Alu pakodi: కుర్‌కురే ఆలూ పకోడీ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసేయండి.. ఉపవాసం రోజూ తినేయొచ్చు-know how to make alu pakodi with green chutney as fasting snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alu Pakodi: కుర్‌కురే ఆలూ పకోడీ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసేయండి.. ఉపవాసం రోజూ తినేయొచ్చు

Alu pakodi: కుర్‌కురే ఆలూ పకోడీ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసేయండి.. ఉపవాసం రోజూ తినేయొచ్చు

Alu pakodi: ఉపవాసం రోజున కూడా తినగలిగే ఆలూ పకోడీ తయారీ ఎలాగో వివరంగా చూసేయండి. సులభమైన రెసిపీని నోట్ చేసుకోండి.

ఆలూ పకోడీ (shutterstock)

తొందర్లో శ్రావణ మాసం రాబోతోంది.శివ భక్తులు ఖచ్చితంగా శ్రావణ సోమవారం ఉపవాసం పాటిస్తారు. శివలింగానికి నీటిని అభిషేకిస్తారు. చాలా ఇళ్లలో కుటుంబం మొత్తం ఉపవాసం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సులభంగా తినగలిగే వంటలు ఏం చేయాలా అనే ఆలోచన వస్తూనే ఉంటుంది. ఉపవాసం సమయంలో మీరు ఈ ఆలూ పకోడీ చేసుకోవచ్చు. దీంతో పాటే ఉపవాసం రోజు తినగలిగే గ్రీన్ చట్నీకూడా ఎలా చేయాలో చూసేయండి. ఉపవాసం రోజు కాకుండా మామూలు రోజు తినాలంటే కొన్ని మార్పులు చేస్తే సరి. ఇంకా సులభం అయిపోతుంది.

కుర్‌కురే ఆలూ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2-3 పెద్ద సైజు బంగాళాదుంపలు

1-2 చెంచాల షింగిడి గడ్డల పిండి

(ఉపవాసం లేకపోతే శనగపిండి వాడుకోవచ్చు)

సన్నగా తరిగిన కొత్తిమీర

2-3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు

సైందవ లవణం రుచికి తగినంత (ఉపవాసం లేని రోజు ఉప్పు వేసుకోవచ్చు)

జీలకర్ర పొడి ఒక టీస్పూన్

నిమ్మరసం రెండు టీస్పూన్లు

నూనె లేదా దేశీ నెయ్యి

గ్రీన్ చట్నీ కోసం:

గుప్పెడు పుదీనా ఆకులు

గుప్పెడు కొత్తిమీర తరుగు

2 పచ్చిమిర్చి

చెంచా నిమ్మరసం

అరచెంచా సైందవ లవణం లేదా ఉప్పు

పావు టీస్పూన్ వేయించిన జీలకర్ర

కుర్‌కురే ఆలూ పకోడీ తయారీ విధానం:

1. ముందుగా తొక్క తీసి బంగాళాదుంపలను బాగా కడగాలి. తర్వాత వాటిని సన్నని ముక్కల్లాగా పొడవుగా కట్ చేసుకోవాలి. దీనికోసం చిప్స్ కటర్ వాడొచ్చు. లేదా చాకుతో సన్నగా కట్ చేసుకోవచ్చు.

2. ఈ బంగాళాదుంప ముక్కలను నీటిలో రెండు మూడు సార్లు కడగాలి. ఒక పది నిమిషాలు నీటిలో అలాగే ఉంచి. తర్వాత జల్లెడలోకి తీసుకోవాలి. నీళ్లు వడిచిన తర్వాత పెద్ద గిన్నెలోకి ఈ ముక్కలను తీసుకోండి.

3. ఈ ముక్కల మీద షింగిడి గడ్డల పిండి లేదా కాస్త శనగపిండి లేదా కొద్దిగా కార్న్ ఫ్లోర్ చల్లుకోండి.

4. దాంట్లో ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, ఎండుమిర్చి, నూరిన నల్ల మిరియాలు, సన్నగా తరిగిన అల్లం, నిమ్మరసం రుచికి అనుగుణంగా రెండు చెంచాలు కలపాలి.

5. ఇప్పుడు చేతి వేళ్లతో కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. దీంతో ముక్కలకు మంచి కోటింగ్ లాగా అంటుకుంటుంది.

6. ఇప్పుడు బాణలిలో మంచి నూనె లేదా దేశీ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కాక మీడియం మంట మీద పెట్టుకుని అందులో బంగాళదుంప ముక్కల్ని విడివిడిగా పకోడీల్లాగా వేసుకోవాలి.

7. బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది.

గ్రీన్ చట్నీ తయారీ:

గ్రీన్ చట్నీ తయారు చేయడానికి కొత్తిమీర, పుదీనాను మిక్సీ జార్లో సమాన పరిమాణంలో తీసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం కూడా కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే అందులో కొద్దిగా వేయించిన జీలకర్రను కలుపుకోవచ్చు. వీటన్నింటినీ గ్రైండ్ చేసి రెడీగా ఉన్న ఆలూ పకోడీతో సర్వ్ చేసుకోండి.