Post workout mistakes: వ్యాయామం తర్వాత అస్సలు చేయకూడని పనులివే..
Post workout mistakes: ఉదయాన్నే శరీరం ఆరోగ్యం కోసం చేసిన కసరత్తుల తర్వాత వెంటనే కొన్ని పనులు చేస్తే పూర్తి ఫలితాలు పొందలేం. వ్యాయామం తర్వాత చేయకూడని పనులేంటో తెలుసుకోండి.
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనలో చాలా మంది ఉదయాన్నే వ్యాయామం చేస్తుంటాం. అందులో భాగంగా వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు, జిమ్, ఎరోబిక్స్, యోగా లాంటి రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటాం. అయితే ఇవి చేయడం వరకు అవగాహనతోనే ఉంటారు. కానీ ఆ తర్వాత ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. అలాంటి వారి కోసమే ఈ కథనం. వ్యాయామాల తర్వాత చేయకూడని పనులేంటో తెలుసుకుందాం.
ఏం తినకుండా ఉండొద్దు:
వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువ గంటల పాటు ఏం తినకుండా ఉండటం సరికాదు. ఓ అరగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏదో ఒకటి తినడం ఉత్తమం. శరీరం వ్యాయామం సమయంలో చాలా కేలరీలను కోల్పోతుంది. తిరిగి కండరాలు బలోపేతం కావాలన్నా, నీరసంగా ఉంటే కోలుకోవాలన్నా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మరీ ఎక్కువగా కాదు. కొంచెం మాత్రమే. అయితే వెంటనే కాదు. అరగంట తర్వాత అని గుర్తుంచుకోవాలి.
వేగంగా తాగొద్దు :
జాగింగ్, రన్నింగ్ లాంటివి చేసిన తర్వాత చాలా మందికి ఆయాసం వస్తుంది. చెమటలు బాగా పట్టేస్తాయి. దీంతో వారికి రన్నింగ్ లాంటివి పూర్తయిన వెంటనే గటగటా బోలెడు మంచి నీళ్లు తాగేయాలని అనిపిస్తుంటుంది. అయితే అలా ఎంత మాత్రమూ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం తర్వాత కనీసం ఓ 20 నిమిషాలకుగాని నీరు తాగొద్దంటున్నారు. ఆ తర్వాత మాత్రం కచ్చితంగా శరీరానికి నీటిని అందించాల్సిందే అంటున్నారు. చెమటల ద్వారా శరీరం కోల్పోయిన నీటిని తిరిగి శరీరానికి అందించడం వల్ల డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది.
స్నానం చేయొద్దు :
వ్యాయామం పూర్తయిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేసి చిరాగ్గా ఉంటుంది. దీంతో చాలా మంది వెంటనే స్నానం చేసేందుకు వెళ్లిపోతారు. అయితే దీని వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓ అరగంటైనా ఆగి తర్వాత మాత్రమే స్నానం చేయడానికి వెళ్లమని సలహా ఇస్తున్నారు. అలాగే వ్యాయామం అప్పుడు వేసుకున్న దుస్తులు చెమటలు పట్టేసి దుర్వాసన వస్తాయి. వాటిని అలా లాండ్రీ పెట్టెలో వేయడం కంటే.. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉతికేసుకోవాలి. అప్పుడు వాటిలో బ్యాక్టీరియా మరింత పెరిగిపోకుండా ఉంటుంది.
నిద్ర పోవద్దు :
శారీరక వ్యాయామం తర్వాత గుండె కొట్టుకునే వేగం కొంత పెరుగుతుంది. అందుకే ఎక్సర్‌సైజ్ తర్వాత ఇంటికొచ్చిన వెంటనే అలా నిద్రపోవద్దు. బదులుగా బాగా గాలి తగిలే ప్రదేశంలో కూర్చుని కాసేపు విశ్రాంతిగా ఉండాలి.