Running tips: రన్నింగ్ వేగంగా, ఎక్కువ దూరం చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ మీ సామర్థ్యం పెంచుతాయి..-want to run faster and longer here are the rules to follow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Running Tips: రన్నింగ్ వేగంగా, ఎక్కువ దూరం చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ మీ సామర్థ్యం పెంచుతాయి..

Running tips: రన్నింగ్ వేగంగా, ఎక్కువ దూరం చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ మీ సామర్థ్యం పెంచుతాయి..

Koutik Pranaya Sree HT Telugu
Aug 28, 2023 08:49 AM IST

Running tips: వేగంగా, ఎక్కువ సేపు పరిగెత్తే సామర్థ్యం రావాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.

రన్నింగ్ సామర్థ్యం పెంచే చిట్కాలు
రన్నింగ్ సామర్థ్యం పెంచే చిట్కాలు (Pixabay)

రన్నింగ్ ఒక మంచి వ్యాయామం. కొంతమందికి అది అలవాటయిపోయి దానిమీద ఎనలేని మక్కువ కూడా పెరుగుతుంది. దాన్ని చాలెంజింగ్ గా తీసుకుని ఒకరోజులో ఇంతదూరం పరుగెత్తాలంటూ రకరకాల టార్గెట్లు పెట్టుకుంటారు. అయితే కొత్తగా రన్నింగ్ ప్రారంభించేవాళ్లకు 5k రేస్ టార్గెట్ సరిపోతుంది. ప్రతి నెలా మారథాన్లలో పాల్గొనడం వల్ల రన్నింగ్ నైపుణ్యాలు పెరుగుతాయి. అయితే మీ శరీరం మీకు ఎంతవరకు సహకరిస్తుందనే విషయం మీద అవగాహన ఉండాలి. లేదంటే కండరాల గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే మెలమెల్లగా వేగాన్ని, దూరాన్ని పెంచుతూ వెళ్లాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేగంగా పరిగెత్తాలి అనుకునే వారు వెంటనే అది సాధించలేరు. సరైన పద్ధతిలో ప్రాక్టీసు చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి గాయాలు కాకుండా శరీరాన్ని కాపాడుకోవాలి. మీ వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచే విషయాలేంటో తెలుసుకుందాం.

రన్నింగ్ వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచే చిట్కాలు:

1. వీక్లీ మైలేజ్ 10 నుంచి 20 శాతం పెంచడం:

ప్రతి వారం.. మీరు వారం మొత్తం పరిగత్తిన దూరంలో తరువాతి వారం 10 నుంచి 20 శాతం పెరిగేలా చూసుకోవాలి. దాన్ని ప్రతిరోజూ పరిగెత్తే దూరానికి కలపండి. అలా వారమయ్యే సరికి మీరనుకున్నంత ఎక్కువ దూరం రన్నింగ్ చేసేస్తారు. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు రన్నింగ్ చేస్తే సామర్థ్యంలో మార్పు కనిపిస్తుంది. క్రమం తప్పకుండా, ఒకేరకమైన వేగంతో పరిగెత్తడం వల్ల మంచి మార్పు వస్తుంది.

2. ఆహారం:

ఏం తింటున్నామనే దాని ప్రభావం రన్నింగ్ మీద ఉంటుంది. మీ సామర్థ్యం దాని మీదే ఆధారపడి ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, ఓట్స్, ఎనర్జీ బార్స్ లాంటివి ఆహారంలో చేర్చుకోండి.

3. హైడ్రేషన్:

రోజులో తగినన్ని నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా శరీరంతో కసరత్తులు, రన్నింగ్ లాంటివి చేస్తున్నప్పుడు మరిన్ని ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. నీటితో పాటే హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉపయోగకరం.

4. స్ట్రెచ్చింగ్:

రన్నింగ్ తర్వాత స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల శరీరంలో ల్యాక్టిక్ యాసిడ్ జమకాకుండా కాపాడుతుంది. దానివల్ల కండరాల్లో నొప్పి, వాపు లాంటివి కనిపించవు. రన్నింగ్ తర్వాత స్ట్రెచ్చింగ్ చేయడం మర్చిపోవద్దు.

5. విశ్రాంతి:

ఎక్కువగా వర్కవుట్లు, రన్నింగ్ లాంటివి చేసినప్పుడు శరీరానికి సరిపడా విశ్రాంతి ఇవ్వాలి. ఎలాంటి గాయాలు కాకుండా ఉండటానికి, శరీరం మళ్లీ పుంజుకోవడానికి అది అవసరం. సరిపోయేంత నిద్ర పోవడం, మంచి ఆహారం తీసుకోవడం, తగినన్ని నీళ్లు తాగడం వల్ల మీ సామర్థ్యం పెరుగుతుంది.

6. స్పష్టమైన గోల్స్:

స్పల్ప కాలానికీ, దీర్ఘకాలానికి సంబంధించిన గోల్స్ కొన్ని పెట్టుకోండి. దూరం పెంచడం గురించి, సమయం తగ్గించడం గురించి, సామర్థ్యం గురించి, వారాంతపు, రోజూవారీ చిన్న, పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. వాటివల్ల కొత్త ఉత్సాహం వస్తుంది.

ఇవన్నీ పాటిస్తూనే మరొక విషయం గుర్తుంచుకోవాలి. మెరుగుదల రావాలంటే కాస్త సమయం అవసరం. జాగ్రత్తగా, మీ శరీరాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే మీరనుకున్న రన్నింగ్ లక్ష్యాల్ని చేరుకుంటారు.