Daddojanam: బ్రేక్ ఫాస్ట్‌లో దద్దోజనం చేసుకుని తినండి, ఆ రోజంతా ఆకలి వేయదు, బరువు తగ్గడం సులువు
Daddojanam: దద్దోజనం అనగానే అందరికీ ప్రసాదమే గుర్తొస్తుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్‌గా కూడా తినవచ్చు. కావాలనుకుంటే రాత్రి భోజనంలోనూ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Daddojanam: దద్దోజనం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ప్రసాదమే. అమ్మవారికి దద్దోజనాన్ని ప్రసాదంగా నివేదించే వారి సంఖ్య ఎక్కువే. లలితా సహస్ర నామాల్లో కూడా ఈ దద్దోజనం ప్రస్తావన ఉంది. సంస్కృతంలో పెరుగుని దధీ అంటారు. పెరుగుతో చేసే అన్నం కాబట్టి దద్దోజనంగా మారిందని చెప్పుకుంటారు. దీన్ని ప్రసాదంగానే కాదు బ్రేక్ ఫాస్ట్‌గా కూడా తినవచ్చు. దీన్ని వేసవిలో బ్రేక్ ఫాస్ట్‌గా తినడం వల్ల ఆ రోజంతా శక్తి నిరంతరం అందుతూనే ఉంటుంది. అలాగే ఇతర ఆహారాలు తినాలన్న కోరికను తగ్గిస్తుంది. దీని వల్ల మీకు తెలియకుండానే మీరు త్వరగా బరువు తగ్గుతారు. దద్దోజనాన్ని పెరుగన్నం అనుకోకండి. పెరుగన్నంతో పోలిస్తే దద్దోజనం వండడం కాస్త భిన్నంగా ఉంటుంది. రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
దద్దోజనం రెసిపీకి కావలసిన పదార్థాలు
ఆవు పాలతో చేసిన పెరుగు - అర లీటరు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాలు - ఒక స్పూను
అల్లం తరుగు - ఒక స్పూను
నీరు - సరిపడినంత
బియ్యం - అరకప్పు
దద్దోజనం రెసిపీ
1. బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి.
2. కుక్కర్లో ఈ బియ్యాన్ని వేసి... ఒక బియ్యం గ్లాసుకు మూడు గ్లాసుల నీరు చొప్పున వేసి మెత్తగా వండుకోవాలి.
3. ఆ అన్నాన్ని చల్లార్చాక ఒక గిన్నెలో వేసుకోవాలి.
4. ఆ అన్నంలో పెరుగు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి.
5. అన్నం పూర్తిగా చల్లారాక బాగా గిలకొట్టిన పెరుగును వేసి కలుపుకోవాలి. కావాలంటే పైన కొత్తిమీర తరుగును కూడా చల్లుకోవచ్చు.
6. అంతే దద్దోజనం రెడీ అయినట్టే. దీన్ని పిల్లలకు తినిపిస్తే ఎంతో ఆరోగ్యం.
దద్దోజనం బ్రేక్ ఫాస్ట్ లో తింటే ఆ రోజంతా మీకు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాల వైపే మనసు మళ్లుతుంది. ఆకలి చాలా తక్కువ వేస్తుంది. కాబట్టి ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్‌లో దద్దోజనం ప్రయత్నించండి. దద్దోజనం ప్రత్యేక వంటకం. దీన్ని తిని చూస్తేనే దాని గొప్పతనం మీకు అర్థమవుతుంది.