Blood Sugar control tips: రక్తంలో చక్కెరని సహజంగా నియంత్రించుకోవచ్చిలా..!
Blood Sugar control tips: డయాబెటిస్ ను సహజంగా నియంత్రించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. జీవన విధానంలో కొన్ని చిన్నపాటి మార్పుల వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.
మనం శరీర అవసరాలకు మించి కార్బోహైడ్రేట్‌లను తినేస్తుంటాం. స్వీట్లు, శీతల పానీయాలు అంటూ చక్కెరలను లోపలికి పంపించేస్తుంటాం. ఇలా ఎక్కువ కాలం చేస్తూ ఉండేసరికి శరీరంలో ఇన్సులిన్ విడుదల కావడం తగ్గిపోతూ వస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం మొదలెడతాయి. మధుమేహానికి కారణం అవుతాయి. దీని వల్ల గుండె సంబంధిత రోగాలు, స్ట్రోక్, మూత్రపిండాలు పాడైపోవడం లాంటి ఎన్నో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించుకోవచ్చు. అవేంటో తెలుసుకుని పాటించేందుకు ప్రయత్నం చేయాలి.
ఎక్కువ నీరు తాగాలి:
రోజూ మూడు లీటర్లకు పైగా నీటిని తాగుతూ ఉంటే శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇలా ఎక్కువ నీటిని తాగుతున్నప్పుడు మూత్ర పిండాలు ఎక్కువగా చక్కెరల్ని బటయకు పంపించడం మొదలుపెడతాయి. దీని వల్ల రక్తంలో చక్కెరలు తగినంత స్థాయిలో ఉంటున్నాయని అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
వ్యాయామం చేయాలి :
క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. అందువల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మన శరీరంలో మెరుగుపడుతుంది. అప్పుడు మన శరీర కణాలు మన రక్తంలోని చక్కెరను బాగా ఉపయోగించుకోగలుగుతాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. నడవడం, జాగింగ్, పరుగు, సైకిల్ తొక్కడం, కొండలెక్కడం, ఈతకొట్టడం, డ్యాన్స్ చేయడం, బరువులెత్తడం లాంటివన్నీ దీనికి మంచి వ్యాయామాల కిందకు వస్తాయి. కాబట్టి కనీసం వీటిలో ఏదో ఒకదాన్ని రోజూ చేసేందుకు ప్రయత్నించాలి.
తక్కువ పిండి పదార్థాలు.. ఎక్కువ పీచు :
మనం రోజూ తినే ఆహారంలో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు అవి శరీరంలోకి వెళ్లిన తర్వాత ఇన్సులిన్ వాటిని సక్రమంగా ఉపయోగించడానికి, దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీని వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. పిండి పదార్థాల్ని తగ్గించి తినడంతోపాటు పీచు ఉన్న పదార్థాల్ని ఎక్కువగా తినడానికి ప్రయత్నించాలి. అప్పుడు జీర్ణ క్రియ నెమ్మదిగా జరుగుతుంది. శరీరం ఒక్కసారే ఎక్కువ చక్కెరను శోషించుకోకుండా ఉంటుంది. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో ఈ ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది.
సరిపడ నిద్ర :
రోజూ కనీసం ఆరు నుంచి ఏడు గంటల సేపు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి. తక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఆకలి ఎక్కువ అవుతుంది. అలాగే నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల మనం సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఒత్తిడినీ తగ్గించుకోవాలి.
టాపిక్