Beetroot for Diabetes: మధుమేహం ఉన్న వారు బీట్‌రూట్‌ తింటే మంచిదా?-know is it good to eat beetroot for diabetic patients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot For Diabetes: మధుమేహం ఉన్న వారు బీట్‌రూట్‌ తింటే మంచిదా?

Beetroot for Diabetes: మధుమేహం ఉన్న వారు బీట్‌రూట్‌ తింటే మంచిదా?

Koutik Pranaya Sree HT Telugu
Dec 24, 2023 07:00 PM IST

Beetroot for Diabetes: మధుమేహం ఉన్నవాళ్లకు బీట్‌రూట్ తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. నిజమేంటో వివరంగా తెల్సుకోండి.

బీట్‌రూట్
బీట్‌రూట్ (freepik)

దుంపలు అన్నింటిలో బీట్‌‌రూట్‌ని ఆరోగ్యకరమైన దుంపగా చెప్పవచ్చు. దీనిలో విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు లాంటివి పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా దుంప కూరలు ఎక్కువ గ్లైకమిక్‌ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. అందువల్ల డయాబెటీస్‌ ఉన్న వారు వీటిని తినడానికి వీలుకాదు. అయితే బీట్‌ రూట్‌ మాత్రం మోడరేట్‌ గ్లైకమిక్‌ ఇండెక్స్‌ని కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని మధుమేహం ఉన్న వారు కూడా అప్పుడప్పుడూ తింటూ ఉండవచ్చు. అసలు వారు దీన్ని ఎందుకు తినాలనే విషయాన్ని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.

పీచు పదార్థం అధికం:

సరళ పిండి పదార్థాలను తినడం వల్ల సహజంగా మనలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అయితే బీట్‌రూట్‌లో సంక్షిష్ట పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. అధికంగా పీచు పదార్థాలు ఉంటాయి. వీటితో కలిపి పిండి పదార్థాలను తినడం వల్ల అవి ఒక్కసారే అరిగిపోయి తొందరగా రక్తంలోకి చేరిపోవు. కొద్ది కొద్దిగా అరుగుతూ క్రమంగా రక్తంలో కలుస్తూ ఉంటాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారే పెరిగిపోవడం అనేది జరగదు. పీచు పదార్థాలు తగినంత పొట్టలోకి చేరడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య ఉన్న వారికీ ఇది చక్కగా పని చేస్తుంది. పొట్ట శుభ్రపడి అజీర్ణం సమస్య తగ్గుతుంది.

పోషకాలు మెండు:

బీట్‌రూట్‌లో ఫోలేట్‌, పొటాషియం, విటమిన్‌ సీ లాంటివి ఎక్కువగా లభ్యం అవుతాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో నైట్రేట్‌ అధికంగా ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో వాపుల్ని తగ్గిస్తాయి. కణాల వృద్ధిలో తోర్పడతాయి.

పరీక్ష చేసుకుంటూ ఉండాల్సిందే:

బీట్‌రూట్‌ని మధుమేహ వ్యాధిగ్రస్తులు మితంగా అప్పుడప్పుడూ తినవచ్చు. అయితే ఒక్కో ఆహార పదార్థం ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్కలా పని చేస్తూ ఉంటుంది. కాబట్టి కొత్తగా దీన్ని తింటూ ఉంటే గనుక మధ్య మధ్యలో షగర్‌ పరీక్ష చేయించుకుంటూ ఉండండి. ఒక వేళ ఇది మీకు పడక మధుమేహం ఎక్కువ అవుతుంటే మాత్రం దీని జోలికి వెళ్లకండి. లేదంటే మాత్రం అప్పుడప్పుడూ తింటూ ఉండొచ్చు. అందువల్ల పై ప్రయోజనాలన్నీ కలుగుతాయి. లేకపోతే వైద్యుల సలహా తీసుకుని ఆ ప్రకారం కూడా దీన్ని డైట్‌లో చేర్చుకోవాలో వద్దో మీరే నిర్ణయం తీసుకోండి.

Whats_app_banner