుదలవ్వడం వల్ల అల్సర్లు వస్తాయి. పచ్చిమిర్చి వాటి విడుదలను తగ్గిస్తుంది. దాంతో కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదాల్ని కొంతమేర తగ్గిస్తుంది.

6. జలుబు తగ్గించడంలో:

జలుబు చేసినప్పుడు కారంగా తింటే కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది కదా. దానికి కారణం ఉంది. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలో వేడి పుట్టిస్తుంది. ముక్కలో శ్లేష్మం పొరలను ప్రేరేపిస్తుంది. దాంతో శ్లేష్మం ముక్కుకు అడ్డుపడకుండా పలుచగా మారి బయటకి వస్తుంది. దాంతో శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. జలుబు, దగ్గు లక్షణాలు తగ్గిపోతాయి.

7. మూడ్ మార్చేస్తుంది:

పచ్చిమిర్చి తిన్న తర్వాత ఎండార్ఫిన్లు ఉత్పత్తి అవుతాయి. మన శరీరం ఏదైనా బాధకు, నొప్పికి గురైనప్పుడు వాటిని తగ్గించడానికి ఎండార్ఫిన్లు విడుదల చేస్తుంది. కాబట్టి పచ్చిమిర్చి కూడా అలాగే పనిచేస్తుంది. ఇవి తింటే ఒత్తిడి తగ్గుతుంది. సానుకూలతను పెంచుతుంది. ఆనందాన్ని పెంచుతుంది.

అయితే ఇన్ని లాభాలున్నాయని పచ్చిమిర్చితో కూరను వండుకుని రోజూ తినేరు. అలా ఎక్కువగా తిన్నా అల్సర్లు వస్తాయి. అలాగే పచ్చిమిర్చిని ముట్టుకున్నా, కంట్లో పెట్టుకున్నా వచ్చే మంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.

 

టాపిక్