Dal Reuse: ఇంట్లో పప్పు మిగిలిపోయిందా? పడేయకుండా ఇలా పరాటా, పకోడీలుగా వండేయండి-leftover dal at home make dal parota dal pakoda with leftover dal learn how to make ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dal Reuse: ఇంట్లో పప్పు మిగిలిపోయిందా? పడేయకుండా ఇలా పరాటా, పకోడీలుగా వండేయండి

Dal Reuse: ఇంట్లో పప్పు మిగిలిపోయిందా? పడేయకుండా ఇలా పరాటా, పకోడీలుగా వండేయండి

Haritha Chappa HT Telugu
Aug 13, 2024 04:30 PM IST

Dal Reuse: ప్రతి ఇంట్లో పప్పు మిగిలిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. పప్పు మిగిలిపోయినప్పుడు దాన్ని పడేయడమో, ఎవరికో ఇచ్చేయడమో చేయకుండా దాన్ని కొత్త వంటకంగా మార్చండి. ఇక్కడ మేము కొన్ని రెసిపీ ఐడియాలను ఇచ్చాము.

మిగిలిపోయిన పప్పుతో రకరకాల వంటలు చేసేయండి
మిగిలిపోయిన పప్పుతో రకరకాల వంటలు చేసేయండి

Dal Reuse: భారతీయ భోజనంలో అన్నంతో పాటు పప్పు కూడా ఉండాల్సిందే. ఒక్కొక్కసారి అన్నం పప్పు మిగిలిపోతూ ఉంటాయి.చాలామంది పప్పును పడేయడమో లేక ఆ పప్పును ఎవరికైనా ఇచ్చేయడమో చేస్తూ ఉంటారు. అలా పప్పును వృధా చేయాల్సిన అవసరం లేదు. దానితో కొత్త వంటకాన్ని సృష్టించి తినవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము మిగిలిపోయిన పప్పుతో ఎలాంటి వంటకాలను తిరిగి వండుకోవచ్చో ఇచ్చాము. మీకు నచ్చిన వంటకాన్ని చేసుకొని చూడండి.

దాల్ పరాటా

పప్పు మిగిలిపోయినప్పుడు దాన్ని పరాటాలో స్టఫ్ చేసేందుకు వాడండి. దీనికోసం ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొన్ని మసాలా దినుసులు తీసుకోండి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని, మసాలా దినుసులను కళాయిలో నూనె వేసి బాగా వేయించండి. అందులోనే మిగిలిన పప్పును కూడా వేయండి. ఈ పప్పును గట్టిగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పరాటాలో ఈ పప్పు ముద్దను పెట్టి పరోటాలా ఒత్తుకొని రెండు వైపులా కాల్చుకొని తినండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. పైన కాస్త నెయ్యిని దట్టించి తింటే రుచి అదిరిపోతుంది.

పప్పు పకోడీలు

మిగిలిపోయిన పప్పుతో పకోడీలు వండుకోవచ్చు. పప్పులో శనగపిండి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేయండి. చిటికెడు వంట సోడా కూడా వేసి ఆ మిశ్రమాన్ని గట్టిగా పకోడీ పిండిలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి నూనె వేయండి. ఆ నూనెలో ఈ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోండి. అంటే టేస్టీ క్రిస్పీ పకోడీలు రెడీ అయిపోతాయి. ఒక్కసారి తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

దాల్ సూప్

మిగిలిపోయిన పప్పుతో పోషకాహారమైన సూప్‌ను తయారు చేసుకోండి. పప్పులో కాస్త నీరు చేర్చి ఆ గిన్నెను స్టవ్ మీద కాసేపు ఉడికించండి. అది ఉడుకుతున్నప్పుడే కొన్ని క్యారెట్ ముక్కలను కూడా వేయండి. ఉడికించిన బంగాళదుంపలను కూడా వేసి ఆ సూప్ ను పావుగంటసేపు మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని సూప్‌లా తాగేయండి. ఇది ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. పొట్ట త్వరగా నిండేలా చేస్తుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

పప్పుతో అట్లు

మిగిలిపోయిన పప్పును అట్లులా కూడా మార్చుకోవచ్చు. ఒక గిన్నెలో మిగిలిపోయిన పప్పును వేసి అందులో శెనగపిండిని కలపండి. అలాగే సన్నగా తరిగిన టమోటోలు, ఉల్లిపాయ తరుగు కూడా వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఈ మిశ్రమాన్ని అట్లులాగా పోసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.

పప్పును ఇలా నిల్వ చేయండి

పైన చెప్పిన రెసిపీలు చేసుకుని తినడం మీకు నచ్చకపోతే, ఆ పప్పుని మరుసటి రోజుకు తాజాగా ఉండేలా నిల్వ చేయండి. ఇందుకోసం మిగిలిపోయిన పప్పును ఎప్పుడూ కూడా గాలి తగిలేలా ఉంచకూడదు. గాలి చొరబడని కంటైనర్లలో వేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. మూడు నాలుగు రోజులపాటు పప్పు తాజాగా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టిన పప్పు గట్టిపడే అవకాశం ఉంది. కాబట్టి తినడానికి రెండు మూడు గంటల ముందే తీసి బయట పెట్టుకోండి. లేదా తినే ముందు తిరిగి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి కాస్త నీరు చేర్చి ఉడికించుకుంటే గట్టిదనం పోయి పప్పు మృదువుగా మారుతుంది. పప్పును వండేటప్పుడు చిటికెడు గరం మసాలా లేదా కొన్ని మసాలా దినుసులు కూడా కలిపి చేస్తే మంచిది. ఇది పప్పుకు కొత్త రుచిని అందిస్తుంది.

పప్పును ఎక్కువగా కందిపప్పుతోనే వండుకుంటారు. కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి డయాబెటిస్ రోగులు... రోజూ కందిపప్పు తింటే ఎంతో మంచిది. దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే కందిపప్పులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, బి కాంప్లెక్స్ వంటివి మన శరీరానికి అత్యవసరమైనవి. అందుకే ప్రతిరోజూ తినాల్సిన ఆహారాల జాబితాలో కందిపప్పు కచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజూ కందిపప్పుతో అన్నం తిని, ఒక కోడి గుడ్డును తింటే చాలు పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. ఒకసారి పప్పు మిగిలిపోయినప్పుడు పైన చెప్పిన ఏదైనా ఒక రెసిపీని ప్రయత్నించి చూడండి.