International Potato day 2024: ప్రపంచంలో వంద కోట్ల మంది తింటున్న ఆహారం బంగాళాదుంపలు, ఇవి లేకుంటే ఎంతో మందికి ఆకలే
International Potato day 2024: ప్రపంచంలో అధిక సంఖ్యలో ఎక్కువమంది ఆకలిని తీరుస్తున్నవి వరి, గోధుమలు. ఆ తరువాత బంగాళాదుంపలే. అందుకే బంగాళాదుంపల కోసం ఒక ప్రత్యేకమైన దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
International Potato day 2024: బంగాళాదుంపలకు సీజన్‌తో సంబంధం లేదు. ఏ కాలమైనా కూడా అవి మార్కెట్లో కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. వాటి ధర కూడా పేదలకు అందుబాటు ధరలోనే ఉంటుంది. భూమ్మీద ఉన్న మనుషులు వినియోగిస్తున్న ముఖ్యమైన ఆహారాలలో వరి ప్రధానంగా ఉంది. ఆ తరువాత గోధుమలు ఉన్నాయి. గోధుమల తర్వాతి స్థానం బంగాళాదుంపలదే. వరి, గోధుములు, బంగాళదుంపలు... వీటిని తిని బతుకుతున్న వారే అంతా. ప్రపంచవ్యాప్తంగా ఒక 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది బంగాళదుంపల పైనే ఆధారపడుతున్నారు. పేదవాడి ఆహారంగా బంగాళదుంపలు పేరు తెచ్చుకున్నాయి. ప్రపంచం మొత్తం మీద 300 మిలియన్ మెట్రిక్ టన్నులను మించి పోయి బంగాళదుంపలను పండిస్తున్నారు.
బంగాళదుంపల్లో 4,000 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. అయితే అవన్నీ ఎక్కడపడితే అక్కడ దొరకవు. చాలా మటుకు అవివిలో పండే బంగాళదుంప జాతులు కొన్ని. ఇవి తినడానికి పనికిరావు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో బంగాళాదుంపలను ఉత్పత్తి చేస్తున్నారు. 1960 నుంచి బంగాళదుంపలు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
మనిషి జీవితంలో బంగాళదుంప ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి ఏడాది మే 30వ తారీఖున ఇంటర్నేషనల్ పొటాటో డే ను నిర్వహించుకుంటారు. ఎంతోమంది పేదల పొట్ట నింపుతున్న బంగాళదుంపలను ఓసారి స్మరించుకునేందుకే ఈ ప్రత్యేకమైన దినోత్సవం.
బంగాళాదుంపల చరిత్ర
బంగాళాదుంపలు ఈనాటివి కాదు. క్రీస్తుపూర్వం 5000 సంవత్సరంలోనే వీటిని పండించారనీ, తిన్నారనీ చెప్పుకుంటారు. ముఖ్యంగా దక్షిణ పెరూ, బొలీవియా ప్రాంతాలలో ఈ బంగాళదుంపలను మొదటిసారిగా పండించారని అంటారు. అప్పటినుంచి ఇవి మనుషుల ప్రధానమైన ఆహారాలలో ఒకటిగా మారిపోయాయి. బంగాళదుంపల్లో పోషక విలువలు ఎక్కువ. వీటిని తింటే స్థిరంగా శక్తి అందుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇవి అన్ని కాలాల్లోనూ పండుతాయి. వీటికి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు అవసరం లేదు. అందుకే ప్రతి పేద దేశం లోనూ బంగాళదుంపలు తినే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎంతోమంది ఆకలిని తీరుస్తున్న దుంపగా దీన్ని చెప్పుకుంటారు.
బంగాళదుంపలు వాతావరణ అనుకూల పంట. అంటే ఇతర పంటలతో పోలిస్తే తక్కువ స్థాయిలో గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. అంటే వాతావరణాన్ని ఇవి చాలా తక్కువగా కలుషితం చేస్తాయి. ప్రపంచంలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు బంగాళదుంపల పాత్ర ఎంతో ఉంది.
బంగాళదుంపలు పంట చాలా ప్రత్యేకమైనది. ఇది చలిని, వేడిని తట్టుకుని పండుతుంది. 2030 నాటికి బంగాళదుంపల ఉత్పత్తి ఇప్పటితో పోలిస్తే 112% పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోనే వీటి ఉత్పత్తి అధికంగా ఉంది.
బంగాళాదుంపల్లో 80% నీరే ఉంటుంది. మిగతా 20 శాతమే పిండి పదార్థం నిండి ఉంటుంది. వీటిని ఎలా వండుకున్నా రుచిగా ఉంటాయి. బంగాళదుంపలతో చేసే పదార్థాల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే ఎంతో మంది వీటిని ఇంట్లో నిల్వ ఉంచుకుంటారు. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కూడా.
ప్రపంచంలో బంగాళదుంపలను అధికంగా పండిస్తున్న దేశం చైనా. బంగాళాదుంపల్లో కొవ్వు ఒక శాతం కూడా ఉండదు. ఒకప్పుడు ఇది చాలా విలువైనవిగా భావించారు. బంగాళాదుంపలను ఇచ్చి బంగారాన్ని కొనుక్కునే రోజులు కూడా ఉండేవి.
బంగాళాదుంపల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే బి కాంప్లెక్స్, విటమిన్లు కూడా అధికంగానే ఉంటాయి. పొటాషియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా దొరుకుతాయి. అయితే డయాబెటిస్ రోగులకు మాత్రం బంగాళదుంపలు మంచివి కాదు. వీటిలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. వారు మాత్రం తక్కువగా తినాలి. మిగతావారు ఉడికించిన బంగాళదుంపలను తినడం వల్ల శక్తిమంతమవుతారు
టాపిక్