Fake Garlic: వామ్మో నకిలీ వెల్లుల్లిపాయలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి, వాటిని ఇలా గుర్తించండి
Fake Garlic: నకిలీ ఆహార పదార్థాలు మార్కెట్లో అధికంగా చేరుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా నకిలీ వెల్లుల్లిపాయలు కూడా వచ్చేసాయి. వెల్లుల్లిపాయను చెక్ చేశాకే కొంటే మంచిది.
Fake Garlic: కూర, పప్పు, బిర్యానీ... ఏది వండాలన్నా వెల్లుల్లిపాయలు కచ్చితంగా ఉండాల్సిందే. ఇవి భారతీయ వంటకాలలో కీలకపాత్రను పోషిస్తాయి. అయితే విచిత్రంగా మార్కెట్లోకి నకిలీ వెల్లుల్లిపాయలు కూడా వస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. ఆహార పదార్థాలు కల్తీ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఫేక్ వెల్లుల్లిపాయల్ని తయారుచేసి అమ్మడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వెల్లుల్లిపాయలను సిమెంట్ పొడితో తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఫేక్ వెల్లుల్లిపాయలు విక్రయిస్తున్నట్టు తేలింది. వాటిని ఒలిచేందుకు ప్రయత్నిస్తే అవి పొడిపొడిగా రాలిపోవడం మొదలయ్యాయి. దీన్ని బట్టి నకిలీ వెల్లుల్లిపాయలు కూడా మార్కెట్లోకి వస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
నకిలీ వెల్లుల్లిపాయలను ఇలా గుర్తించండి
వెల్లుల్లిపాయలు కొనేటప్పుడు వాటి రంగును చూడండి. అవి సహజంగా తెలపు రంగులోనే ఉంటే ఫర్వాలేదు. పాలిష్ చేస్తున్నట్టు కాస్త మెరుపుదనంతో ఉంటే మాత్రం వాటిని రెబ్బలుగా ఒలిచి చూడాల్సిన అవసరం ఉంది. నిజమైన వెల్లుల్లి ఒకే ఆకారాన్ని లేదా ఆకృతిని కలిగి ఉండవు. కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా, కొన్ని ఒంపులు తిరిగి ఉంటాయి. నకిలీలు మాత్రం మరింత మృదువుగా,అన్నీ ఒకే ఆకారంలో కనిపిస్తాయి.
వెల్లుల్లి కొంటున్నప్పుడు పైన తొక్కను గోటితో తీసేందుకు ప్రయత్నించండి. తొక్క సున్నితంగా రాకుండా మందపాటి చర్మాన్ని కలిగి ఉంటే మాత్రం వాటిని కొనక పోవడమే మంచిది. అవి కల్తీవని అర్థం. నిజమైన వెల్లుల్లి నీటిలో ఉంచితే మునుగుతుంది, కానీ నకిలీ వెల్లుల్లి పైకి తేలిపోయే అవకాశం ఉంది. ఈ నీటి పరీక్ష ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
అసలైన వెల్లుల్లికి ఘాటైన వాసన ఉంటుంది. గోటితో ఒక రెబ్బను గిచ్చి చూడండి. మంచి వాసన వస్తుంది. నకిలీ వెల్లుల్లి మాత్రం ఎలాంటి వాననా రాదు. ఏది ఏమైనా వెల్లుల్లిని ప్యాకెట్లలో కొనే బదులు విడివిడిగా కొనుక్కోవడమే మంచిది. వాటిని చేత్తోనే నొక్కి పరీక్ష చేసుకోవచ్చు. అవి రెబ్బలుగా విడివిడిగా ఉంటే మంచి వెల్లుల్లి అని అర్థం. సాధారణ వెల్లుల్లితో పోలిస్తే నకిలీ వెల్లుల్లి ధర చాలా తక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా వెల్లుల్లిని కొనేటప్పుడే రెబ్బలుగా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే గోరుతో ఒకసారి నొక్కి చూసుకోవాలి.
వెల్లుల్లిని రోజూ ఎందుకు తినాలి?
వెల్లుల్లి ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా దక్కుతాయి. వీటి ఘాటైన రుచి ఎన్నో కూరలకు, బిర్యానీకి మంచి సువాసనను ఇస్తుంది. వెల్లులిలో ఔషధ లక్షణాలు కూడా ఎక్కువ. ఇది తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హై బీపీ అదుపులో ఉంటుంది .ఇది సహజంగానే యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. పెళ్లిళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఏవైనా గాయాలు తగిలినప్పుడు ఆ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి వెల్లుల్లికి ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. రోజుకొక వెల్లుల్లి రెబ్బ తింటే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.
టాపిక్